విజయ్, ధనుష్ కలయికలో చిత్రం?
కోలీవుడ్‌లో ఇక క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఇళయదళపతి విజయ్, యువ నటుడు ధనుష్ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. విజయ్ ప్రస్తుతం భైరవా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. తదుపరి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు తెరి వంటి సూపర్‌హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా విజయ్ 61వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రం తరువాత విజయ్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందనుందనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. వీరి కలయికలోనూ తుపాకీ, కత్తి వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. ఆ తాజా చిత్రాన్ని నటుడు ధనుష్ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని ధనుష్ నిర్మించాల్సిందట. అది కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా వేరే చేయి మారిందట. దీంతో విజయ్ 62వ చిత్రాన్ని ధనుష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌లో టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ధనుష్ స్టార్ హీరోలపై కన్నేసినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే తన వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై తన మామ సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి–2 చిత్రాన్ని పా.రంజిత్ దర్శకత్వంలో నిర్మించనున్నారన్న విషయం తెలిసిందే.ఆ తరువాత విజయ్‌తో చిత్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.