
తండ్రి కాబోతున్న ఆనందాన్ని వర్ణించాలంటే!
'ఎంతో ఎక్సైటింగ్ ఉందని చెప్పినా అది చాలా చిన్నమాటే అవుతుంది'.. ఇది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ స్పందన. తండ్రి కాబోతున్నారు కదా! మీకెలా అనిపిస్తోంది? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. కెమెరా ముందు విభిన్న పాత్రల్లో అభినయించిన ఈ యంగ్ హీరో త్వరలో తండ్రి అనే బాధ్యతాయుతమైన పాత్రను పోషించబోతున్నాడు. అతని భార్య మీరా రాజ్‌పుత్ ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అదే సమయంలో షాహిద్ బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టి సోమవారం నాటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పూరస్కరించుకొని థర్టీన్ ఇయర్స్ ఆఫ్ షాహిద్ కపూర్ (#13YearsOfShahidKapoor) హ్యాష్‌ట్యాగ్ తో ఆయన అభిమానులు ట్విట్టర్లో పోస్టులు చేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో టాప్ ట్రెండింగ్ గా చాలాసేపు హల్‌చల్ చేసింది.
షాహిద్ తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్' భారీ అంచనాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్న అతను సోమవారం కాసేపు తీరిక చేసుకొని అభిమానుల్ని పలుకరించాడు. ట్విట్టర్‌లో వారితో నేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. మీ సతీమణి మీరా రాజ్‌పుత్‌లో గొప్ప విషయమేమిటని ఓ అభిమాని అడుగగా.. 'వాస్తవికత' (రియల్) అంటూ ఒక్క మాటలో బదులిచ్చాడు షాహిద్.