శునక ప్రేమ
కేన్స్ నదీ తీరాన ప్రతి ఏడాదీ మే నెలలో జరుగుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా చలన చిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విదేశీ తారలు, మన దేశం నుంచి వెళ్లిన తారలతో ఈ వేదిక కళకళలాడుతోంది. ఇప్పటికే మల్లికా శెరావత్ ర్యాంప్ వాక్ చేసింది. ఇంకా ఇక్కణ్ణుంచి ఉదయ్చోప్రా, ఐశ్వర్యా రాయ్ తదితర తారలు అక్కడికెళ్లారు. కాగా, శనివారం ఈ సంబరాలు జరుగుతున్న సమయంలో అనుకోని విధంగా ఓ శునకం ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది.
ఠీవీగా కాసేపు కూర్చుని చిత్రోత్సవాలను తిలకించింది. ఎవరి ఆనందంలో వాళ్లు నిమగ్నమై, ఈ శునకాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వేడుకల్లో భాగంగా ‘వైట్ గోల్డ్’ అనే సినిమాకి సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. దాంతో దర్శకుడు కొర్నల్ ముండ్రుక్జో, చిత్రకథానాయిక సోఫియా సోట్టా తదితర చిత్రబృందం ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకను ఆసక్తికరంగా తిలకిస్తున్న సమయంలో ఆ శునకం వీరి చెంతకు చేరింది. హఠాత్తుగా కొర్నల్ మీద ఎక్కడ లేని ప్రేమా కురిపించింది. కొర్నల్ కూడా ఈ శునక ప్రేమకు ముగ్ధులయ్యారని ఈ ఫొటో చెబుతోంది.