
మంచి సినిమాలనెప్పుడూ ఆదరిస్తారు –నాగబాబు
‘మా సన్నిహితులు మోహన్‌గారు అందిస్తున్న ‘వాసుకి’ చిత్రంలో ఎమోషన్, సెంటిమెంట్, సస్పెన్స్ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు. మంచి కథ, సినిమా అయితే వారు తప్పకుండా ఆదరిస్తారు’’ అన్నారు నటుడు నాగబాబు. మమ్ముట్టి, నయనతార జంటగా ఎ.కె. సాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పుదియ నియమం’.
ఈ చిత్రాన్ని ‘వాసుకి’గా ఎస్.ఆర్. మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. ‘‘మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘చిరంజీవిగారి అభిమానిగా పెరిగా. అయన స్ఫూర్తితో ఈ రోజు ఓ సినిమా నిర్మించే స్థాయికి ఎదిగా. చిరంజీవిగారితో సినిమా చేసే స్థాయికి నేను ఎదగాలని నాగబాబుగారి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటున్నా’’ అని మోహన్ అన్నారు.