వాళ్లేం క్రూరమృగాలా : ప్రియాంకచోప్రా
వాళ్లేం క్రూరమృగాలా : ప్రియాంకచోప్రా
Published Tue, Aug 13 2013 1:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘ఈ పదేళ్ల కెరీర్ నాకెంతో నేర్పించింది. ఎత్తు, పల్లాలు చూశాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడం అలవాటైపోయింది’’ అంటున్నారు ప్రియాంకచోప్రా. ‘తమిళన్’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లారు ప్రియాంక. సెక్సీ గాళ్, ఫ్యాషన్ గాళ్ అంటూ పలు రకాల బిరుదులు సొంతం చేసుకున్న ప్రియాంక ‘ఫ్యాషన్’ చిత్రంతో నటిగా తనేంటో నిరూపించుకున్నారు.
ఇక ‘బర్ఫీ’లో అయితే... డీ గ్లామరైజ్డ్‌గా కనిపించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు ఆమెను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. అప్పుడు ఇబ్బందిగా అనిపించదా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే -‘‘అనిపించదు. ఆనందంగా ఉంటుంది. అభిమానులు ఆత్మీయంగా దగ్గరకొస్తారు. నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటారు. అంతే కానీ చంపేయరు కదా.
నాకర్థం కాని విషయం ఏంటంటే.. సెలబ్రిటీలవ్వాలని చాలామంది తాపత్రయపడతారు. తీరా అయ్యాక పబ్లిక్‌లోకి వెళ్లేటప్పుడు తమనెవరూ గుర్తు పట్టకూడదని బురఖాలు వేసుకుంటారు. మనం వెళుతున్నది మనుషుల మధ్యకే కదా.. క్రూరమృగ్యాల మధ్యకు కాదుగా. అందుకే నేను నిస్సంకోచంగా షాపింగ్ మాల్స్‌కి, కాఫీ షాప్స్‌కి హ్యాపీగా వెళ్లిపోతా. అభిమానులు పలకరిస్తే.. మాట్లాడతా’’ అని చెప్పారు.
Advertisement
Advertisement