నాన్నతో రాణా తీస్తా
ఆగిపోయిన రాణా చిత్రాన్ని మళ్లీ నాన్నతోనే రూపొందిస్తానని రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ వెల్లడించారు. రాణా చిత్రం 2011లో కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, దీపిక పదుకునే హీరో హీరోయిన్లుగా ప్రారంభమయ్యే తొలి రోజునే రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత మళ్లీ రాణా మొదలవుతుందనుకున్నారు. అయితే ఆయన తన కూతురు సౌందర్య దర్శకత్వంలో కోచ్చడయాన్ చిత్రం చేశారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ కోచ్చడయాన్ మంచి కథ.
అందుకే తన తండ్రి రజనీకాంత్ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఈ తరహా చిత్రాలు హాలీవుడ్‌లో ఐదారేళ్లు నిర్మాణం జరుపుకుంటాయని తాము రెండేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. రాణా చిత్ర ప్రారంభోత్సవం రోజున నాన్న అనారోగ్యానికి గురవడంతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు. ఆ తరువాత కూడా రజనీ శారీరక పరిస్థితి అనుకూలించదని భావించి, రాణా చిత్ర నిర్మాణాన్ని పక్కన పెట్టేశామని వివరించారు. అయితే రాణా చిత్ర కథ సిద్ధంగా ఉందని, దాన్ని మళ్లీ నాన్నతో రూపొందించనున్నట్లు తెలిపారు. రజనీకి అధిక శారీరక ఒత్తిడి కలిగిం చని విధంగా గ్రాఫిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాణా చిత్రాన్ని తెరకెక్కిస్తామని సౌందర్య రజనీకాంత్ అశ్విన్ వెల్లడించారు.