ఆ గాసిప్స్ నమ్మొద్దు...
‘‘ఉన్నదాంట్లో సంతృప్తి పడటం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ‘అత్యాశ’ అనే పదమే నా నిఘంటువులో లేదు. అలా అత్యాశకు లోనయ్యేవారిని చూస్తే నాకు అసహ్యం’’ అన్నారు కాజల్ అగర్వాల్. బాలీవుడ్ డెరైక్టర్ సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘పెహలే ఆప్ జనాబ్’ చిత్రంలో నటించడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు కాజల్. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘‘నా పారితోషికం గురించి రకరకాల గాసిప్పులు మీడియాలో వినిపిస్త్తున్నాయి. వాటిని అస్సలు నమ్మొద్దు.
ఎందుకంటే...నా కష్టానికి మించి పారితోషికం నేను తీసుకోను. పనిని బట్టే నా పారితోషికం. ఒక్కోసారి గ్లామర్‌కే పరిమితమయ్యే పాత్ర చేయాల్సి వస్తుంది. అవి చేసేటప్పుడు స్ట్రగుల్ ఉండదు. వాటికి కూడా కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తుంటాయి. అది నిజం కాదు. నేను అత్యాశకు పోను’’ అని కాజల్ చెప్పారు. ఆమె ఇంకా చెబుతూ ‘‘సౌకర్యవంతమైన సినిమాలే చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. ఏదో పెద్ద సంస్థ సినిమా తీసేస్తోందనీ, పెద్ద హీరో నటిస్తున్నాడనీ సినిమాలకు సైన్ చేయను. ముందు చేసే సినిమా సౌకర్యంగా ఉండాలి.
అప్పుడే ‘ఓకే’ చేస్తా’’ అని పేర్కొన్నారు కాజల్. సుధీర్ మిశ్రా సినిమా గురించి చెబుతూ -‘‘జీవితాన్ని సాఫీగా సాగిస్తున్న ఓ అమాయకురాలి జీవితంలోకి అనూహ్యమైన పరిణామాలు వచ్చి చేరతాయి. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నా. దర్శకుడు సుధీర్ మిశ్రా అద్భుతమైన ప్రతిభాశాలి. ఆయన ఈ కథ నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే... నటిగా నన్ను నేను నిరూపించుకునే అరుదైన అవకాశం ఇది. ఇందులోని నా పాత్రలో అంతర్లీనంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి’’ అని తెలిపారు.