
జార్జియాలో భారీ యుద్ధం
మూడొందల గుర్రాలు.. వెయ్యి మంది సైనికులు.. ఇరవై రథాలు...
ఓటమి ఎరుగని వీరుడు.. అఖండ భారతావనిని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన తెలుగు మహాచక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వందవ చిత్రమిది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు.
వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఈ నెల 4న మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ షెడ్యూల్‌లో మూడు వందల గుర్రాలు, ఇరవై రథాలు, వెయ్యి మంది సైనికులతో శాతవాహనులకు, గ్రీకులకు మధ్య జరిగే పోరాట ఘట్టాలను చిత్రీకరించనున్నాం.
జార్జియాలో మౌంట్‌కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరణ జరగనుంది’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ - ‘‘జార్జియాలో పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. త్వరలో సీజీ వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పోరాటాలు: రామ్ లక్ష్మణ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం: సీతారామ శాస్త్రి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.