చెత్త ఎత్తించండి.. సీఎంకు టాప్ హీరో లేఖ
దేవుడి సొంత దేశంగా పేరున్న కేరళకు అతిపెద్ద ముప్పు చెత్తేనని, దాన్ని శుభ్రం చేయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మళయాళ అగ్రనటుడు మోహన్లాల్ లేఖ రాశారు. తాను ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. దాంతో ఇటు నాయకుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ మోహన్లాల్ను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. చెత్త సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత కూడా ప్రధానాంశాలని పేర్కొన్నారు. చెత్త సమస్య కేరళకు అతిపెద్ద ముప్పు అని, కేరళ ఏ టెర్రరిస్టు గురించి ఎక్కువగా భయపడుతుందని ఎవరైనా అడిగితే చెత్త అనే తాను సమాధానం చెబుతానని అన్నారు. చెత్త వేయడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో కేరళీయులు బహిరంగ స్థలాల్లో వేసేస్తున్నారని చెప్పారు. యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువగా మరణిస్తున్నారని, ఈ విషయంలో కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని సూచించారు.
ఇంతకుముందు కూడా చాలామంది నటీనటులు చాలా అంశాలపై లేఖలు రాసినా.. దీన్ని ప్రజలు, నాయకులు రిసీవ్ చేసుకున్న విధానం అందరికీ నచ్చింది. ఏదో సినిమాలలో డైలాగులు చెప్పడం కాకుండా.. సామాజిక సమస్యలపై స్పందించిన తీరు బాగుందని పలువురు ట్విట్టర్ ద్వారా పలువురు చెప్పారు. ఆయన సెలబ్రిటీ కాబట్టి, ఆయన చర్యలను అందరూ గమనిస్తారు కాబట్టి, ఇలా చేయడం చాలా బాగుందని నఫీద్ గఫూర్ అనే విద్యార్థి అన్నాడు. మోహన్లాల్ చెప్పినదాంతో తాను ఏకీభవిస్తున్నానని, ప్రభుత్వం మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అతుల్య అనే ఉద్యోగిని అన్నారు. మోహన్ లాల్ గొప్ప నటుడని, ఆయన చేసిన సూచనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని సీపీఎం చెప్పింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ ఎజెండాలో ఇది ఇప్పటికే ఉందని, దాన్ని అమలుచేయడానికి ప్రయత్నిస్తామని సీపీఎం ఎమ్మెల్యే ఎంబీ రాజేష్ అన్నారు.
మంచి బ్లాగర్గా పేరున్న మోహన్‌లాల్.. మూడు దశాబ్దాలలో దాదాపు 300కు పైగా మళయాళం సినిమాలలో నటించారు. నాలుగుసార్లు జాతీయ అవార్డులు పొందారు. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్తో పాటు జనతా గ్యారేజ్ సినిమాలో కూడా స్ట్రెయిట్గా తెలుగులో నటిస్తున్నారు.