సినిమా రివ్యూ: గాలిపటం
సినిమా రివ్యూ: గాలిపటం
Published Fri, Aug 8 2014 1:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
నటీనటలు: ఆది, క్రిస్టినా అఖీవా, ఎరికా ఫెర్నాండెజ్, రాహుల్ రవీంద్రన్, పోసాని, హేమ, ప్రగతి, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫి: కే.బుజ్జి
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
కథ, స్క్రీన్ ప్లే: సంపత్ నంది
నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి
దర్శకత్వం: నవీన్ గాంధీ
ప్లస్ పాయింట్స్:
డైలాగ్స్
ఫోటోగ్రఫి
మైనస్ పాయింట్స్: కథ, కథనం
దర్శకుడిగా టాలీవుడ్ లో సుపరిచితులైన సంపతి నంది నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'గాలిపటం'. రొమాంటిక్ లవ్ స్టోరికి 'పవనిజం' అనే ఎక్స్ ట్రా కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల్లో గాలిపటంపై అంచనాలు పెంచడంలో 'సంపత్ నంది' సఫలమయ్యారు. తన మార్కు డైలాగ్స్ తో యూత్ కు కనెక్ట్ అయ్యేలా నిర్మించామనే ప్రచారంతో ముందుకు వచ్చిన 'గాలి పటం' ప్రేక్షకుల అంచనాల మేరకు ఎగిరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!
కార్తీక్(ఆది), స్వాతి(ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లై.. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే కార్తీక్ కు పరిణిత (క్రిస్టినా) అమ్మాయితో ప్రేమ వ్యవహారం, స్వాతి జీవితంలో ఆరవ్ రెడ్డి (రాహుల్)తో అఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకుని మాజీ ప్రియురాలితో కార్తీక్, ప్రియుడితో స్వాతి జీవించాలనుకుంటారు. ప్రేమను కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లిని కార్తీక్ ఎందుకు చేసుకున్నాడు? అఫైర్ వదులుకుని స్వాతి కార్తీక్ ను ఎందుకు పెళ్లి చేసుకుంది? చివరకు ఆరవ్, స్వాతి, కార్తీక్, పరిణితలు ఒక్కటవుతారా? లేక స్వాతి, కార్తీక్ లే కలిసి ఉండాలని కోరుకుంటారా అనే ప్రశ్నలకు దర్శకుడు నవీన్ గాంధీతో కలిసి సంపత్ నంది ఇచ్చిన సమాధానమే 'గాలిపటం'.
సమీక్ష:
ప్రస్తుత సాఫ్ట్ వేర్ యుగంలో యువతీ, యువకుల తీరుతెన్నులను ప్రధాన అంశంగా చేసుకుని ప్రేమ, పెళ్లి అంశాలను జోడించి అల్లుకున్న కథకు సామాజిక అంశాలను అక్కడ జొప్పించడమే కాకుండా వినోదాత్మకంగా చెప్పాలని సంపత్ నంది, నవీన్ గాంధీ చేసిన ప్రయత్నం కొంత సపలమైందని చెప్పవచ్చు. అయితే గాలిపటం చిత్రంలో డైలాగ్స్ పై పెట్టినంత దృష్టి.. కథ, కథనాలపై మరికొంత కేర్ తీసుకుని ఉంటే సంపత్ నందికి మరింత భిన్నమైన ఫలితం లభించి ఉండేది. డైలాగ్స్ అక్కడ బ్రహ్మండంగా పేలాయి. కాని కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని డైలాగ్స్ ఓవర్ టేక్ చేసి ఇదేం గోలరా అనే ఫిలింగ్ కలుగుతుంది.
కొన్ని సామాజిక అంశాలను తెరపై చూపించడానికి ఎంచుకున్న పద్దతి కరెక్ట్ కాదనిపించినా.. కమర్షియల్ అంశాలను మేళవించి.. చివరికి మంచి అంశాన్ని ప్రేక్షకులకు చేరవేశాడనే విషయం బోధపడుతుంది. బామ్మల సీన్ల కన్విన్స్ చేయడానికి కొంత ఇబ్బంది ఉన్నా, భార్గవి దంపతుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కథను బాలెన్స్ గా ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే క్లైమాక్స్ పాయింట్ ను చెప్పడానికి మధ్యలో వినోదం పేరుతో కొన్ని సీన్లను హడావిడిగా చేర్చినట్టు అనిపిస్తుంది. అయితే తాను ఎంచుకున్న ముగింపుకు చేరవేయడానికి జోడించిన ట్విస్టులు అంతగా మెప్పించలేకపోవడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఏదిఏమైనా తాను అల్లుకున్న పాయింట్ తో ఆది, క్రిస్టినా, ఎరికాల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఆదికి ముఖ్యంగా కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రే లభించింది. రాహుల్ కు పెద్దగా ఉపయోగపడని, కెరీర్ కు తోడ్పాడనందించని పాత్రే దక్కింది. క్రిస్టినా, ఎరికాలు గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగితా క్యారెక్టర్లు పర్వాలేదనిపించే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి కే.బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి, భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ. సంపత్ నంది టీమ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. చివరగా యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నా... ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడంపైనా 'గాలిపటం' విజయం ఆధారపడిఉంది.
ట్యాగ్: తక్కువ వ్యాలిడిటితో ఎక్కువ రీఛార్జ్
Advertisement
Advertisement