సూపర్‌స్టార్ అనుమతి కోరిన ఇళయదళపతి
సూపర్‌స్టార్ రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రంపైనా అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం భైరవా చిత్రంలో నటిస్తున్నారు. విజయ ప్రొడక్షన్‌స పతాకంపై ప్రఖ్యాత దివంగత నిర్మాత బి.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ మధ్య రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రీకరణ జరుపుకుంటున్న స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ఆవరణలోనే విజయ్ చిత్రం బైరవా షూటింగ్ జరిగింది.
ఆ సమయంలో విజయ్ సూపర్‌స్టార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించిన చిత్ర రీమేక్‌లో నటించాలన్న కోరికను విజయ్ చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారన్నది గమనార్హం. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. రజనీకాంత్ నటించిన అన్నామలై చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర రీమేక్‌లో నటించడానికి విజయ్ సూపర్‌స్టార్ అనుమతి పోందినట్లూ, అందుకు ఆయన పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
భైరవా చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తాజాగా అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం అన్నామలైకి రీమేక్ అయ్యే అవకావం ఉందని, అలా కానీ పక్షంలో విజయ్ నటించే తదుపరి చిత్రం అన్నామలైకి రీమేక్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.