తమిళంలో సూర్యవంశం, తెలుగులో చెప్పవే చిరుగాలి, వసంతం వంటి హిట్స్ అందించిన డైరెక్టర్ విక్రమన్. ఈయన చివరగా 2014లో నిన్నైతాతు యారో సినిమా తెరకెక్కించాడు. తమిళంలో ఎన్నో హిట్స్ తెరకెక్కించిన ఈయన దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆయన భార్య జయప్రియ తమిళ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. అయితే చాలాకాలంగా ఆమె ఆరోగ్యం అస్సలు బాగోలేదు. భార్య అనారోగ్యం వల్లే దర్శకుడు సినిమాలకు దూరమయ్యాడని తెలుస్తోంది.
ఆపరేషన్‌కు ఒప్పుకున్నా
తాజాగా జయప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాధలు చెప్పుకుంది. 'మొదట నాకు వెన్నునొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లాను. సిటీ స్కాన్ చేసి ఇది క్యాన్సర్‌లా ఉంది.. బయాప్సీ చేయాలన్నారు. నా భర్త భయపడి ఎటువంటి ఆపరేషన్ వద్దన్నాడు. కానీ నిజంగా క్యాన్సర్ అయితే వదిలేస్తే కష్టం కదా అని నేను ఆపరేషన్‌కు ఒప్పుకున్నాను. అరగంటలో పూర్తి చేస్తామన్నవాళ్లు మూడున్నరగంటలపాటు ఆపరేషన్ చేశారు. ఇది జరిగిన పది రోజుల తర్వాత అడుగు తీసి అడుగు వేయలేకపోయాను.
ఏం చేయాలో తెలియట్లేదు
ఒక నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత నన్ను ఇంటికి పంపించారు. తరచూ ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారు. తర్వాత నన్నసలు పట్టించుకోనేలేదు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాను. అయినా నయం కాలేదు, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడూ నాకు తోడుగా ఇంట్లో ఇద్దరు నర్సులు ఉంటారు. నేను భరతనాట్య కళాకారిణి. ఇప్పుడేమో కనీసం లేచి నిలబడలేకపోతున్నాను. మూత్రవిసర్జనకు కూడా వెళ్లలేకపోతున్నాను. ప్రతి రెండు గంటలకోసారి యూరిన్ బ్యాగ్ వాడుతున్నాను.
ఆస్తులన్నీ అమ్మేశాడు
నా భర్త నా గురించి చాలా కంగారుపడుతున్నాడు. నా చికిత్స కోసం ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మేశాడు. ఇప్పటికీ చాలామంది ఆయన్ను సూర్యవంశం సినిమాకు సీక్వెల్ తీయమని అడుగుతున్నారు. కానీ నన్నీ పరిస్థితిలో వదిలేయడం ఇష్టం లేదని ఆగిపోతున్నారు' అంటూ ఎమోషనలైంది. వీరికి చిత్రపరిశ్రమ నుంచి ఎవరైనా సాయం చేస్తే బాగుండని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడని తిట్టిన శోభ.. మళ్లీ అంటా.. ఏం చేస్తావంటూ రెచ్చగొడుతూ..
Comments
Please login to add a commentAdd a comment