ఆ పాట కోసమే... రోజూ ఆ సినిమాకు!
సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాలుగా మారిన చలనచిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, విశేషాలు చాలానే ఉంటాయి. హిందీ సినిమా పాపులర్ హిట్స్‌లో ఒకటిగా వెలిగి, ఆ మధ్య హిందీతో సహా వివిధ భాషల్లో రీమేక్ కూడా అయిన ‘డాన్’ (1978) గురించీ అలాంటి సంగతులు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఆ చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేర రీమేక్ చేస్తే, ఆ మధ్య అదే కథ షారుఖ్ ఖాన్‌తో మళ్ళీ హిందీలోనూ, తెలుగు, తమిళాల్లో ‘బిల్లా’ గానూ పునర్నిర్మాణమైంది.
మొన్న మంగళవారంతో 37 ఏళ్ళు నిండిన ‘డాన్’ చిత్రం గురించి ఇప్పటి దాకా చాలామందికి తెలియని కొన్ని గమ్మత్తై విషయాలను అమితాబ్ అందరితో పంచుకున్నారు. చంద్రా బారోత్ దర్శకత్వంలో అప్పటి బాలీవుడ్ అగ్రతార జీనత్ అమన్‌తో కలసి నటించిన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘డాన్’ అనగానే అందరికీ ‘ఖైకే పాన్ బనారస్‌వాలా...’ అనే హిట్ పాట గుర్తుకొస్తుంది. నిజానికి, ఆ పాట సినిమాలో మొదట లేదట. సినిమా రఫ్ కాపీ చూసిన అగ్రనటుడు మనోజ్ కుమార్ ఒకప్పుడు తన సినిమాలన్నిటికీ సహాయ దర్శకుడిగా పనిచేసిన చంద్రా బారోత్‌కు ఒక సలహా ఇచ్చారట! సెకండాఫ్‌లో ఒక పాట పెట్టమన్న మనోజ్ కుమార్ సూచన ఫలితమే - ఆ పాట అని అమితాబ్ వెల్లడించారు.
‘‘చిత్ర రచయితలైన ప్రసిద్ధ సలీమ్ - జావేద్ ద్వయం సినిమా రషెస్, ముఖ్యంగా కిళ్ళీ నమిలే నకిలీ డాన్ సన్నివేశాలు చూసి శ్రీనగర్‌లో మరో సినిమా షూటింగ్‌లో ఉన్న నన్ను అభినందిస్తూ టెలిగ్రామ్ పంపారు. అప్పుడు ప్యాలెస్ హాటల్‌లోని గదిలో ఉండగా నాకు ఆ టెలిగ్రామ్ రావడం, అప్పటి నా అనుభూతి ఇప్పటికీ గుర్తే’’ అని బిగ్ బి గుర్తు చేసుకున్నారు. ఇక, ఆ సినిమా రిలీజైనప్పుడు ఇప్పటి ప్రసిద్ధ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ దుబాయ్‌లో ఉన్నారట! ఆ పాట చూసిన ఆమె అది తెగ నచ్చేసింది. దాంతో, కేవలం ఆ పాట చూడడానికే రోజూ సినిమాకు వెళ్ళేవారట! ‘‘అలా చాలా రోజుల పాటు చేసినట్లు సరోజ్ నాకు స్వయంగా చెప్పారు. ప్రతిరోజూ ఆ పాట సమయానికి వెళ్ళి, అది చూసి వచ్చేస్తున్న సరోజ్‌ను గమనించిన థియేటర్ ఓనర్లు చివరకు ఆమెను రోజూ ఉచితంగా లోపలకు పంపేవారట’’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు.
సినిమాటోగ్రఫీలో నిష్ణాతుడైన నారీమన్ ఇరానీ ఆ చిత్రాన్ని నిర్మించారంటూ, ‘సినిమా ఘన విజయాన్ని కళ్ళారా చూడకుండానే నారీమన్ కన్నుమూశారు. ఆ సినిమాకు నాకు ‘ఫిల్మ్‌ఫేర్’ నుంచి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఆ వేడుకలో వేదిక పైకి వెళ్ళిన నేను ఆ అవార్డును నారీమన్‌కే అంకితమిచ్చి, ఆయన సతీమణిని పైకి పిలిచి, ఆమె చేతికే అవార్డు ఇప్పించాను. ఆ క్షణం తలుచుకుంటే ఇప్పటికీ మనసు రోదిస్తుంది’ అని అమితాబ్ వ్యాఖ్యానించారు. చిరస్మరణీయ చిత్రానికి సంబంధించి చెరిగిపోని జ్ఞాపకాలంటే ఇవేనేమో!