ధరపై ఆశతో ఇళ్లలోనే పత్తిని దాచుకుంటున్న రైతన్నలు
► ఈసారి మొత్తంగా 50 లక్షల బేళ్ల పత్తి వస్తుందని అంచనా
►ఇప్పటిదాకా మార్కెట్‌కు వచ్చింది 16 లక్షల బేళ్లే..
►గణనీయంగా పడిపోయిన అమ్మకాలు
►అంతర్జాతీయంగా డిమాండ్ మరింత పెరుగుతుందంటున్న వ్యాపారులు
►క్వింటాల్ ధర రూ.7 వేల దాకా చేరుతుందని అంచనా
గడ్డం రాజిరెడ్డి, సాక్షి, కరీంనగర్: చేను దాటిన తెల్లబంగారం గడప దాటడం లేదు. మున్ముందు మరింత ధర వస్తుందన్న ఆశతో రైతులంతా పత్తి పంటను ఇళ్లలోనే దాచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే పత్తికి డిమాండ్ పెరుగుతోంది. మరో రెండు మాసాల్లో రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గత ఖరీఫ్ సీజన్‌లో కోటి 28 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ)తోపాటు కాటన్ అడ్వయిజరీ బోర్డు (సీఏబీ) కమిటీ లెక్కలు వేసింది. మొత్తంగా 3.5 కోట్ల బేళ్ల పంట చేతికి వస్తుందని అంచనా. గడచిన అక్టోబర్‌లోనే పంట రైతుల చేతికి వచ్చింది. జనవరి 17 వరకు దేశవ్యాప్తంగా రైతులు 1.25 కోట్ల బేళ్ల పంటను విక్రయించినట్లు సీఏఐ, సీఏబీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఒక్క జనవరి నెలలోనే 2 లక్షల బేళ్ల పంట అమ్మకానికి వచ్చింది. కానీ ఈసారి 1.5 లక్షల బేళ్ల పంటను మాత్రమే రైతులు మార్కెట్‌కు తెచ్చారు. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు 50 వేల బేళ్ల వరకు పత్తి అమ్మకాలు తగ్గాయి. ఈ లెక్కన రైతులు చేతికి వచ్చిన పంటను ఇళ్లలోనే నిల్వలు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
రాష్ట్రంలో తగ్గిన సాగు
తెలంగాణలో గతేడాది 16 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. 60 లక్షల బేళ్ల అమ్మకాలు జరిగాయి. అయితే భవిష్యత్తులో ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఈసారి పత్తి సాగు తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తూ పత్తి సాగును తగ్గించారు. గతేడాది 16 లక్షల హెక్టార్లలో సాగుకాగా.. ఈసారి 12.50 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఏకంగా 3.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు తగ్గిపోయింది. మొత్తంగా 50 లక్షల బేళ్ల పంట చేతికొస్తుందని లెక్కలు వేశారు. ఇప్పటివర కు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల బేళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. మిగతా పంటంతా రైతులు ఇళ్లలోనే దాచుకున్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల బేళ్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 18 లక్షలకు పరిమితం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
రూ. 43 వేలకు క్యాండి ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక క్యాండి (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర ప్రస్తుతం రూ.43 వేలు ఉంది. మున్ముందు ఇది రూ.50 వేల వరకు చేరుతుందని లెక్కలు వేస్తున్నారు. గింజల ధరలు సైతం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,500 వరకు పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది కూడా రూ.2,600–రూ.3 వేల దాకా పలికే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లు, గింజల ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో ఈ నెల చివరి వరకు క్వింటాల్ పత్తి రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా పలికే అవకాశం ఉన్నట్లు కాటన్ వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాల్ పత్తికి రూ.5,500 నుంచి రూ.5,700 పలుకుతోంది. పత్తి ధర ఆశజనకంగానే ఉన్నా కందికి మాత్రం రేటు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. ఖరీఫ్‌లో సోయా పంట కూడా రైతుకు కన్నీళ్లే మిగిల్చింది.
ధరల కిక్కు వెనుక విదేశీ ఆర్డర్లు?
ఈ ఏడాది పాక్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు మనదేశం 40 లక్షల బేళ్ల పత్తిని ఎగుమతి చేయనుంది. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయి. అయితే ధర మరింత పెరగొచ్చని దేశీయ మార్కెట్లో ట్రేడర్లు, జిన్నర్లు పత్తి బేళ్లను నిల్వ పెట్టుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో బేళ్లకు ధర తక్కువ ఉంది. దీంతో మనదేశానికి చెందిన బడా స్పిన్నింగ్ వ్యాపారులు ఓవైపు అక్కడ్నుంచి దిగుమతులు చేసుకుంటుండగా మరోవైపు జిన్నర్లు, ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించే ఆలోచనతో బేళ్లను స్టాక్ పెడుతున్నారు. ఫలితంగా పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ధర కోసం దాసుకున్నా..
నా పేరు సాంబయ్య. మాది మోత్కులగూడెం. నాకు ఎకరం భూమి ఉంది. పత్తి సాగు చేశా. మొదట్లో చేతికొచ్చిన పత్తిని అమ్మితే క్వింటాకు రూ.4,800 ధర పెట్టిండ్లు. 3 కింటాళ్లు అమ్ముకున్న. ఆ తర్వాత ధర లేదని మిగితా పత్తిని అమ్ముకోలే. ఇంట్లోనే దాసిన. ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోంది. ఏడు వేలు అయితదని అంటుండ్లు. అప్పటిదాక పత్తిని అమ్మద్దని నిర్ణయించుకున్న. నేనే కాదు మా తమ్ముళ్లు, బంధువులు కూడా పంటను ఇంట్లోనే దాసుకున్నం. – పొనగంటి సాంబయ్య, రైతు, మోత్కులగూడెం, జమ్మికుంట
పలు రాష్ట్రాల్లో పత్తి అమ్మకాలు ఇలా..
రాష్ట్రం అమ్మకం(లక్షల బేళ్లలో..)
పంజాబ్ 6.84
హరియాణా 9.58
రాజస్తాన్ 9.98
గుజరాత్ 27.21
మహారాష్ట్ర 30.7
మధ్యప్రదేశ్ 10.28
తెలంగాణ 16.06
ఆంధ్రప్రదేశ్ 7.34
కర్ణాటక 4.32
తమిళనాడు 69 వేల బేళ్లు
ఒడిశా 86 వేల బేళ్లు
మిగతా రాష్ట్రాల్లో 61 వేల బేళ్లు
గడప దాటని తెల్ల బంగారం
Published Thu, Jan 26 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
Advertisement