మినీ థియేటర్లపై దృష్టి
సామాన్యులకు అందుబాటు టికెట్ ధరలో సినిమా థియేటర్ల ఏర్పాటు, పది వేలకు పైగా జనాభా ఉండే మండల కేంద్రాల్లో మినీ థియేటర్ల ఆవశ్యకత... ఇలా పలు అంశాలను తెలంగాణ ప్రొడ్యూసర్స్ అండ్ మినీ థియేటర్స్ ఓనర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అల్లాణి శ్రీధర్, కార్యదర్శి సంగిశెట్టి దశరథ, కార్యవర్గ సభ్యులు లయన్ పి. అమ్రిష్‌కుమార్, టి టాకీస్ టెక్నికల్ హెడ్ బల్వంత్ సింగ్, కృష్ణారావు తదితరులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. ‘‘డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణానికి సింగిల్ విండో పద్ధతిలో అనుమతి, తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌గారు అన్నారు. ఆయన స్పందించిన విధానం ఆనందాన్నిచ్చింది’’ అని సానా, అల్లాణి శ్రీధర్ తదితరులు తెలిపారు.