![Gul Panag Revealed That She Welcomed A Baby Boy Six Months Ago - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/2/gul-panag.jpg.webp?itok=9CPoXOjr)
కొడుకు నిహాల్‌తో గుల్ పనాగ్
మాజీ మిస్ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్‌గా.. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన గుల్ పనాగ్ ప్రస్తుతం తల్లిగా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదేంటి ఆమె ఎప్పుడు తల్లయ్యారు అనుకుంటున్నారా.. ఆరు నెలల క్రితమేనటండీ. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాననే శుభవార్తను ఆమే స్వయంగా తెలియజేశారు. అయితే ఇన్నాళ్లుగా ఆ విషయం ఎలా దాయగలిగారని ప్రశ్నించగా.. ‘రిషి(గుల్ పనాగ్ భర్త), నేను ప్రతీ విషయంలో ప్రైవసీని కోరుకుంటాం. తల్లిదండ్రులుగా మారటం అనేది ఒక గొప్ప అనుభూతి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రతీ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పాల్సిన పనిలేదు. మా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మాత్రమే నిహాల్ గురించి తెలుసంటూ’ సమాధానమిచ్చారు.
కుమారుడి పేరు గురించి ప్రస్తావిస్తూ.. ‘నిహాల్ అంటే ఆనందం, విజయం అని అర్థం. వాడి రాకతో ఆ రెండు మా జీవితాల్లోకి వచ్చేశాయి. అందుకే మా గారాల పట్టికి ఆ పేరు పెట్టామని’ చెప్పుకొచ్చారు. నిహాల్ రాకతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చానని, ప్రస్తుతం వాడి అల్లరితోనే సమయం గడుస్తోందని.. త్వరలోనే కెరీర్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. వయసు మీద పడుతోంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి, త్వరగా పిల్లల్ని కనేయాలనే నిబంధనలు పెట్టుకునే బాపతు తాను కాదని చెప్పుకొచ్చారీ ఈ 39 ఏళ్ల బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment