సౌందర్య చేతికి విలన్ ఆడియో హక్కులు
ఒక ప్రఖ్యాత నటుడి చిత్ర ఆడియోను మరో ప్రఖ్యాత నటుడి వారసురాలు మార్కెట్‌లోకి విడుదల చేయడం విశేషమే అవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. పద్మశ్రీ కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ఉత్తమ విలన్ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. సౌందర్య రజనీకాంత్ అశ్విన్ ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థకు క్రియేటివ్ అండ్ డిజిటల్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ తాజాగా ఆడియో రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే నటుడు విజయ్ నటించిన కత్తి చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకున్న ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా బ్రహ్మాండ నాయకుడు కమల్‌హాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్ర ఆడియో హక్కుల్ని పొందింది. దర్శక, నిర్మాత లింగుసామి తన సొంత బ్యానర్ తిరుపతి బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమల్ హాసన్ మిత్రుడు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు.
కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఆండ్రియా, పూజా కుమార్, పార్వతి మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్, కె.బాలచందర్ నటించడం మరో విశేషం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని కమల్ అభిమానులు ఏడాది నుంచి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.