ప్రేమలో ఓటమి నరకమే!
ప్రేమలో ఓటమి నరకమే!
Published Tue, Apr 15 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
ప్రేమించినట్లు నటించడం కూడా మోసం చేయడమే నంటున్నారు నటి హన్సిక. విజయానికి చిరునామాగా మారిందీ బ్యూటీ. అయితే విజయం ఒక్కోసారి వేదనను తెచ్చిపెడుతుంది. అందుకు కారణం అనాలోచిత నిర్ణయాలు కావచ్చు. గుడ్డి నమ్మకాలు కావచ్చు. నటిగా విజయ బాటలో పయనిస్తున్న హన్సిక వ్యక్తిగతంగా కొన్ని చేదు అనుభవాలను చవిచూశారు. అయినా హీరోయిన్‌గా తన కెరీర్‌కు ఎలాంటి డోకా లేదంటున్న ఈ బ్యూటీ శింబుతో లవ్ బ్రేకప్ అయిన తరువాత ఎలా ఉన్నారని తెలుసుకోవాలని ఆమె అభిమానులు ఆరాటపడుతున్నారు. అలాంటి వారి కోసం హన్సికతో చిన్న ఇంటర్వ్యూ.
మాన్ కరాటే చిత్రంతో మీకు ఎలాంటి ఆదరణ తెచ్చిపెట్టింది?
చాలా మంచి ఆదరణ లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. శివకార్తికేయన్ నేను తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ఇది. విడుదలకు ముందు ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంత మంచి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు డార్లింగ్ అని పిలుస్తున్నారు.
శింబుతో ఎఫైర్ తరువాత అవకాశాలు తగ్గాయూ?
శింబు నుంచి విడిపోవడానికి ముందు, ఆ తరువాత అంటూ చెప్పడానికి నేను ఇష్టపడను కానీ ప్రస్తుతం నా చేతిలో ఏడు తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాలు మొత్తం 9 ఉన్నాయి. నేను నటిగా బిజీగానే ఉన్నాను.
తమిళ ప్రేక్షకుల తాజా కలల రాణి మీరే అంటున్నారు!
అందుకు కృతజ్ఞతలు. అభిమానుల నోట కలలరాణి మాట వినడం సంతోషంగా ఉంది.
కలల రాణిగా మారడానికి త్యాగం చేశారా?
పెద్దగా త్యాగం ఏమీ చేయలేదు. నా బాధ్యతనే చక్కగా నిర్వర్తించాను. నిత్యం యోగా చేస్తాను. ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటాను. స్క్వాష్ క్రీడ ఆడతాను. ఇంత కంటే అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయను.
ప్రేమ గురించి మీ అభిప్రాయం?
ప్రేమ అనేది అందమైన భావన. అది పెళ్లికి ముందయినా, ఆ తరువాత అయినా అమరాలి. అయితే ప్రేమ అనేది ప్రేమికులకు సంబంధించిందే అని భావించరాదు. ఈ ప్రేమ అనేది తల్లిదండ్రులు, స్నేహితులు, మనకు నచ్చిన వాళ్ల నుంచి లభిస్తుంది. మనం ఇతరులతో ప్రేమగా మసలుకుంటే వాళ్లు మనపై ప్రేమ కురిపిస్తారు.
ప్రేమ పేరుతో మోసం చేసే వారి గురించి?
ప్రేమ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అమరుతుంది. కొందరు ప్రేమలో జయిస్తారు. మరి కొందరు ఓడిపోతారు. గెలిచినవారికి శుభాకాంక్షలు, ఓడిన వారికి సానుభూతిని తెలుపుతున్నాను. ప్రేమలో మోసపోవడం వేదన కలిగించే విషయం. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్రేమలో ఓటమి బాధ నరకమే. ప్రేమించినట్లు నటించి మోసం చేయడం అంతకంటే దారుణం.
మీ ప్రేమ గురించి?
నో కామెంట్
ప్రపంచంలోనే అందమైన వ్యక్తి?
హాలీవుడ్ నటుడు బ్రూడ్లీ
తమిళ ప్రేక్షకుల కోసం ఏం చేయూలనుకుంటున్నారు?
నా వల్ల అయిన సహాయం చేస్తున్నాను. మరిన్ని సహాయ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ముంబాయిలో అనాథ ఆశ్రమం నెలకొల్పి పలువురు అనాథలకు ఆశ్రయం కల్పించాను. తమిళనాడులో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సాయం చేస్తున్నాను. ఇంకా పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను.
నటి ఖుష్బూలాగే మీరు రాజకీయాల్లోకొస్తారా?
అలాంటి ఆలోచనే లేదు. నేను ఒక నటిని. నటించడానికి ఈ రంగానికి వచ్చాను. నటనలో సంతృప్తి పొందితే చాలు. ప్రస్తుతానికి అంతే!
Advertisement
Advertisement