విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు | GV Prakash’s Trisha Illana Nayanthara | Sakshi
Sakshi News home page

విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు

Published Wed, Aug 26 2015 5:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు - Sakshi

విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు

ఇళయదళపతి విజయ్ వెనుకడుగేయడంతో యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ముందుకు దూసుకొస్తున్నారు. ఏమిటీ కాస్త తికమకగా ఉందా? అయితే వివరాల్లోకెళదాం. విజయ్ నటిస్తున్న భారీ సోషల్ ఫాంటసీ కథా చిత్రం పులి. నటి శ్రీదేవి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హన్సిక  కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శింబుదేవన్ దర్శకత్వంలో పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు.

కాగా నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న పులి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దీంతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చాలా చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు. అలా మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న చిత్రాల్లో త్రిష ఇల్లన్న నయనతార ఒకటి. కాగా పులి చిత్రం వీఎఫ్‌ఎక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్ర విడుదలను అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.

దీంతో భలే చాన్స్‌లే లక్కీచాన్స్‌లే అన్నంత ఆనందంతో త్రిష ఇల్లన్న నయనతార చిత్రం సెప్టెంబర్ 17 విడుదలకు ముస్తాబవుతోందన్నది తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషాయాదవ్,ఆనంది నాయికలుగా నటించారు. నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించిన ఇందులో ఆర్య,ప్రియా ఆనంద్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మించింది.

విశేషం ఏమిటంటే అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం విడుదల తేదీ అనూహ్యంగా కొంచెం వెనక్కి వెళ్లడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన డార్లింగ్ చిత్రం అనూహ్యంగా విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ చిత్రం పులి వెనక్కు వెళ్లడంతో త్రిష ఇల్లన్న నయనతార ముందుగా తెరపైకి రానుంది. మరో విశేషం డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియోగ్రీన్ సంస్థనే ఈ త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేయనుంది.మరి డార్లింగ్ మ్యాజిక్ ఈ సారి వర్కౌట్ అవుతుందా?అన్నది వేసి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement