క్రిస్మస్కు చిన్న సినిమా పండుగ
జనవరిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలు కాస్త ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి సెలవులను టార్గెట్ చేసే తెలుగు ఇండస్ట్రీ వర్గాలు, ఈ సారి క్రిస్మస్ హాలీడేస్ను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు క్రిస్మస్ సందర్భంగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. దాదాపు అన్ని సినిమాలు మంచి అంచనాలు ఉన్నవే కావటంతో ఈ పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది.
క్రిస్మస్ బరిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సౌఖ్యం. లౌఖ్యం, జిల్ సక్సెస్ల తరువాత గోపిచంద్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అల్లరి నరేష్, మోహన్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన మామ మంచు అల్లుడు కంచు కూడా రిలీజ్ అవుతోంది. చాలా రోజులుగా సరైన హిట్ లేని నరేష్ ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో క్రేజీ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
వీటితో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం భలే మంచిరోజు, నాగశౌర్య హీరోగా తెరకెక్కిన అబ్బాయితో అమ్మాయి, రాజుగారి గది సినిమాతో హీరోగా పరిచయం అయిన అశ్విన్ ( ఓంకార్ తమ్ముడు) హీరోగా తెరకెక్కిన జతకలిసే... సినిమాలు కూడా ఇదే సీజన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురుకాకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.