
హీరో గోపీచంద్ నటిస్తున్న 25వ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘బలుపు, పవర్, జై లవకుశ’ వంటి హిట్ సిన్మాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె. చక్రవర్తి (చక్రి)ని దర్శకునిగా పరిచయం చేస్తూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. రామ్మోహన్‌రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో రూపొందుతోన్న 7వ చిత్రమిది. ‘బెంగాల్ టైగర్’ ప్రారంభమైన ప్లేస్‌లోనే ఈ సినిమా ప్రారంభం కావడం హ్యాపీగా ఉంది.
‘బెంగాల్ టైగర్’లానే ఇదీ పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది. వచ్చే నెల 16న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘శక్తివంతమైన సందేశంతో మా నాన్నగారు (దర్శకులు టి. కృష్ణ) సినిమాలు తీసేవారు. అటువంటి సందేశంతో, కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందనుంది. రాధామోహన్‌గారి సంస్థలో చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘గోపీచంద్‌గారి 25వ సిన్మా కావడంతో హ్యాపీగానూ, బాధ్యతగానూ ఫీలవుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో, మా నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు చక్రి. చిత్రకథానాయిక మెహరీన్, ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మూరెళ్ల, మాటల రచయిత రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పృథ్వీ, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు నటించే ఈ చిత్రానికి కళ: ఏఎస్ ప్రకాశ్, కథనం: చక్రి, కె.ఎస్. రవీంద్ర (బాబీ), సంగీతం: గోపీసుందర్.
Comments
Please login to add a commentAdd a comment