Barfi
-
Recipes: సొరకాయ రుచులు.. ఇన్స్టంట్ బర్ఫీ.. బీట్రూట్ లౌకి ముఠియా
Bottle Gourd Recipes In Telugu: అధిక బరువుని తగ్గించుకోవడానికి ఎంచుకునే ఆహారాల్లో సొరకాయ ఒకటి. రుచిలో కాస్త చప్పగా ఉండే సొరకాయను తినడానికి అందరూ అంతగా ఇష్టపడకపోవచ్చు. అయితే, తయారీలో చిన్న మార్పులు చేసుకుంటే, సొరకాయను టేస్టీగా ఎలా వండవచ్చో చూద్దాం... ఇన్స్టంట్ బర్ఫీ కావలసినవి: ►పంచదార – ఒకటింబావు కప్పులు ►సొరకాయ తురుము – ఐదు కప్పులు ►నెయ్యి – అరకప్పు ►పాలపొడి – కప్పు ►యాలుకుల పొడి – అర టీస్పూను ►పిస్తాపలుకులు – అరకప్పు. తయారీ: – ►కుకర్ గిన్నెలో పంచదారను పొరలా వేయాలి. ►దీనిపైన సొరకాయ తురుముని పరచాలి. ఈ రెండింటిని కలపకూడదు ►కుకర్ గిన్నె మూతపెట్టి ఐదు నిమిషాలు పెద్దమంటమీద ఉడికించాలి ►ఐదు నిమిషాల తరువాత మంటను ఆపేసి కుకర్ ప్రెజర్‌ను విడుదల చేసి మూత తీయాలి. ►ఇప్పుడు నెయ్యి, పాలపొడి, యాలకుల పొడి వేసి కలపాలి ►కుకర్ గిన్నెను సన్నని మంటమీద పెట్టి మరో పదినిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి ►నెయ్యి పైకి తేలేంతవరకు సిమ్‌లో ఉంచి అడుగంటకుండా కలుపుతూ ఉడికిన తర్వాత దించేయాలి ►ఒక ప్లేటుకి కొద్దిగా నెయ్యిరాసి ఉడికిన మిశ్రమాన్ని పోయాలి. ►దీనిమీద పిస్తాపలుకులు వేసి చల్లారనివ్వాలి. ►చల్లారాక ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి. బీట్రూట్ లౌకి ముఠియా కావలసినవి: ►సొరకాయ తురుము – ఒకటిన్నర కప్పులు ►బీట్రూట్ తురుము – అరకప్పు ►ఉల్లిపాయ తరుగు – పావు కప్పు ►గోధుమ పిండి – అరకప్పు ►శనగపిండి – అరకప్పు ►సూజీ రవ్వ – కప్పు ►పసుపు – అరటీస్పూను ►ఇంగువ – పావు టీస్పూను, ►వంటసోడా – పావు టీస్పూను ►జీలకర్ర – అరటీస్పూను ►సోంపు – అరటీస్పూను ►పంచదార – టీస్పూను ►అల్లంపేస్టు – టీస్పూను ►పచ్చిమిర్చి – నాలుగు(సన్నగా తరగాలి) ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►నిమ్మ రసం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె టీస్పూను తాలింపు కోసం: నూనె – మూడు టీస్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, నువ్వులు – రెండు టీస్పూన్లు. తయారీ: ►ఉల్లిపాయ, బీట్రూట్, సొరకాయ తురుములను గిన్నెలో వేయాలి. ►ఇందులో శనగపిండి, పసుపు, ఇంగువ, ఉప్మారవ్వ, జీలకర్ర, సోంపు, పంచదార, అల్లంపేస్టు, పచ్చిమిర్చి తరుగు, వంటసోడా, కొత్తిమీర, నిమ్మరసం, టీస్పూను నూనె, ►రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దలా కలపాలి ►ఈ పిండిని ట్రేలో దిబ్బరొట్టిలా పరుచుకుని ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి ►ఉడికిన తరువాత ఐదు అంగుళాల ముక్కలుగా కట్ చేయాలి ►తాలింపు కోసం తీసుకున్న దినుసులతో తాలింపు వేసి ముక్కల మీద చల్లుకుని వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి ►ముఠియాలు మరింత క్రిస్పీగా కావాలనుకుంటే ఆవిరి మీద ఉడికిన తరువాత డీప్ ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. -
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
Sesame Recipes: నువ్వుల వంటలు.. తిల్ కీ బర్ఫీ, సెసెమీ వెజ్ సలాడ్ తయారీ ఇలా!
Til Ki Barfi And Sesame Veg Salad Recipes: వర్షం... పడిశం కలిసి వస్తాయి. చలి... కీళ్ల నొప్పులు ఒకదాని వెంట మరొకటి వస్తాయి. వర్షాకాలం... చలికాలాల్లో... ఆహారంలో ‘నువ్వు’ ఉంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అందుకే... మన ‘వంటిల్లు’లో ‘నువ్వుల వంటలు’.. తిల్ కీ బర్ఫీ కావలసినవి: ►నువ్వులు– ఒక కప్పు ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్ ►కోవా– అర కప్పు ►చక్కెర – కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►మందపాటి బాణలిలో నువ్వులను సన్నమంట మీద చిటపటలాడే వరకు వేయించి బాణలిని స్టవ్ మీద నుంచి దించాలి. ►స్టవ్ మీద మరొక బాణలి పెట్టి అందులో నెయ్యి, కోవా వేసి బాగా కలుపుతూ సన్నమంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. ►ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి వెంటనే వేయించిన నువ్వులను వేసి కలిపి వేడి తగ్గేవరకు పక్కన ఉంచాలి. ►మరొక పాత్రలో చక్కెర, నీరు కలిపి చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు గరిటతో కలుపుతూ మరిగించాలి. ►తీగపాకం రాగానే ముందుగా సిద్ధం చేసిన నువ్వులు, కోవా మిశ్రమాన్ని వేసి కలపాలి. ►ఒక ప్లేటుకు నెయ్యి రాసి అందులో పై మిశ్రమాన్ని వేసి సమంగా సర్దాలి. ►కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసి చల్లారే వరకు పక్కన ఉంచాలి. ►చల్లారిన తర్వాత బర్ఫీలను గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం– పది రోజుల వరకు తాజాగా ఉంటాయి. ►భోజనం తరవాత ఒక బర్ఫీ తింటే దేహానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఏషియన్ సెసెమీ వెజ్ సలాడ్ కావలసినవి: ►నువ్వులు – ఒక టేబుల్ స్పూన్ (దోరగా వేయించాలి) ►లెట్యూస్ లేదా క్యాబేజీ ఆకులు – ఒక కప్పు ►సన్నగా నిలువుగా తరిగిన బాదం పప్పు – ఒక టీస్పూన్ ►తోటకూర లేదా చుక్కకూర – అరకప్పు. డ్రెసింగ్ కోసం: ►ఆలివ్ ఆయిల్ – ఒక టీ స్పూన్ ►సోయాసాస్ – ఒక టీ స్పూన్ ►నువ్వు పప్పు నూనె – పావు టీ స్పూన్ ►ఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంత. తయారీ: ►ఒక పాత్రలో నువ్వులు, లెట్యూస్, బాదం పప్పు, ఆకుకూరలను వేసి కలపాలి. ►మరొక పాత్రలో డ్రెసింగ్ కోసం తీసుకున్నవన్నీ వేసి చిలికి పైమిశ్రమంలో వేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి! Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి -
నోరూరించే రుచులు.. కిస్మిస్–అంజీరా బర్ఫీ, సందేష్ తయారీ ఇలా..
స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి. కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్ కావల్సిన పదార్ధాలు అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి) కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి) కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు తేనె – 2 టేబుల్ స్పూన్లు నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి కోరు – అర కప్పు నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్లా నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సందేష్ కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – అరకప్పు యాలకుల పొడి – పావు టీస్పూను ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి. ►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి. ►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి ►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ. -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
ఆ సినిమా రీమేక్ చేయాలనుంది : ధనుష్
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో ధనుష్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మరో అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలే ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతుండగా.. ధనుష్ మాత్రం నార్త్ సినిమాను సౌత్ ప్రేక్షకులకు చూపించనబోతున్నాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన విఐపి 2 ప్రమోషన్ లో భాగంగా ధనుష్ తన మనసులో మాట బయట పెట్టాడు. విఐపి 2 తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ భారీగా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ముంబైలో సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ధనుష్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా తనకి బర్ఫీ చిత్రాన్ని రీమేక్ చేయాలనుందని తెలిపారు. ఈ సినిమాలో రణ్‌బీర్ నటన అద్భుతంగా ఉంటుందని, కుదిరితే ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసి అందులో తానే నటిస్తానని చెప్పారు. -
నేనింతే!
సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ పట్టాలన్నా, ఇంకో ఛాన్స్ వెతుక్కుంటూ తలుపు తట్టాలన్నా హీరోయిన్లకు మంచి పరిచయాలు తప్పనిసరి అనేది ఫిల్మ్‌నగర్ పబ్లిక్ సీక్రెట్. నలుగురిలో కలుపుగోలుగా ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నెగ్గుకు రాగలరని అంటుంటారు. అందుకే ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది కొందరి అభిప్రాయం. ‘‘నేను ఆ టైప్ కాదు’’ అని ఇలియానా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ– ‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో క్లోజ్‌గా ఉంటే ఛాన్స్ వస్తుందని, హీరోలతో పార్టీలకు వెళితే రికమండ్ చేస్తారని ఆలోచించను. నా టాలెంట్ మీద నమ్మకం ఉంది. ఎవరైనా దాన్ని గుర్తించి ఛాన్స్ ఇస్తే ఓకే. లేకపోతే ఫర్వాలేదు. వేరేవాళ్ల సంగతి నాకు తెలీదు. నేనింతే’’ అన్నారు. అందం గురించి ఇలియానా చెబుతూ – ‘‘హిందీలో ‘బర్ఫీ’ చేశాక, ఓ డాక్టర్ని కలిశా. అతను ‘మీ ముఖంపై లాఫింగ్ లైన్స్ ఉన్నాయి. వాటిని పోగొట్టేందుకు సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది’ అని సలహా ఇచ్చాడు. ఆపరేషన్ చేయించుకుని, అందం పెంచుకోవాల్సిన అవసరం లేదనుకున్నా. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారు. -
అలా కనిపించడానికి రెడీ!
హిందీ ‘బర్ఫీ’లో సీరియస్ రోల్లో కనిపించిన ఇలియానా ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాలనుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అంటే.. ఆ పాత్ర తెరపై కనిపించగానే ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా ఉండాలట. ‘‘ఇలా చెబితే అర్థం కాదు కానీ, నా స్టైల్లో చెబుతా. అచ్చంగా తింగరబుచ్చిలా కనిపించాలనుకుంటున్నా’’ అని అసలు విషయం చెప్పారు ఇలియానా. ఇదేం కోరిక? అనే ప్రశ్న ఈ గోవా బ్యూటీ ముందుంచితే - ‘‘ఆ పాత్రలో చాలా ఫన్ ఉంటుంది. చేసేవాళ్లకూ బాగుంటుంది. చూసేవాళ్లకూ పసందుగా ఉంటుంది. అలా సరదా సరదాగా ఉండే పాత్రలు చేసినప్పుడు తెలియకుండా ఓ కొత్త ఎనర్జీ వచ్చినట్లనిపిస్తుంది. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అందుకే నన్నెవరైనా తింగరబుచ్చిగా చూపించాలనిపిస్తే.. కనిపించడానికి నేను రెడీ’’ అంటున్నారు. తెలుగులో ఇలియానా ఫన్నీ క్యారెక్టర్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడామె హిందీలో కూడా అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు కాబట్టి... హిందీ తెరపై ఇలియానాను ఆ టైపులో ఏ దర్శకుడు చూపిస్తాడో? -
అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..!
బాలీవుడ్లో ఇలియానాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రమే ఆమె కష్టాలకు కారణం. ‘బర్ఫీ’తో సంపాదించుకున్న క్రే జ్ మొతాన్ని ‘పటా పోస్టర్’ ఫట్ మనిపించడంతో ఇల్లూబేబీ ఒక్కసారిగా డల్ అయిపోయారట. దీనికి తోడు పుండుమీద కారంలా... బాలీవుడ్ మీడియా ఇలియానాపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తూ కథనాలను కూడా ప్రసారం చేస్తోందట. బక్కపలుచగా, పీక్కుపోయినట్టుగా ఈ సినిమాలో ఇలియానా ఉందని ఘాటైన పదజాలంతో రివ్యూలు రాసేశారట. ఇక దక్షిణాది సినిమానే ఇలియానాకు దిక్కు అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారట. ఈ విషయమై ఇలియానా స్పందిస్తూ -‘‘సినిమా హిట్ అయితే... అందరం అందంగా కనిపిస్తాం. అదే ఫ్లాప్ అయితే... ఇదిగో ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇవి నాకేం కొత్తకాదు. సౌత్‌లో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా. కానీ అక్కడ అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికను నేనే. ‘బర్ఫీ’లో బార్బీ బొమ్మలా ఉందని రాసిన ఈ మీడియావారే... ఈ సినిమా విషయంలో ఇలా రాశారు. అదంతా ఆ సినిమాల మహత్యం. ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం సైఫ్అలీఖాన్తో నేను చేస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ తప్పకుండా నాకు మంచిపేరు తెస్తాయని నమ్మకం నాకుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. -
నేను కాజల్‌కి వ్యతిరేకం!
‘‘బాలీవుడ్ అల్లాటప్పా పరిశ్రమ కాదు. ఇక్కడ అందగత్తెలకు కొదవ లేదు. అందుకే ‘బర్ఫీ’కి అవకాశం వచ్చినప్పుడు కొంచెం సంశయించాను. ఓ అభద్రతాభావంతో ఆ సినిమా చేశాను. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన స్పందనకు నా మనసులో ఉన్న భారమంతా పోయింది. ఏం ఫర్వాలేదు.. బాలీవుడ్లో నిలదొక్కుకోవచ్చనే నమ్మకం కలిగింది’’ అంటున్నారు ఇలియానా. ఈ గోవా సుందరి నటించిన మలి హిందీ చిత్రం ‘ఫటా పోస్టర్ నిఖ్లా హీరో’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గురించి ఇలియానా చెబుతూ - ‘‘ఇందులో నా పాత్ర పేరు కాజల్. ఇలియానాకి ఈ కాజల్ పూర్తి వ్యతిరేకం. నా మనసు తెరిచిన పుస్తకం కాదు. నాకు ఎక్కువమంది స్నేహితులు లేరు. స్కూల్ డేస్‌లో ఎవరైతే ఫ్రెండ్స్‌గా ఉన్నారో, వాళ్లే ఇప్పుడూ కంటిన్యూ అవుతున్నారు. నేను పార్టీ యానిమల్‌ని కాదు. కానీ కాజల్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. నేను కానిది చేయాలి కాబట్టి థ్రిల్ అనిపించింది’’ అన్నారు. ఇదిలా ఉంటే సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనరే ఇలియానాకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారట. బాలీవుడ్లో దీపికానే హాట్ గాళ్ అని ఇలియానా చెబుతూ - ‘‘దీపికాకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో నాకూ అలాంటి శిక్షణే ఇవ్వండి. నేను కూడా అంత హాట్‌గా మారాలని మా శిక్షకునితో సరదాగా గొడవ పడుతుంటాను’’ అన్నారు. -
వాళ్లేం క్రూరమృగాలా : ప్రియాంకచోప్రా
‘‘ఈ పదేళ్ల కెరీర్ నాకెంతో నేర్పించింది. ఎత్తు, పల్లాలు చూశాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడం అలవాటైపోయింది’’ అంటున్నారు ప్రియాంకచోప్రా. ‘తమిళన్’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లారు ప్రియాంక. సెక్సీ గాళ్, ఫ్యాషన్ గాళ్ అంటూ పలు రకాల బిరుదులు సొంతం చేసుకున్న ప్రియాంక ‘ఫ్యాషన్’ చిత్రంతో నటిగా తనేంటో నిరూపించుకున్నారు. ఇక ‘బర్ఫీ’లో అయితే... డీ గ్లామరైజ్డ్గా కనిపించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు ఆమెను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. అప్పుడు ఇబ్బందిగా అనిపించదా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే -‘‘అనిపించదు. ఆనందంగా ఉంటుంది. అభిమానులు ఆత్మీయంగా దగ్గరకొస్తారు. నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటారు. అంతే కానీ చంపేయరు కదా. నాకర్థం కాని విషయం ఏంటంటే.. సెలబ్రిటీలవ్వాలని చాలామంది తాపత్రయపడతారు. తీరా అయ్యాక పబ్లిక్‌లోకి వెళ్లేటప్పుడు తమనెవరూ గుర్తు పట్టకూడదని బురఖాలు వేసుకుంటారు. మనం వెళుతున్నది మనుషుల మధ్యకే కదా.. క్రూరమృగ్యాల మధ్యకు కాదుగా. అందుకే నేను నిస్సంకోచంగా షాపింగ్ మాల్స్‌కి, కాఫీ షాప్స్కి హ్యాపీగా వెళ్లిపోతా. అభిమానులు పలకరిస్తే.. మాట్లాడతా’’ అని చెప్పారు.