బీజింగ్: ఫ్యాన్ బింగ్‌బింగ్.. చైనాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో విచారణ ఎదుర్కొంటున్న ఆమె.. గత కొన్నిరోజులుగా కనిపించకుండా పోవటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఎక్కడుందో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఆరా తీస్తున్నారు.
36 ఏళ్ల ఫ్యాన్ బింగ్‌బింగ్. 2014లో వచ్చిన ఎక్స్ మెన్-డేస్ ఆఫ్ ఫ్యూఛర్ పాస్ట్ లోని బ్లింక్ పాత్ర ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యధికంగా రెమ్యూనరేషన్‌లు అందుకునే తారల్లో ఆమె ఒకరు. చైనా సోషల్ మీడియా సినో వైబోలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.((చైనా)లో 62 మిలియన్ ఫాలోవర్స్). అలాంటిది ఈ మే నెలలో ఆమెపై పన్నుల ఎగవేత ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. బింగ్‌ను దేశం విడిచి రావొద్దన్న ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆమె షూటింగ్‌లతోపాటు బయట ఎక్కడా కూడా కనిపించటం లేదు. జూన్ 2 నుంచి బింగ్ తన అకౌంట్‌ను అప్‌డేట్ చేయలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ లి చెన్ కూడా జూలై 6 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేడు. గత నెలరోజులుగా ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఏం జరిగిందోనని ఫ్యాన్స్ అల్లలాడిపోతున్నారు.
స్పందించిన మేనేజర్.. కాగా, టాక్స్ ఎగవేత ఆరోపణలను ఖండించిన ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీవీ ప్రజెంటర్ కూయి యంగ్‌యువాన్ కుట్రపన్ని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. కానీ, ఆమె ఎక్కుడున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. జూలై 1న చివరిసారిగా ఓ పిల్లల ఆస్పత్రిలో ఆమె కనిపించారని స్థానిక ఛానెల్ ఒకటి కథనాన్ని ప్రచురించింది. మరోవైపు ఆమె అదృశ్యం కథనాలపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. సెలబ్రిటీలు నేరాల్లో చిక్కుకున్నప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తుంది. గతంలో జాకీ చాన్ తనయుడు జేసీ చాన్ డ్రగ్స్ కేసులో(2014) ఆరు నెలల శిక్ష అనుభవించటంతో.. చైనా అతనిపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది.
Comments
Please login to add a commentAdd a comment