'భగవాన్' స్థానంలో 'ఊపర్‌వాలా'..!
ఈ మధ్యకాలంలో పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బృందం కత్తెర బారిన పడని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నచిన్న విషయాలకే చాలా సినిమాలకు కత్తెర వేసినట్టు సెన్సార్ బోర్డు విమర్శలు ఎదుర్కొంటున్నది. తాజాగా 'హేట్‌స్టోరీ-3' సినిమా కూడా సెన్సార్ బోర్డు కత్తెర బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎరోటిక థ్రిల్లర్ అయిన ఈ సినిమా సహజంగానే 'ఏ' సర్టిఫికెట్ (పెద్దలకు మాత్రమే) కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో సినిమాకు కత్తెర పడబోదని చిత్రబృందం భావించింది.
అయితే నిహలానీ నేత్వత్వంలోని కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) మాత్రం ఈ సినిమాను కూడా విడిచిపెట్టలేదని తెలుస్తున్నది. విశాల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన 'హేట్‌స్టోరీ-3'లో శర్మాన్ జోషీ, కరణ్‌సింగ్ గ్రోవర్, జరీనా ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పలుచోట్ల డైలాగ్‌లకు సెన్సార్‌బోర్డు మార్పులు సూచించినట్టు తెలిసింది. చిత్రంలోని ఓ సన్నివేశంలో శర్మాన్ జోషీ 'ఓ భగవాన్ కో మై జీత్‌నే నహీ దూంగా' అని అంటాడు. ఈ డైలాగ్‌లో 'భగవాన్' అన్న స్థానంలో 'ఊపర్‌వాలా' అనే పదాన్ని సెన్సార్‌బోర్డు సూచించింది. 'భగవాన్' పదంతో ఓ వర్గం ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందనే కారణంతో ఈ మేరకు మార్పులు చేయించింది.
అదేవిధంగా టీజర్‌లో వినిపించే 'సంభోగ్' పదాన్ని తీయించి.. దాని స్థానంలో 'మిలన్' పదాన్ని చేర్చారు. ఇంకొన్ని డైలాగ్‌లు కూడా అభ్యంతరంగా ఉన్నాయంటూ మార్పులు సూచించారు. జేమ్స్‌బాండ్ సినిమా 'స్పెక్టర్'లో ముద్దు సీన్ నిడివిని సెన్సార్‌బోర్డు సగానికి తగ్గించడంపై వివాదం చెలరేగింది. అయినప్పటికీ 'హేట్‌స్టోరీ-3' సినిమాను శుద్ధిచేయడంలో సెన్సార్‌బోర్డు వెనుకంజ వేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.