అది మగతనం కాదు! | DMK suspends Radha Ravi for his sexist comments about actor Nayanthara | Sakshi
Sakshi News home page

ఆడవాళ్లని తక్కువగా మాట్లాడటం మగతనం కాదు

Published Tue, Mar 26 2019 2:40 AM | Last Updated on Tue, Mar 26 2019 9:19 AM

DMK suspends Radha Ravi for his sexist comments about actor Nayanthara - Sakshi

‘కొలైయుదిర్‌ కాలమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తమిళ నటుడు రాధారవి (ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్‌ రాధా తనయుడు) నయనతారపై అగౌరవమైన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళ ఇండస్ట్రీ మండిపడుతోంది. పలువురు నటులు, నటీమణులు, దర్శక–నిర్మాతలు ఈ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. ‘డీఎంకే’ పార్టీ రాధారవిని సస్పెండ్‌ చేసింది. తనపై రాధారవి చేసిన వ్యాఖ్యలకు నయనతార ఓ లేఖ ద్వారా స్పందించారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా...

‘‘మన పని మాత్రమే మాట్లాడాలనే పాలసీని నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నా స్టాండ్‌ గురించి, అసభ్యకర కామెంట్స్‌ పాస్‌ చేసేవాళ్ల ప్రవర్తనతో బాధపడుతున్న స్త్రీల తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా రాధారవి స్పీచ్‌పై వెంటనే చర్య తీసుకున్న ‘డీఎంకే పార్టీ అధినేత’ ఎం.కే స్టాలిన్‌గారికి  నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాధారవికి, ఆయనలా ఆలోచించే అందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఒక్కటే.

మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్త్రీ అనే సంగతి మరువకండి. స్త్రీలను కించపరచడం, కామెంట్స్‌ చేయడం, అగౌరవపరచడాన్ని ఇలాంటి మతిస్థిమితం సరిగ్గా లేని మగవాళ్లు మగతనంగా భావిస్తున్నారు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తోంది. అలాగే ఇలా కామెంట్‌ చేయడం గొప్ప అని భావించే మగవాళ్ల కుటుంబంలో ఉంటున్న స్త్రీలందరి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక సీనియర్‌ నటుడైన రాధారవి తర్వాతి జనరేషన్‌కు రోల్‌ మోడల్‌గా ఉండాలనుకోకుండా స్త్రీ విద్వేషకుడిగా మిగిలిపోవాలనుకున్నారు.

అన్ని రంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను చాటుతూ, ప్రస్తుతం ఉన్న పోటీలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. బిజినెస్‌లో వెనకబడిపోయిన రాధారవి లాంటి వాళ్లు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి వార్తల్లో నిలవాలనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్త్రీలను తక్కువ చేసే వ్యాఖ్యలకు కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం. ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్‌ను ప్రోత్సహించినంత వరకూ రాధారవి లాంటి వాళ్లు స్త్రీలను తక్కువ చేయడం, చీప్‌ జోక్స్‌ వేయడం చేస్తూనే ఉంటారు.

నా అభిమానులు, సక్రమంగా నడుచుకునే సిటిజెన్స్‌ అందరూ ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఈ లేఖ ద్వారా రాధారవి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు అద్భుతమైన అవకాశాలు, ప్రేమను పంచే ప్రేక్షకులను ఇచ్చాడు. ఈ నెగటివ్‌ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఎప్పటిలా సీతలా, దెయ్యంలా, గాళ్‌ఫ్రెండ్‌లా, లవర్‌లా, భార్యలా.. ఇలా అన్ని పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి నిరంతరం కృషిచేస్తాను. చివరిగా నడిగర్‌ సంఘా (నటీనటుల సంఘం)నికి నాదో ప్రశ్న.

సుప్రీమ్‌ కోర్ట్‌ ఆదేశించినట్టు ‘ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ’ ని ఎప్పుడు నియమిస్తారు? విశాఖ గైడ్‌లెన్స్‌ను అనుసరిస్తూ ఇంటర్నల్‌ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఈ సమయంలో నాతో నిలబడిన  అందరికీ ధన్యవాదాలు ’’.‘కొలైయుదిర్‌ కాలమ్‌’ ఈవెంట్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రాధారవి సోమవారం అపరాదభావం వ్యక్తం చేశారు. ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ – ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను బాధపెట్టి ఉంటే, నేను పశ్చాత్తాపపడుతున్నాను.

ఒకవేళ నా చర్యల వల్ల డీఎంకే పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే పార్టీ నుంచి తప్పుకోవడానికైనా నేను సిద్ధమే’’ అని పేర్కొన్నారు రాధారవి. నయనతారను అందరూ సపోర్ట్‌ చేస్తుంటే నటుడు సిద్ధార్థ్‌ మాత్రం ‘మనకు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఎదురు తిరిగితే ధైర్యవంతులు అవ్వం’ అని ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ని ఉద్దేశించి నయనతార బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ‘‘మీటూ’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉదృతంగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.

సోషల్‌ మీడియాలో మీటూ గురించి స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఆ ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తున్నట్లు కాదు. నయనతార స్త్రీ సంక్షేమం కోసం ఎప్పుడూ నిలబడతారు. ‘మీటూ’ బాధితులకు ఆర్థికంగా, నైతికంగా నిలబడ్డారు. తన సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించారు. కానీ వీటిని సోషల్‌ మీడియాలో చెప్పుకోలేదు. చేసిన మంచిని బయటకు చెప్పుకోకుండా మౌనంగా ఉన్నవారి గురించి కామెంట్‌ చేయడం బాధాకరం’’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత సిద్దార్థ్‌ ‘నేను చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోయాను. గౌరవప్రదంగా ఆ ట్వీట్స్‌ను డిలీట్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

రాధారవిగారు మీరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి కేవలం రవి అని పిలిపించుకోండి. ఎందుకంటే మీ పేరులో కూడా ఒక స్త్రీ పేరు ఉంది.
       – విశాల్, నటుడు, ‘నడిగర్‌ సంఘం’ జనరల్‌ సెక్రటరీ
ఒక అద్భుతమైన నటి (నయనతార) గురించి రాధారవి చేసిన కామెంట్స్‌ విన్నాను. సార్‌ మీరు చేసిన కామెంట్స్‌ మీ అసభ్యకరమైన గుణాన్ని, ఆ  నటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. యాక్టింగ్‌ కమ్యూనిటీ సిగ్గుపడేలా చేశారు.
– రానా, నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement