క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్ | Goodfellas 1990 Crime-style movies | Sakshi
Sakshi News home page

క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్

Published Sun, Jan 25 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్

క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్

అందుకే... అంత బాగుంది!
గుడ్ ఫెల్లాస్ (1990)


తారాగణం: రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో; దర్శకుడు: మార్టిన్ స్కోరెస్; నిర్మాత: ఇర్విన్ వింక్లెర్; ఛాయాగ్రహణం:మైకేల్ బల్హాస్; విడుదల: 19-9-1990; సినిమా నిడివి: 146 నిమిషాలు; నిర్మాణ వ్యయం: 25 మిలియన్ డాలర్లు (ఇప్పటి లెక్కల్లో  రూ. 157 కోట్లు); వసూళ్లు: 46.8 మిలియన్ డాలర్లు (రూ. 294 కోట్లు)

అన్ని సినిమాలూ ఒకలా ఉండవ్. అన్ని సినిమాలూ మనపై ప్రభావం చూపించవ్. కొన్నే మనల్ని కదిలిస్తాయ్... కలవర పెడతాయ్! ‘స్వాతిముత్యం’, ‘మొగల్-ఎ-ఆజమ్’... ఈ రెండూ నాలో సినిమాల పట్ల ప్రత్యేక ఆసక్తి రగిలిస్తే, ‘శివ’, ‘గీతాంజలి’ నాలో దర్శకుడు కావాలనే భావనను మొలకెత్తేలా చేశాయి. కానీ ఒకే ఒక్క సినిమా మాత్రం నన్ను బాగా డిస్ట్రబ్ చేసింది, మనసులో ఎడతెగని ఆలోచనలు రేపింది. సినిమా అంటే ఇలాక్కూడా ఉంటుందా? ఇలాక్కూడా సినిమా తీయొచ్చా? అని నాలో రకరకాల ప్రశ్నలు.

ఆ సినిమానే ‘గుడ్ ఫెల్లాస్’ (1990). మార్టిన్ స్కోరెస్ డెరైక్ట్ చేసిన అమెరికన్ క్రైమ్ ఫిల్మ్ ఇది. ‘టాక్సీ డ్రైవర్’, ‘రేజింగ్ బుల్’, ‘ద కలర్ ఆఫ్ మనీ’, ‘ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’, ‘ది ఏవియేటర్’, ‘ది డిపార్టెడ్’, ‘హ్యూగో’ లాంటి చాలా చాలా గొప్ప సినిమాలు తీసిన దర్శకుడాయన. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తీశారు దీన్ని.సర్వసాధారణంగా మనకు హీరో అంటే మంచివాడై ఉండాలి. ఒక వేళ గనుక సినిమాల్లో హీరోను బ్యాడ్ కేరెక్టర్‌గా చూపించినా అందుకు సంబంధించి ఏవో లాజిక్‌లు, బలమైన కారణాలు చూపిస్తారు. హీరో దొంగతనాలు చేసినా, మానభంగాలు చేసినా... ఇదంతా ఏదో మంచి కారణం కోసం అనే కోణంలోనే చూపిస్తారు. కానీ ‘గుడ్ ఫెల్లాస్’లో హీరో మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ దుర్మార్గుడే. పరివర్తన కలగడం లాంటివేవీ ఉండవు.

ఒక చెడ్డవాడి జీవిత కథ ఇది. చెడ్డవాళ్ల జీవితం ఎలా ఉంటుంది, వాళ్లు ఏ రేంజ్‌లో నేరాలు చేస్తుంటారో ఇందులో ఆవిష్కరించారు. అయితే దర్శకుని గొప్పతనం ఏంటంటే - ఇంత క్రైమ్ చేస్తున్నా కూడా వాళ్ల మీద మనకు కోపం రాకుండా చేయడం... దాదాపు సినిమానంతా అదే రీతిలో తీశాడు. అందుకే మైండ్ బ్లోయింగ్ అనిపించింది.మామూలుగా ఫిలిం మేకర్స్ తెరపై నాటకీయ అంశాలకే ప్రాధాన్యమిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఊహించనిది జరిగితే ఎలా ఉంటుందనే కోణంలోనే సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ, దీనికి పూర్తి భిన్నంగా, చాలా దూరంగా ఈ సినిమా తీశారు. గ్యాంగ్‌స్టర్ కావాలని కలలు కన్న ఓ వ్యక్తి జీవితంలోని ఉత్థాన పతనాల్ని ఇందులో యథాతథంగా ఆవిష్కరించారు.

