'నిర్మాతలు లంచాలతో ప్రలోభపెట్టారు'
- సిగ్గులేని వారు అలాంటి పనులు చేస్తారు
- సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ
న్యూఢిల్లీ: భారత చలన చిత్ర సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నిర్మాతలు తమ మూవీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కోరుతూ వారు తనకు అనేక పర్యాయాలు లంచం ఇవ్వజూపారని సెన్సార్ చీఫ్ వెల్లడించారు. సిగ్గులేని వారు మాత్రమే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడతారని, పనిని ప్రేమించేవారు ఈ చర్యలకు పాల్పడరని వ్యాఖ్యానించారు. ఆయన క్రూరుడని, నిరంకుశ పాలన చేస్తారని ఇదే బోర్డులోని ఓ సభ్యుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా బోర్డులోని పాలన యంత్రాంగం సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ వ్యవహారాలు అంత సజావుగా ఉండవన్న విషయాన్ని బయటపెట్టాడు.
సెన్సార్ బోర్డు ఎవరి నుంచీ బహుమతులు గానీ, డబ్బులు గానీ ఆశించదని పేర్కొన్నారు. మా బోర్డు సభ్యులు కూడా దీపావళి గిఫ్ట్స్ వస్తే వాటిని తిరస్కరించారని, అందుకు వారని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. సెన్సార్ బోర్డు అనేది జీరో కరప్షన్ బోర్డు అని, ఓ మేగజైన్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాల్లోని కొన్ని సీన్లకు కత్తెర వేయకుండా చూడాలని తనకు విజ్ఞప్తి చేసేశారని, అందుకు ప్రతిఫలంగా తనకు కొంత మేరకు డబ్బు ముట్టజెప్పాలని చూసేశారని ఆరోపించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. అయితే లంచం ఇవ్వడానికి ఆఫర్ చేసిన వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.