‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు.
అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది.
ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి.
వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది.
నాన్న నుంచి నేర్చుకుని..
హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది.
కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది.
మరో తరానికి...
నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్‌లైన్‌లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’.
– హర్భజన్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment