చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా!
అమితాబ్ బచ్చన్‌ని చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. 72 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా సినిమాలూ, యాడ్స్ చేస్తున్నారు. ‘ఎందుకండీ ఇంత కష్టపడతారు.. రెస్ట్ తీసుకోవచ్చుగా’ అని ఎవరైనా అమితాబ్‌తో అంటే, ‘ఇప్పుడు నాకేమైందని రెస్ట్ తీసుకోవాలి. బాగానే ఉన్నానుగా’ అని నవ్వుతూ అనేవారు. ఇప్పుడు మాత్రం ఆయన ఓపిక సన్నగిల్లుతోందట. ‘ఇంత ఎనర్జీ మీకు ఎక్కణ్ణుంచి వస్తోంది? ఇంత బిజీగా ఎలా పని చేయగలుగుతున్నారు?’ అని ఎవరైనా అడిగితే అమితాబ్‌కి చిరాకుగా ఉంటోందట.
ఆ విషయం గురించి ఆయన చెబుతూ - ‘‘నేనూ అందరిలాంటి మనిషినే. ఈ వయసులో ఇంట్లో కాలక్షేపం చేయకుండా పని చేయడమేంటి? అని అడుగుతుంటే కోపం వస్తోంది. కొంతమందేమో అతిగా పొగుడుతున్నారు. మీరు సూపర్ సార్.. మీ ఎనర్జీ అదుర్స్ సార్ అని పొగుడుతుంటే ఇబ్బంది ఉంటోంది. అందుకే ఎవరూ నన్ను పొగడొద్దు. నా పని నేను చేస్తున్నాను. ఉదయం పని చేస్తా.. మధ్యాహ్నం చేస్తా.. అవసరమైతే రాత్రిపూట కూడా చేస్తా.. పని చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా. నాకు అందులోనే ఆనందం ఉంది. నా ఆనందం కోసం చేస్తున్న పనికి ప్రశంసలు ఆశించడంలేదు’’ అన్నారు.