vikraman
-
మంచానికే పరిమితమైన స్టార్ డైరెక్టర్ భార్యకు ప్రభుత్వ సాయం
'పుదు వసంతం', 'సూర్యవంశం' లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు విక్రమన్. తెలుగులో 'చెప్పవే చిరుగాలి', 'వసంతం' సినిమాలని డైరెక్ట్ చేశాడు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగాను పనిచేశాడు. కాగా ఈయన భార్య జయప్రియ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన పరిస్థితి గురించి జనప్రియ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్లో బయటపెట్టారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) వెన్ను నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నానని, వైద్యుల తప్పిదం వల్ల ఐదేళ్లుగా మంచానికే పరిమితమైనట్లు జయప్రియ చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు. తనకు తన భర్త అండగా ఉంటూ ఆస్తులను అమ్మి తనకు వైద్యం అందిస్తున్నారని ఈమె బాధని బయటపెట్టారు. బయటకు కూడా వెళ్లకుండా తన ఆరోగ్యం కోసమే పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు విక్రమన్ భార్య అనారోగ్యం గురించి తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆమెకు వైద్య సాయం అందించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్.. విక్రమన్ ఇంటికెళ్లి మరీ ఆయన సతీమణిని పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దర్శకుడు విక్రమన్.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) -
నా ట్రీట్మెంట్ కోసం ఆస్తులన్నీ అమ్మేశాడు.. ఏడ్చేసిన దర్శకుడి భార్య
తమిళంలో సూర్యవంశం, తెలుగులో చెప్పవే చిరుగాలి, వసంతం వంటి హిట్స్ అందించిన డైరెక్టర్ విక్రమన్. ఈయన చివరగా 2014లో నిన్నైతాతు యారో సినిమా తెరకెక్కించాడు. తమిళంలో ఎన్నో హిట్స్ తెరకెక్కించిన ఈయన దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆయన భార్య జయప్రియ తమిళ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. అయితే చాలాకాలంగా ఆమె ఆరోగ్యం అస్సలు బాగోలేదు. భార్య అనారోగ్యం వల్లే దర్శకుడు సినిమాలకు దూరమయ్యాడని తెలుస్తోంది. ఆపరేషన్‌కు ఒప్పుకున్నా తాజాగా జయప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాధలు చెప్పుకుంది. 'మొదట నాకు వెన్నునొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లాను. సిటీ స్కాన్ చేసి ఇది క్యాన్సర్‌లా ఉంది.. బయాప్సీ చేయాలన్నారు. నా భర్త భయపడి ఎటువంటి ఆపరేషన్ వద్దన్నాడు. కానీ నిజంగా క్యాన్సర్ అయితే వదిలేస్తే కష్టం కదా అని నేను ఆపరేషన్‌కు ఒప్పుకున్నాను. అరగంటలో పూర్తి చేస్తామన్నవాళ్లు మూడున్నరగంటలపాటు ఆపరేషన్ చేశారు. ఇది జరిగిన పది రోజుల తర్వాత అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఏం చేయాలో తెలియట్లేదు ఒక నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత నన్ను ఇంటికి పంపించారు. తరచూ ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారు. తర్వాత నన్నసలు పట్టించుకోనేలేదు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాను. అయినా నయం కాలేదు, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడూ నాకు తోడుగా ఇంట్లో ఇద్దరు నర్సులు ఉంటారు. నేను భరతనాట్య కళాకారిణి. ఇప్పుడేమో కనీసం లేచి నిలబడలేకపోతున్నాను. మూత్రవిసర్జనకు కూడా వెళ్లలేకపోతున్నాను. ప్రతి రెండు గంటలకోసారి యూరిన్ బ్యాగ్ వాడుతున్నాను. ఆస్తులన్నీ అమ్మేశాడు నా భర్త నా గురించి చాలా కంగారుపడుతున్నాడు. నా చికిత్స కోసం ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మేశాడు. ఇప్పటికీ చాలామంది ఆయన్ను సూర్యవంశం సినిమాకు సీక్వెల్ తీయమని అడుగుతున్నారు. కానీ నన్నీ పరిస్థితిలో వదిలేయడం ఇష్టం లేదని ఆగిపోతున్నారు' అంటూ ఎమోషనలైంది. వీరికి చిత్రపరిశ్రమ నుంచి ఎవరైనా సాయం చేస్తే బాగుండని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడని తిట్టిన శోభ.. మళ్లీ అంటా.. ఏం చేస్తావంటూ రెచ్చగొడుతూ.. -
నటుడు మోసం చేశాడు, డిప్రెషన్‌తో చనిపోదామనుకున్నా: లాయర్
తమిళ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, రాజకీయ నాయయకుడు ఆర్ విక్రమన్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అతడు తనను మోసం చేశాడంటూ విక్రమన్ మాజీ ప్రేయసి, దళితుల కార్యకర్త, న్యాయవాది కిరుబ మునుసామి సంచలన ఆరోపణలు చేస్తోంది. తనపై వేదింపులకు సైతం పాల్పడ్డాడని పేర్కొంది. ప్రస్తుతం విక్రమన్ విడుదలై చిరుదైగల్ కచ్చి(వీసీకే) పార్టీలో ఉండగా.. సదరు పార్టీ తనకు జరిగిన అన్యాయంపై స్పందించి ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది. నేను అమాయకుడిని తాజాగా ఈ ఆరోపణలపై విక్రమన్ స్పందించాడు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే ఈ కథలో రెండు కోణాలున్నాయన్నాడు. ఈ పూర్తి గొడవలో అసలైన బాధితుడిని తానేనన్నాడు. తన రాజకీయ, నట జీవితాన్ని దెబ్బ తీసేందుకే ఆమె ఇలా ఆరోపణలు గుప్పిస్తోంది. తనతో పెళ్లికి నిరాకరించానన్న కోపంతోనే ఇదంతా చేస్తోందంటూ వాట్సప్ చాట్ స్క్రీన్షాట్లు, కిరుబ రాసిన లేఖల ఫోటోలు ట్విటర్లో షేర్ చేశాడు. నిజంగా వేధిస్తే ఆ లేఖ అర్థమేంటి? '1. కిరుబ పీహెచ్డీ చదవడానికి యూకే వెళ్లినప్పుడు రాసిన ఉత్తరం. ఇది 2022 జూన్ 15న రాసింది. నేను నిజంగా వేధించేవాడినైతే.. ఎవరూ ఇలా లేఖ రాయరు. 2. నా కోసం కొన్న వస్తువులకు నేను కిరుబాకు డబ్బు చెల్లించిన సాక్ష్యాలు. తను నాకు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పాను. అన్నట్లుగానే అదే మాట మీద నిలబడ్డాను.. నాపై చేసిన ప్రతి ఆరోపణను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకమీదట నా గురించి ఏ తప్పుడు ఆరోపణలు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. చట్టప్రకారమే వాటి సంగతి తేలుస్తాను' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు విక్రమాన్. అసలేం జరిగిందంటే? విక్రమన్, కిరుబ ముసుసామి ప్రేమించుకున్నారు. ఏమైందే ఏమో కానీ కొంతకాలంగా వీరు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ఆదివారం నాడు కిరుబ.. విక్రమన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. '2013 నుంచే విక్రమన్ నాకు తెలుసు. ఓ కార్యక్రమానికి నేను గెస్ట్‌గా వెళ్లాను. అందులో విక్రమన్ కూడా పాల్గొన్నాడు. అలా మా పరిచయం మొదలైంది. 2020 ఆగస్టులో లండన్‌కు వెళ్లినప్పుడు అతడు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మరీ వీడ్కోలు పలికాడు. అక్కడికి వెళ్లిన రెండు నెలలకే నాతో రొమాంటిక్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. కులం పేరిట దూషణలు తనకు వీసీకే పార్టీ నుంచి పిలుపొచ్చిందని అబద్ధం చెప్పాడు. కేవలం తనకున్న కోరిక వల్ల ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటినుంచి తన రాజకీయ కెరీర్‌కు సపోర్ట్‌గా ఉండమని కోరాడు. ఏదైనా అడ్డు చెప్పానంటే చాలు.. కులం పేరుతో దూషించేవాడు. కులపిచ్చి ఉన్న వ్యక్తితో దూరంగా ఉండటం నయం అనుకున్న ప్రతిసారి క్షమించమని ఏడ్చేవాడు. మాట్లాడమని బతిమాలేవాడు. మారతాడనుకుని ఛాన్స్ ఇచ్చిన మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ కొంతకాలానికే ఎప్పటిలానే దూషించడం, ఏడ్చి సానుభూతి సాధించడం జరిగేది. మేనేజర్‌తో ఎఫైర్.. అడ్డంగా దొరిగాక తనతో రెండేళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత అతడితో విడిపోవాలని నిశ్చయించుకున్నాను. నేను అతడికి ఇచ్చిన డబ్బును తిరిగివ్వమన్నాను. అప్పుడు నన్ను బ్లాక్ చేశాడు. 3 నెలలపాటు ప్రయత్నించాను, పట్టించుకోలేదు. తీరా బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు తనే క్షమాపణలు అడిగాడు. ఎప్పటిలా కలిసుందాం అన్నాడు. మళ్లీ రొమాంటిక్‌గా చాట్ చేశాడు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక కూడా నాతో బానే ఉన్నాడు. అయితే అతడి మేనేజర్‌తో పెట్టుకున్న ఎఫైర్ నాకు తెలిసింది. ఓసారి వాళ్లిద్దరూ నాకు అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు అతడు నిజం అంగీకరించాడు. చనిపోదామనకున్నా ఏడాదిన్నరకాలంగా తనతో రిలేషన్లో ఉన్నానని ఒప్పుకున్నాడు. అతడి మాజీ ప్రేమికులు, స్నేహితులు దాదాపు 15 మందిని కలిశాను. తను చాలా దారుణంగా ప్రవర్తిస్తాడని చెప్పారు. నమ్మడం, మోసపోవడం, తిట్లు తినడం, కుంగిపోవడం.. ఇదే పనైపోయింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనై చనిపోదామనుకున్నాను. దీని నుంచి బయటపడేందుకు ఏడాది కాలంగా థెరపీ తీసుకుంటున్నాను అంటూ వాట్సాప్ స్క్రీన్షాట్లు షేర్ చేసింది. After having undergone a great deal of agony over the past few months & a huge disappointment, I'm writing in public. I've known @RVikraman since 2013 when he participated in an event in which I was a guest. When I left for London in Aug 2020, he voluntarily came to send me off. pic.twitter.com/AA2rTxagZm — Kiruba Munusamy (@kirubamunusamy) July 16, 2023 I deny the allegations made against me by Ms. Kiruba Munusamy in entirety. A coin has two sides likewise this story also has two sides. "There is only one victim in this issue and it is me rather than the person making the accusations against me". We were acquaintances till… pic.twitter.com/IGCFE0PrBl — Vikraman R (@RVikraman) July 17, 2023 చదవండి: ఈ వారం ఏయే సినిమాలు రిలీజవుతున్నాయంటే? అద్దె ఇంట్లో నుంచి గెంటివేత..రూ.5 జీతం నుంచి లక్షలు తీసుకునే స్టార్ హీరోయిన్గా... కలిసిరాని రెండు పెళ్లిళ్లు! -
దర్శకుడి తనయుడు హీరోగా 'హిట్ లిస్ట్'.. విలన్‌గా గౌతమ్ మీనన్
సీనియర్ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం హిట్ లిస్ట్. ఆర్కే సెల్యులాయిడ్ పతాకంపై ఇంతకు ముందు తెనాలి, గూగుల్ కుట్టప్పా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం హిట్ లిస్ట్. ఆయన శిష్యులు సూర్య కదీర్, కార్తికేయన్ల ద్వయం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో నటి సితార, ఐశ్వర్య దత్తా, మునీశ్ కాంత్, బాలా శరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినయ, కేజీఎఫ్ గరుడా రామచంద్రన్ తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకులు తెలిపారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని, తుదిదశకు చేరుకుందనీ తెలిపారు. కాగా ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం అన్నారు. ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం పతాక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందన్నారు. చదవండి: ఆ క్రికెటర్‌ను ప్రేమించా.. కానీ -
ఒక పల్లవి నాలుగు చరణాలు
అమ్మాయిలని నోట్స్ అడగడం కూడా చాలా కష్టమైన రోజులు అవి. వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం తప్పు. పలకరించడం నేరం. కాఫీకి పిలవాలంటే న్యూక్లియర్ ఫార్ములాను డిరైవ్ చేసినంత పని. ఇక లవ్ లెటర్... హడల్. అబ్బాయిలు వేరు... అమ్మాయిలు పూర్తిగా వేరు అనుకునే 1990ల రోజులు అవి. పొడుగు జడలు, పవిటా పావడాలు, బిఎస్ఏ ఎస్సల్లార్ ఎక్కి తల వొంచుకుని వెళ్లి చదువుకునే అలాంటి రోజుల్లో ఇవాళ అమెరికాలో జరుగుతున్నట్టుగా, ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో ఉంటే? వారు రూమ్‌ను షేర్ చేసుకుంటే? స్నేహాన్ని పంచుకుంటే... ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఉంటే? ఇలాంటి కథా? ఇలాంటి కథే అన్నాడు త్రివిక్రమన్. తీశాడు. ప్రేక్షకుల ముందు ఉంచాడు. జనం ఏం చేశారు? వాళ్లల్లో ఒకడు తనను తాను ఎస్.పి.బి అనుకున్నాడు. ఇంకొకడు ఇళయరాజా అనుకున్నాడు. మరొకడు కె.వి.మహదేవనో, పుహళేందో. నలుగురూ మద్రాసు చేరారు మ్యూజిక్ రంగంలో రాణిద్దామని. ఎవరూ ఆదరించలేదు. ఏవీఎం, విజయా గార్డెన్స్ గేట్లు వారి కోసం తెరుచుకోలేదు. పాట అందుకుంటే, కీర్తన ఆలపిస్తే కడుపు నిండదు. తినడానికి డబ్బులు కావాలి. వారి దగ్గర లేవు. ఆత్మాభిమానానికి ఆకలి ప్రథమ శత్రువు. వాళ్లు నలుగురు స్ట్రీట్ సింగర్స్‌గా మారారు. చెట్టు కింద, పేవ్మెంట్ మీద, బీచ్‌లో, బస్టాండ్ సమీపంలో గుడ్డ పరిచి పాట మొదలుపెట్టారు. రోజూ నాలుగు చోట్ల కచ్చేరీలు. దారిన పోయేవాళ్లు ఆగి కాసేపు విని చిల్లర పడేస్తే ఆ పూటకు భోజనం. లేకుంటే లేదు. వాళ్లు బతకడమే కష్టం అనుకుంటే ఇంకో పొట్ట కూడా తోడు చేరింది. అమ్మాయి. ఇప్పుడేమవుతుంది? మద్రాసులో ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఊరు విడిచి వచ్చింది. ఆ అడ్రస్‌లో ఆమెకు కావలిసినవారు లేరు. వీళ్లు కనిపించారు. ఆ అమ్మాయి వీరి వెంట నడిచింది. వయసులో ఉన్న కుర్రాళ్లందరూ గోడలు దూకేవాళ్లే అయి ఉండరు. కొందరు ఆశ్రయం కోరేవారికి పైకప్పుగా కూడా నిలబడగలుగుతారు. ఆ అమ్మాయి కష్టంలో ఉందని ఆ నలుగురు గ్రహించారు. తమ గదిలోనే చోటు ఇచ్చారు. వీధి ఆశ్చర్యపోయింది. హౌస్ ఓనరమ్మ ముక్కున వేలేసుకుంది. కాని మన ప్రవర్తనే మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. త్వరలోనే వారిని ఆ వాడ యాక్సెప్ట్ చేసింది. డాబా మీద గది. రోజూ కనిపించే చందమామ. పిసినారితనం చూపకుండా హాయిగా వీచే చల్లగాలి. కొద్దిగా తిన్నా కడుపు నింపగల అన్నం. చేయగలిగిన కూర. బోలెడన్ని కబుర్లు. శ్వాస అంత సులభంగా తోడుగా ఉండే పాట. పాటలలోన జీవితమే పలికేను అంట.. మాటలలో చందనమే వెదజల్లేనంట... ఒక పల్లవికి నాలుగు చరణాలు తోడయ్యాయి. వాళ్లు జీవితంలో పైకి రావాలంటే వీధుల వెంట పాడటం మాని మంచి అవకాశాల కోసం ప్రయత్నించాలి అని ఆ అమ్మాయి వారికి చెబుతుంది. దాని కోసం జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి ఏరోజుకారోజు డబ్బు కూడబెట్టేలా చేస్తుంది. ఈ లోపు ఆమె గతం కూడా వారికి చెబుతుంది. ఆమె ప్రేమించినవాడు దేశంలో లేడు. రేపో మాపో వస్తాడు... వస్తే అతడిని పెళ్లి చేసుకోవాలి... అందుకోసమే ఎదురు చూస్తోంది... ఆ విషయం తెలిసి వాళ్లు నలుగురు సంతోషపడతారు. అందరూ ఆ రాబోయేవాడి కోసం ఎదరు చూస్తూ ఉంటారు. కాని వచ్చేవాడు ఫల్గుణుడు కాదు. ఫాల్తు వెధవ. కుసంస్కారి. ఆడపిల్లకు వ్యక్తిత్వం ఉందని లోకం అంగీకరించదు. మగవాళ్లు స్నేహానికి, వ్యక్తిత్వానికి విలువ ఇస్తారన్నా లోకం నమ్మదు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో సంవత్సరం పాటు ఉంటున్నారంటే వాళ్ల మధ్య ఏమీ ఉండకుండా ఉంటుందా? కథ చూస్తున్న ప్రేక్షకులకు వారి మధ్య ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది. కాని పాత్రధారి అయిన ఆ అమ్మాయి ప్రియుడికి మాత్రం తెలియదు. అతడు తెలివి మీరుతాడు. ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అమ్మాయి హర్ట్ అవుతుంది. ఎందుకు చేయించావ్ అని అడిగితే పావలా రీఫిల్ కొనేటప్పుడు కూడా నాలుగుసార్లు రాసి చూసి కొంటాము... జీవితాంతం చూసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటాడు. సీతకు కూడా అగ్నిపరీక్ష ఉందని అంటాడు. ‘సీత చెడిపోవాలనుకుంటే అయోధ్యలోనే చెడిపోయి ఉండవచ్చు. అశోకవనంలోనే కాదు’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఎవరైతే నన్ను నమ్మాలో నువ్వు నన్ను నమ్మలేదు. ఎవరినైతే నేను అనుమానంగా చూడాలో వారు నన్ను నమ్మారు. ఇక నీకూ నాకూ పడదు. గుడ్‌బై’ అని ఆ అమ్మాయి అతణ్ణి వదిలి తను ఇష్టపడే, గౌరవించే నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ల ట్రూప్‌లో సభ్యురాలిగా ఉండిపోతుంది. ఆ ఐదుగురు కలిసి ఇప్పుడొక స్నేహగీతం అయ్యారు. దానిని సరిగా వినగలిగే సంస్కారం ఉన్నవాళ్లే వాళ్లకు తోడవుతారు. లేకుంటే? వాళ్ల దారిలో వారలా సాగిపోతూనే ఉంటారు. అమ్మాయి అబ్బాయి అనగానే ప్రేమ, కామం అని స్థిరపడిన లోకానికి వారి మధ్య స్నేహం కూడా సాధ్యమే అని చాలా తర్కబద్ధంగా, సంస్కారవంతంగా నిరూపించిన కథ కొద్దిగా అయినా ప్రేక్షకులను మారుస్తుంది. ఈ సినిమా అవసరం ఆ కాలం కంటే ఈ కాలం ఎక్కువగా ఉంది. ప్రేమ కోసం కత్తిపట్టుకునే వాళ్లంతా ఈ సినిమా డీవీడీ పట్టుకుంటే ఎంత బాగుండు? పుదు వసంతం దర్శకుడు విక్రమన్ తన తొలి సినిమాగా ప్రేక్షకుల మీదకు సంధించిన ఈ కొత్త తరహా కథ ‘పుదు వసంతం’గా 1990లో విడుదలయ్యి తమిళంలో సినిమా కథా ధోరణినే మార్చేసింది. పాడే హీరోలు, స్నేహం చేసే హీరోలు, నలుగురు కుర్రాళ్ల కథలు... ఇలాంటివి భారతీయ భాషలలో పుంఖాను పుంఖాలుగా రావడానికి ఈ సినిమా బీజం వేసింది. తమిళ నటుడు మురళి, ఆనంద్ బాబు, సితార వీళ్లంతా ఈ సినిమాతో చాలా పేరు సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఈ సినిమా పాటలతో ఇళయరాజా ధాటికి తట్టుకుని నిలబడగలిగాడు. ‘స్త్రీని పరీక్షించే పురుష స్వభావాన్ని’ ప్రశ్నించినందుకే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశారు. దీని ప్రభావంతో చిరంజీవి, సాక్షి శివానంద్లతో ‘ఇద్దరు మిత్రులు’ తీశారుకాని సఫలం కాలేదు. అలాగే తరుణ్ హీరోగా ఇదే ధోరణిలో 2002లో ఒక ‘నవ వసంతం’ వచ్చింది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ చౌదరి, విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలలో ‘శుభాకాంక్షలు’, ‘రాజా’, ‘మా అన్నయ్య’, ‘సూర్యవంశం’ తదితర భారీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో విక్రమన్ది ఒక శకం. – కె -
విక్రమన్ టీంకే పట్టం
తమిళసినిమా: ఆదివారం జరిగిన తమిళ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు విక్రమన్ జట్టుకే పట్టం కట్టారు. స్థానిక వడపళనిలోని సంగీత కళా కారుల కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో పుదువసంతం, పుదియఅలైగళ్ వర్గాల మధ్య పోటీ జరిగినా, పుదువసంతం నుంచి అధ్యక్షపదవి బరిలో ఉన్న విక్రమన్, కార్యదర్శి పదవి పోటీల్లో ఉన్న ఆర్కే సెల్వమణిలతో పుదియ అలైగళ్ వర్గం పోటీ పెట్టలేదు. మిగిలిని పదవులు ఉపాధ్యక్షుడు, ఉప కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ జరిగింది. అయితే ఈ సారి కూడా విక్రమన్ వర్గమే విజయకేతం ఎగురవేసింది. కాగా దర్శకుడు విక్రమన్ తమిళ దర్శకుల సంఘం అధ్యక్షపదవికి మూడోసారి ఎంపికయ్యారన్నది గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సంఘానికి కార్యదర్శిగా ఎంపికైన ఆర్కే సెల్వమణి ఫెఫ్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఫెఫ్సీకీ తమిళ నిర్మాతల మండలికి మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనిపించడం లేదు. సభ్యుల వేతనాల విషయంలో నిబంధనలు పాటించాలని ఫెఫ్సీ, మీకు మీరుగా విధించుక్ను నిబంధనలను తాము పాటించేది లేదని తమిళ నిర్మాతల మండలి పట్టుపడుతుండడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో మంగళవారం నుంచి ఫెఫ్సీ సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా తాము షూటింగ్‌లు నిర్వహిస్తామని నిర్మాతల మండలి ప్రకటన చేయడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొంది. ఈ విషయంలో ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్కే.సెల్వమణి తమిళ దర్శకుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో దర్శకుల సంఘం ఈ వివాదంలో ఏ పక్షాన నిలుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
ఆ అవసరం లేదు
తమ ఎదుగుదలను ఓర్వలేక గౌరవానికి భంగం కలిగించే చర్యల్లో భాగంగా తనపై చెక్కుమోసం కేసు పాల్పడ్డారని దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే... కోయంబత్తూరు రామ్‌నగర్ సెంగుపా వీధికి చెందిన ప్రదోష్ (33) అనే ఫైనాన్షియర్ రెండు వారాల క్రితం కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్‌కు ఒక ఫిర్యాదు చేశారు. అందులో నీలగిరి జిల్లా కొత్తగిరికి చెందిన విన్సెంట్ టి.బాలు, చెన్నై నుంగంబాక్కంకు చెందిన సినీ దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ తనకు చెక్కు మోసంతో 14 లక్షల వరకు ఏ మార్చినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసివిచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కోయంబత్తూరులో రోటరీ క్లబ్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త ప్రస్తుతం తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను కూచిపూడి నృత్యకళాకారిణిగా నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నానని చెప్పారు. చిత్ర రంగంలో తన భర్తపై వ్యతిరేకత ఉన్న కొందరు తమపేరు, ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చెక్కుమోసం కేసు పెట్టించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తమకు ఎలాంటి ఆర్థిక సమస్య లూ లేవని, ఎవరినో మోసం చేయాల్సిన అవసరం తమకు లేదని జయప్రియ పేర్కొన్నారు.