టూకీగా కథ చెబుతాను. ఇందులో హీరో పేరు ెహన్రీహిల్. ఈస్ట్ న్యూయార్క్ ప్రాంతంలో లుచాస్ గ్యాంగ్ అంటే అందరికీ హడ ల్. కానీ ెహ న్రీకి ఆ గ్యాంగ్ అంటే చాలా క్రేజ్. ఆ గ్యాంగ్‌లా  తానూ నేరాలు చేయాలని కలలు కంటూ ఉంటాడు. ఆ ప్రయుత్నంలోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి బయటికొచ్చాక ‘క్యాపో’ అనే లోకల్ గ్యాంగ్ అరన  పాలీ, జేమ్స్, టామీలను కలుస్తాడు. వీళ్లంతా కలిసి దోపిడీలు మొదలుపెడతారు. ఆ డబ్బుతోనే జల్సాలు చేస్తారు. చివరకు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి కూడా అడుగుపెడతారు. ెహ న్రీ భార్య జెనైస్. కానీ హెన్రీ కరేన్‌తో ప్రేమలో పడతారు. ెహ న్రీకి ముందే పెళ్లయిన సంగతి తెలియడంతో కోపంతో వెళ్లిపోతుంది. టామీ తన ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన బిల్లీ స్టువార్ట్‌ను హత్యచేస్తాడు. ముగ్గురూ కలిసి ఈ శవాన్ని దాచేస్తారు. ఓ గాంబ్లర్ ను చంపేశారన్న కారణంగా హెన్రీ, టామీలకు పదేళ్ల జైలు శిక్షపడుతుంది. జైలులోనే వాళ్లు మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెడతారు. బయటికొచ్చాక వీరిద్దరూ కలిసి మళ్లీ దోపిడీలు చేస్తారు. ఈలోగా టామీ హత్యకు గురవుతాడు. దీంతో నేరసామ్రాజ్యానికి దూరంగా ఉండాలని ెహ న్రీ నిర్ణయించుకుంటాడు. మాదకద్రవ్యాల కేసులో పోలీసులకు అప్రూవల్‌గా మారిపోతాడు. ఎఫ్‌బీఐకి భయపడి హెన్రీ భార్య జెనైస్ డబ్బును పారేస్తుంది. హెన్రీ మళ్లీ జీరో అయిపోతాడు.

‘గుడ్ ఫెల్లాస్’లో గొప్ప గొప్ప షాట్స్ కన్నా, గొప్ప గొప్ప కేరెక్టరైజేషన్స్ ఉన్నాయి. నేరం చేసే సమయంలో క్రిమినల్స్ మానసిక స్థితిని చక్కగా ఒడిసిపట్టాడు దర్శకుడు. ఒక గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ని పదేళ్ల వయసులో మొదలుపెట్టి ముగింపు వరకూ ఇందులో చూపిస్తారు. ఎక్కడా ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు. ప్రతీది ఇది సబబే కదా అనే రీతిలోనే డెరైక్టర్ డీల్ చేశాడు. ఆర్టిస్టుల ఎంపిక కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే, రియల్ గ్యాంగ్‌స్టర్స్‌తోనే ఈ సినిమా తీసిన ఫీలింగ్ కలుగుతుంది. రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీల నటన అద్భుతం అనిపిస్తుంది. వరల్డ్ టాప్ 100 మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఇవాళ్టికీ క్రైమ్ జానర్‌లో ఎవరు సినిమా తీసినా, ఈ సినిమా ఒక మంచి రిఫరెన్స్. దీనికి ఆరు ఆస్కార్ నామినేషన్లు దక్కాయి. అయిదు బ్రిటిష్ అకాడమీ పురస్కారాలు గెలుచుకుంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు సాధించింది.

నా ఫేవరెట్ మూవీగా ఇలాంటి క్రైమ్ సినిమా పేరు చెప్పినందుకు, చాలామందికి ఆశ్చర్యం కలుగుతుందేమో. నాపై సాఫ్ట్ సినిమా ముద్ర వేసేశారు కానీ, నేను కూడా క్రైమ్ జానర్‌లో సినిమా తీయగలను. నా తొలి సినిమా ‘సంతోషం’ తర్వాత, క్రైమ్ తరహా కథతో ‘సాయి’ అనే సినిమా చేయాలనుకున్నా. కానీ కుదర్లేదు.‘అమెరికన్ స్నైపర్’ని నేనిప్పటికి 20 సార్లు చూశాను. 20 రోజుల క్రితం కూడా మళ్లీ చూశానీ సినిమా. ఎప్పుడు చూసినా సేమ్ ఫీలింగ్. మైండ్ బ్లోయింగ్.

మార్టిన్ స్కార్సెసె తండ్రి చార్లెస్ స్కార్సెసె చిన్నపాటి నటుడు. కుటుంబ పోషణ కోసం బట్టలు ఇస్త్రీ కూడా చేసేవారు. మార్టిన్ తల్లి కేథరిన్ కూడా చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. చిన్నప్పుడు మార్టిన్ ఆస్మా వ్యాధితో బాధపడటంవల్ల తన తోటి పిల్లలతో ఆడుకోలేకపోయేవాడు. దాంతో తల్లిదండ్రులు అతన్ని సినిమాలకు తీసుకెళ్లేవారు. ఆ విధంగా సినిమాలపై మార్టిన్‌కి ఆసక్తి ఏర్పడింది. బీఏ పూర్తి చేసిన తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఫిలిం ఆర్ట్స్’ చేశారు. అనంతరం కొన్ని షార్ట్ ఫిలింస్ తీసి, ‘హూ ఈజ్ దట్ నాకింగ్ మై డోర్’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. విశేషం ఏంటంటే, నటనపట్ల తన తల్లికి ఉన్న ఆసక్తిని గమనించి, ఈ చిత్రంలో మంచి పాత్ర చేయించారు. ఆ తర్వాత మార్టిన్ దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాల్లో కేథరిన్ నటించారు. ‘టాక్సీ డ్రెవర్’, ‘ది డిపార్టెడ్’,  ‘ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’.. ఇలా మార్టిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. తన చిత్రాల ద్వారా సమాజంలోని చీకటి కోణాలను వెలికి తీసిన దర్శకునిగా మార్టిన్‌కి గుర్తింపు ఉంది.
మార్టిన్ స్కార్సెసె

- సంభాషణ: పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement