Robert de niro
-
79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన స్టార్ హీరో
హాలీవుడ్ హీరో రాబర్ట్ డి నిరో మరోసారి తండ్రయ్యాడు. అందులో ఆశ్చర్యపోవడానికేముందంటారేమో! ఆయనకు ఇప్పుడు 79 ఏళ్లు కాగా పుట్టిన బిడ్డ ఏడో సంతానం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. ఎబౌట్ మై ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్‌కు తన ఆరుగురు పిల్లల గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు మధ్యలో కలగజేసుకుంటూ నాకు ఆరుగురు కాదు, ఏడుగురు పిల్లలు అని చెప్పుకొచ్చాడు. ఏడోసారి తండ్రైన స్టార్ హీరో ఈ మధ్యే తాను ఏడోసారి తండ్రయ్యానని వెల్లడించాడు. అయితే ఆ బిడ్డకు తల్లెవరన్నది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం అతడు నటి టిఫానీ చెన్‌తో ప్రేమలో ఉన్నాడు. ఆ మధ్య టిఫానీ, రాబర్ట్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో టిఫానీయే రాబర్ట్ ఏడో సంతానానికి తల్లి కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండు పెళ్లిళ్లు- విడాకులు, మరో ఇద్దరితో సహజీవనం కాగా రాబర్ట్ డి నిరో మొదట డయానే అబాట్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి డ్రీనా అనే కూతురు(51), రఫేల్(46) అనే కుమారుడు ఉన్నారు. తర్వాత ఆమెతో తెగదెంపులు చేసుకున్న ఈయన మోడల్, నటి టుకీ స్మిత్‌తో సహజీవనం చేశాడు. 1995లో వీరికి కవలలు జులైన్, ఆరన్(27) జన్మించారు. కొంతకాలం తర్వాత ఆమెతో పొసగలేకపోయిన రాబర్ట్.. గ్రేస్ హైటవర్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎల్లియట్ (24), హెలెన్ గ్రేస్(11) అనే పిల్లలున్నారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. గ్రేస్‌కు సైతం విడాకులిచ్చి ఇప్పుడు టిఫానీతో ప్రేమాయణం నడుపుతున్నాడు. రెండుసార్లు ఆస్కార్ విజేతగా.. గొప్ప నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన రాబర్ట్.. ద గాడ్ ఫాదర్: పార్ట్ 2, ర్యాగింగ్ బుల్, ట్యాక్సీ డ్రైవర్, ద ఐరిష్‌మ్యాన్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. పలు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆయనకు రెండు సార్లు అకాడమీ అవార్డు వరించడం విశేషం. అలాగే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్‌ను సైతం అందుకున్నాడు. చదవండి: ది కేరళ స్టోరీ సినిమాపై నటి పోస్ట్.. ఫైర్ -
ఫిదా అయిపోయా
రోబర్ట్ డి నీరో.. హాలీవుడ్లో అద్భుతమైన యాక్టర్. రిషీ కపూర్ మనదగ్గర సూపర్ యాక్టర్. రణ్‌బీర్ కపూర్ యంగ్ యాక్టర్స్‌లో మంచి మార్కులు కొట్టేస్తున్న నటుడు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం సాధారణ మెడికల్ చెకప్ కోసం న్యూయార్క్‌లో ఉన్నారు రిషీ కపూర్. అక్కడ ఆయన చేస్తున్న పనులన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా రోబర్ట్ డి నీరోని కలిశారట. ‘‘వావ్ మూమెంట్ ఇది. అనుకోనుండా డి నీరోని కలిశాం. తనకి ఆల్రెడీ రణ్‌బీర్ తెలుసు. స్టార్డమ్ ఉన్నప్పటికీ నీరో సింపుల్‌గా ఉన్నారు. నేను చాలా దురుసుగా ఉంటానని అర్థం అయింది. అతని ప్రవర్తనకి ఫిదా అయిపోయా ’’ అని పై ఫొటోను షేర్ చేశారు రిషీ కపూర్. -
యాక్టింగ్ దేవుడు
రాబర్ట్ డెనీరోను యాక్టింగ్‌కు దేవుడిగా చెప్పుకుంటారు ఆయనను అభిమానించే వాళ్లు. ఐదు దశాబ్దాల కాలంలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకొని, తాను తప్ప ఇంకెవరూ చెయ్యలేరన్న పాత్రలు చేసి మెప్పించిన డెనీరోకు ఇండియాలోనూ ఫ్యాన్స్ తక్కువేమీ లేరు. ముఖ్యంగా ఇండియన్ సినిమా సెలెబ్రిటీలు తమకు బాగా ఇష్టమైన నటుల పేర్లు చెప్పమంటే వినిపించే పేర్లలో రాబర్ట్ డెనీరో పేరు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో నటుడిగా తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న అనుపమ్ ఖేర్ కూడా డెనీరోకు వీరాభిమాని. వీరిద్దరూ కలిసి గతంలో ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్షిప్ కూడా కుది రింది. తాజాగా అనుపమ్ ఖేర్ పుట్టినరోజు (మార్చి 7) సందర్భంగా డెనీరో తన భార్యతో కలిసి, అనుపమ్‌కు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే అంటూ డెనీరో పాట కూడా పాడాడు. ‘‘నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. నాకు యాక్టింగ్ దేవుడు ఇచ్చిన బర్త్‌డే పార్టీ గొప్ప సంతోషాన్నిచ్చింది.’’ అంటూ అనుపమ్ ఖేర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ∙రాబర్ట్ డెనీరో -
ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే నీరో ట్రంప్‌పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ట్రంప్ ఓ పంది, ఓ కుక్క, పనికిమాలిన ఎద్దు ఇంకా చాలా అంటూ ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు. అతడొక జాతీయ విపత్తులాంటివారంటూ ఆరోపించారు. ట్రంప్ విషయమే తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోందని, అసలు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ ముక్కుమీద ఒక్కసారి గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా ట్రంప్ ఓ ట్యాక్సీ డ్రైవర్ లాంటి వాడంటూ విమర్శించాడు. -
క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్
అందుకే... అంత బాగుంది! గుడ్ ఫెల్లాస్ (1990) తారాగణం: రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో; దర్శకుడు: మార్టిన్ స్కోరెస్; నిర్మాత: ఇర్విన్ వింక్లెర్; ఛాయాగ్రహణం:మైకేల్ బల్హాస్; విడుదల: 19-9-1990; సినిమా నిడివి: 146 నిమిషాలు; నిర్మాణ వ్యయం: 25 మిలియన్ డాలర్లు (ఇప్పటి లెక్కల్లో రూ. 157 కోట్లు); వసూళ్లు: 46.8 మిలియన్ డాలర్లు (రూ. 294 కోట్లు) అన్ని సినిమాలూ ఒకలా ఉండవ్. అన్ని సినిమాలూ మనపై ప్రభావం చూపించవ్. కొన్నే మనల్ని కదిలిస్తాయ్... కలవర పెడతాయ్! ‘స్వాతిముత్యం’, ‘మొగల్-ఎ-ఆజమ్’... ఈ రెండూ నాలో సినిమాల పట్ల ప్రత్యేక ఆసక్తి రగిలిస్తే, ‘శివ’, ‘గీతాంజలి’ నాలో దర్శకుడు కావాలనే భావనను మొలకెత్తేలా చేశాయి. కానీ ఒకే ఒక్క సినిమా మాత్రం నన్ను బాగా డిస్ట్రబ్ చేసింది, మనసులో ఎడతెగని ఆలోచనలు రేపింది. సినిమా అంటే ఇలాక్కూడా ఉంటుందా? ఇలాక్కూడా సినిమా తీయొచ్చా? అని నాలో రకరకాల ప్రశ్నలు. ఆ సినిమానే ‘గుడ్ ఫెల్లాస్’ (1990). మార్టిన్ స్కోరెస్ డెరైక్ట్ చేసిన అమెరికన్ క్రైమ్ ఫిల్మ్ ఇది. ‘టాక్సీ డ్రైవర్’, ‘రేజింగ్ బుల్’, ‘ద కలర్ ఆఫ్ మనీ’, ‘ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’, ‘ది ఏవియేటర్’, ‘ది డిపార్టెడ్’, ‘హ్యూగో’ లాంటి చాలా చాలా గొప్ప సినిమాలు తీసిన దర్శకుడాయన. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తీశారు దీన్ని.సర్వసాధారణంగా మనకు హీరో అంటే మంచివాడై ఉండాలి. ఒక వేళ గనుక సినిమాల్లో హీరోను బ్యాడ్ కేరెక్టర్గా చూపించినా అందుకు సంబంధించి ఏవో లాజిక్‌లు, బలమైన కారణాలు చూపిస్తారు. హీరో దొంగతనాలు చేసినా, మానభంగాలు చేసినా... ఇదంతా ఏదో మంచి కారణం కోసం అనే కోణంలోనే చూపిస్తారు. కానీ ‘గుడ్ ఫెల్లాస్’లో హీరో మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ దుర్మార్గుడే. పరివర్తన కలగడం లాంటివేవీ ఉండవు. ఒక చెడ్డవాడి జీవిత కథ ఇది. చెడ్డవాళ్ల జీవితం ఎలా ఉంటుంది, వాళ్లు ఏ రేంజ్లో నేరాలు చేస్తుంటారో ఇందులో ఆవిష్కరించారు. అయితే దర్శకుని గొప్పతనం ఏంటంటే - ఇంత క్రైమ్ చేస్తున్నా కూడా వాళ్ల మీద మనకు కోపం రాకుండా చేయడం... దాదాపు సినిమానంతా అదే రీతిలో తీశాడు. అందుకే మైండ్ బ్లోయింగ్ అనిపించింది.మామూలుగా ఫిలిం మేకర్స్ తెరపై నాటకీయ అంశాలకే ప్రాధాన్యమిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఊహించనిది జరిగితే ఎలా ఉంటుందనే కోణంలోనే సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ, దీనికి పూర్తి భిన్నంగా, చాలా దూరంగా ఈ సినిమా తీశారు. గ్యాంగ్‌స్టర్ కావాలని కలలు కన్న ఓ వ్యక్తి జీవితంలోని ఉత్థాన పతనాల్ని ఇందులో యథాతథంగా ఆవిష్కరించారు. టూకీగా కథ చెబుతాను. ఇందులో హీరో పేరు ెహన్రీహిల్. ఈస్ట్ న్యూయార్క్ ప్రాంతంలో లుచాస్ గ్యాంగ్ అంటే అందరికీ హడ ల్. కానీ ెహ న్రీకి ఆ గ్యాంగ్ అంటే చాలా క్రేజ్. ఆ గ్యాంగ్‌లా తానూ నేరాలు చేయాలని కలలు కంటూ ఉంటాడు. ఆ ప్రయుత్నంలోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి బయటికొచ్చాక ‘క్యాపో’ అనే లోకల్ గ్యాంగ్ అరన పాలీ, జేమ్స్, టామీలను కలుస్తాడు. వీళ్లంతా కలిసి దోపిడీలు మొదలుపెడతారు. ఆ డబ్బుతోనే జల్సాలు చేస్తారు. చివరకు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి కూడా అడుగుపెడతారు. ెహ న్రీ భార్య జెనైస్. కానీ హెన్రీ కరేన్తో ప్రేమలో పడతారు. ెహ న్రీకి ముందే పెళ్లయిన సంగతి తెలియడంతో కోపంతో వెళ్లిపోతుంది. టామీ తన ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన బిల్లీ స్టువార్ట్‌ను హత్యచేస్తాడు. ముగ్గురూ కలిసి ఈ శవాన్ని దాచేస్తారు. ఓ గాంబ్లర్ ను చంపేశారన్న కారణంగా హెన్రీ, టామీలకు పదేళ్ల జైలు శిక్షపడుతుంది. జైలులోనే వాళ్లు మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెడతారు. బయటికొచ్చాక వీరిద్దరూ కలిసి మళ్లీ దోపిడీలు చేస్తారు. ఈలోగా టామీ హత్యకు గురవుతాడు. దీంతో నేరసామ్రాజ్యానికి దూరంగా ఉండాలని ెహ న్రీ నిర్ణయించుకుంటాడు. మాదకద్రవ్యాల కేసులో పోలీసులకు అప్రూవల్‌గా మారిపోతాడు. ఎఫ్‌బీఐకి భయపడి హెన్రీ భార్య జెనైస్ డబ్బును పారేస్తుంది. హెన్రీ మళ్లీ జీరో అయిపోతాడు. ‘గుడ్ ఫెల్లాస్’లో గొప్ప గొప్ప షాట్స్ కన్నా, గొప్ప గొప్ప కేరెక్టరైజేషన్స్ ఉన్నాయి. నేరం చేసే సమయంలో క్రిమినల్స్ మానసిక స్థితిని చక్కగా ఒడిసిపట్టాడు దర్శకుడు. ఒక గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ని పదేళ్ల వయసులో మొదలుపెట్టి ముగింపు వరకూ ఇందులో చూపిస్తారు. ఎక్కడా ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు. ప్రతీది ఇది సబబే కదా అనే రీతిలోనే డెరైక్టర్ డీల్ చేశాడు. ఆర్టిస్టుల ఎంపిక కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే, రియల్ గ్యాంగ్స్టర్స్తోనే ఈ సినిమా తీసిన ఫీలింగ్ కలుగుతుంది. రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీల నటన అద్భుతం అనిపిస్తుంది. వరల్డ్ టాప్ 100 మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఇవాళ్టికీ క్రైమ్ జానర్లో ఎవరు సినిమా తీసినా, ఈ సినిమా ఒక మంచి రిఫరెన్స్. దీనికి ఆరు ఆస్కార్ నామినేషన్లు దక్కాయి. అయిదు బ్రిటిష్ అకాడమీ పురస్కారాలు గెలుచుకుంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు సాధించింది. నా ఫేవరెట్ మూవీగా ఇలాంటి క్రైమ్ సినిమా పేరు చెప్పినందుకు, చాలామందికి ఆశ్చర్యం కలుగుతుందేమో. నాపై సాఫ్ట్ సినిమా ముద్ర వేసేశారు కానీ, నేను కూడా క్రైమ్ జానర్లో సినిమా తీయగలను. నా తొలి సినిమా ‘సంతోషం’ తర్వాత, క్రైమ్ తరహా కథతో ‘సాయి’ అనే సినిమా చేయాలనుకున్నా. కానీ కుదర్లేదు.‘అమెరికన్ స్నైపర్’ని నేనిప్పటికి 20 సార్లు చూశాను. 20 రోజుల క్రితం కూడా మళ్లీ చూశానీ సినిమా. ఎప్పుడు చూసినా సేమ్ ఫీలింగ్. మైండ్ బ్లోయింగ్. మార్టిన్ స్కార్సెసె తండ్రి చార్లెస్ స్కార్సెసె చిన్నపాటి నటుడు. కుటుంబ పోషణ కోసం బట్టలు ఇస్త్రీ కూడా చేసేవారు. మార్టిన్ తల్లి కేథరిన్ కూడా చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. చిన్నప్పుడు మార్టిన్ ఆస్మా వ్యాధితో బాధపడటంవల్ల తన తోటి పిల్లలతో ఆడుకోలేకపోయేవాడు. దాంతో తల్లిదండ్రులు అతన్ని సినిమాలకు తీసుకెళ్లేవారు. ఆ విధంగా సినిమాలపై మార్టిన్కి ఆసక్తి ఏర్పడింది. బీఏ పూర్తి చేసిన తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఫిలిం ఆర్ట్స్’ చేశారు. అనంతరం కొన్ని షార్ట్ ఫిలింస్ తీసి, ‘హూ ఈజ్ దట్ నాకింగ్ మై డోర్’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. విశేషం ఏంటంటే, నటనపట్ల తన తల్లికి ఉన్న ఆసక్తిని గమనించి, ఈ చిత్రంలో మంచి పాత్ర చేయించారు. ఆ తర్వాత మార్టిన్ దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాల్లో కేథరిన్ నటించారు. ‘టాక్సీ డ్రెవర్’, ‘ది డిపార్టెడ్’, ‘ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’.. ఇలా మార్టిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. తన చిత్రాల ద్వారా సమాజంలోని చీకటి కోణాలను వెలికి తీసిన దర్శకునిగా మార్టిన్కి గుర్తింపు ఉంది. మార్టిన్ స్కార్సెసె - సంభాషణ: పులగం చిన్నారాయణ -
తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో
పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్‌లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్‌పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్‌లో థింక్‌ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి తీసుకెళ్లే క్రమంలో తేజ్‌పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. -
తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
సహచర ఉద్యోగిపై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని నమోదైన కేసు హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డి నీరో మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో రాబర్డ్ డి నీరోకు ఎలాంటి ప్రమేయం లేకున్నా మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ ను గోవా డీఐజీ ఓపి మిశ్రా ప్రశ్నించే అవకాశం ఉంది. తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తున్నామని మిశ్రా మీడియాకు తెలిపారు. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరీ ఫిర్యాదు మేరకే రాబర్డ్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాబర్డ్ డీ నిరోతో సమావేశమవ్వాలనే కారణంతో సహచర ఉద్యోగిని పిలిచి... లిఫ్ట్ లో లైంగికంగా వేధించినట్టు షోమా ఫిర్యాదు తెలిపింది. గోవాలో నవంబర్ 8, 9 తేదిల్లో తెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్డ్ డి నీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు. -
హాలీవుడ్ నటుడిని కలుద్దామంటూ కీచకం!
తేజ్పాల్పై మహిళా జర్నలిస్టు ఆరోపణ న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగికదాడికి పాల్పడినట్లు తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై గోవా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో పేరు ప్రస్తావనకు వచ్చింది. డినీరోను కలుద్దామని ప్రలోభపెట్టి తేజ్‌పాల్ బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసినట్లు అందులో ఉంది. తెహెల్కాలోనే పనిచేస్తున్న బాధితురాలు ఆ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరికి చేసిన ఫిర్యాదులో ఈమేరకు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7, 8న గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్లో తేజ్‌పాల్ లిప్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. ఈ నెల 8, 9న ఆ హోటల్లో జరిగిన ‘తెహెల్కా థింక్‌ఫెస్ట్’లో డినీరో ప్రధాన వక్త. బాధితురాలు చౌదరికి చేసిన ఫిర్యాదులోని వివరాలు ఆమె మాటల్లోనే..‘‘తేజ్‌పాల్ లిఫ్టు ఎక్కడా ఆగకుండా బటన్లు నొక్కారు. కాసేపయ్యాక డినీరో ఉన్న రెండో అంతస్తులో లిఫ్టు డోర్ తెరుచుకుంది. ‘విశ్వం మనకో సంగతి చెబుతోంది’ అని తేజ్‌పాల్ చెప్పారు. నేను మెట్లగుండా వెళ్తానని లిఫ్టులోంచి బయటకు రాబోయాను. దీంతో ఆయన నన్ను లిఫ్టులోకి లాగారు. నాపై భౌతికదాడి చేశారు.’’ ప్రశ్నించకుండానే... ఈ కేసు దర్యాప్తు కోసం ఆదివారం ఢిల్లీ వచ్చిన గోవా పోలీసులు తేజ్పాల్ను ప్రశ్నించకుండానే వెళ్లిపోయారు. వారు తేజ్పాల్ను ప్రశ్నించడానికి కానీ, అరెస్టు చేయడానికి కానీ రాలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. వారు బాధితురాలిని కలుసుకుని అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరారని, ఫిర్యాదు చేశాక తేజ్పాల్ను అరెస్టు చేసే అవకాశముం దని అన్నాయి. గోవా పోలీసులు.. మహిళా జర్నలిస్టు, చౌదరి, తేజ్పాల్ల ఈ-మెయిళ్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చే సుకున్నారు. బాధితురాలి సహోద్యోగులైన ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఆమెకు రక్షణ కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ ముంబై పోలీసులను కోరింది. తనపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టు అబద్ధాలాడుతోందని తేజ్‌పాల్ ఆరోపించినట్లు సమాచారం.