రికార్డ్ కోసమని ఈ ప్రయత్నం చేయలేదు! | E.S.Murthy special interview with sakshi | Sakshi
Sakshi News home page

రికార్డ్ కోసమని ఈ ప్రయత్నం చేయలేదు!

Published Tue, Feb 10 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

రికార్డ్ కోసమని ఈ ప్రయత్నం చేయలేదు!

రికార్డ్ కోసమని ఈ ప్రయత్నం చేయలేదు!

 - సంగీత దర్శకుడు, గీత రచయిత ఇ.యస్. మూర్తి
కీరవాణి లాంటి సంగీత దర్శకులు అడపాదడపా పాటలు రాస్తుంటారు. కానీ ఓ సంగీత దర్శకుడు ఒక సినిమాలో మొత్తం అన్ని పాటలూ రాయడం మాత్రం నిజంగా రికార్డే. ఆ ఘనత ఇ.యస్. మూర్తికి దక్కుతుంది. రాజేంద్రప్రసాద్‌తో ఆర్.కె. మలినేని దర్శకత్వంలో రామోజీరావు, క్రిష్ నిర్మించిన ‘దాగుడుమూత దండాకోర్’కి ఆయనే స్వరకర్త, గీత రచయిత. ఇ.యస్. మూర్తిగా సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈవని సత్యనారాయణ మూర్తితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ...
 
‘దాగుడుమూత దండాకోర్’తో కొత్త రికార్డ్ సృష్టించినట్టున్నారు?
ఏదో రికార్డు కోసమని నేనీ ప్రయత్నం చేయలేదు. ‘సూర్యవంశం’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘సంక్రాంతి’ తదితర చిత్రాల్లో ఇప్పటికి 50కి పైగా పాటలు రాశా. ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగిన క్రిష్, పాటలు కూడా నన్నే రాయమన్నారు. మూడు పాటలు నేను రాసి, ఒక పాట సీతారామశాస్త్రిని రాయమన్నా. నాలుగోది కూడా నువ్వే రాసేస్తే ఒక రికార్డు అవుతుందని ఆయనే చెప్పారు.
 
సీతారామశాస్త్రితో ‘కొక్కొకొక్కో’ పాటలో పాడించాలనెందుకనుకున్నారు?
కొంచెం జానపద తరహా గీతమది. ఆయన గొంతులో వింటే చాలా బావుంటుందనిపించింది. నాకాయన బాగా సన్నిహితుడు. అందుకే అడగగానే ఒప్పుకున్నారు. పారితోషికం ఇస్తామంటే, ఒకే ఒక్క రూపాయి అడిగారు. అంత గొప్ప మనిషి ఆయన. ఎప్పుడో ‘కళ్లు’ సినిమాలో ‘కొక్కొరోకో’ పాట పాడారు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత ‘కొక్కొ కొక్కో’ అంటూ కోడి మీద పాటలో గొంతు కలపడం భలే గమ్మత్తుగా అనిపించింది.
 
ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌తో మీకు బంధుత్వం ఉందట?
అవును. ఆయన నాకు మేనమామ. మా అమ్మకు రెండో అన్నయ్య. తణుకులో రెండేళ్లు అమ్మమ్మ వాళ్లింట్లో ఉన్నాను. ఆ సమయంలో ఆయనతోనే ఎక్కువ గడిపేవాణ్ణి. నేను గిటార్ బాగా వాయిస్తానని తెలిసి నన్ను ‘గిటార్ మూర్తి’ అని ముద్దుగా పిలిచేవారు.
 
అసలు మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా మొదలైంది?
మా మేనమామలు రామారావు, తిమ్మేశ్వరరావుల పుణ్యం. వాళ్ల దగ్గర గిటార్ నేర్చుకున్నా. కాకినాడలో స్థిరపడ్డాక సంగీతాభిలాష మరీ ఎక్కువైంది.
 
సినిమా ఫీల్డ్‌కి ఎలా వచ్చారు?
చార్టెర్డ్ అకౌంటెన్సీ చదవడం కోసం మద్రాసు వెళ్లాను. ఓ స్నేహితుని ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయమై, తన దగ్గర గిటారిస్టుగా పని చేసే అవకాశమిచ్చారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు విద్యాసాగర్ పరిచయమయ్యారు. ఆయన ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఎస్.ఎ. రాజ్‌కుమార్ దగ్గర చేరా. ‘నవవసంతం’ దగ్గర్నుంచీ చాలా ఏళ్లు ఆయన దగ్గరే సహాయకునిగా పనిచేశా.
 
మరి మ్యూజిక్ డెరైక్షన్ ఎప్పుడు చేశారు?
దాసరి నటించిన ‘మాయదారి కుటుంబం’కు తొలిసారిగా స్వరాలందించా. ఆ సినిమా ఆడలేదు. దాంతో మళ్లీ రాజ్‌కుమార్ దగ్గర చేరిపోయా. కొన్ని అవకాశాలొచ్చినా సాహసించలేదు. పదహారేళ్ల తర్వాత ‘గమ్యం’కు మ్యూజిక్ చేశా. ఆ తర్వాత ‘భలే మొగుడు-భలే పెళ్లాం’, ఇప్పుడేమో ‘దాగుడుమూత...’
 
మ్యూజిక్ డెరైక్షన్, రైటింగ్, సింగింగ్... వీటిల్లో మీ ప్రాధాన్యం దేనికి?
నాకు సంగీత దర్శకత్వమంటే ప్రాణం. ఆ తర్వాతే ఏదైనా! అయితే నా దగ్గరకు వచ్చి పాటలు రాయమని అడిగితే రాస్తా. పాడమన్నా పాడతా. చాలామందికి తెలియదు కానీ, చాలా ఏళ్ల క్రితం రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలోని ‘సూపర్ బాయ్’ అనే త్రీడీ సినిమాకు డైలాగ్స్ కూడా రాశా. నేను అభిమానించే ఎమ్మెస్ విశ్వనాథన్ దానికి సంగీత దర్శకుడు. అందులో టైటిల్ సాంగ్ నేనే రాశా.  అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు, లఘు చిత్రాలు డెరైక్ట్ చేశా. ‘రుచికరమైన వక్కపొడి... క్రేన్ వక్కపొడి’ అనే పాపులర్ జింగిల్‌కు రచన, సంగీతం నావే!
 
‘ఎల్.బి. డబ్ల్యూ’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన నిశాంతి మీ అమ్మాయే కదూ!
అవును. తనకు డెరైక్షన్ అంటే చాలా ఆసక్తి. ముంబైలో రెండేళ్లు డెరైక్షన్ కోర్సు కూడా చేసింది. అనుకోకుండా ‘ఎల్.బి.డబ్ల్యూ’లోనూ, మరికొన్ని లఘు చిత్రాలలోనూ నటించింది. నటి జియాఖాన్‌తో, మా అమ్మాయి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇంతలో జియా చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం నిశాంతి ముంబయ్‌లో ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది.     - పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement