అమ్మాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటా
యుక్తవయసు, ఉడుకు రక్తం, చిలిపి మనసు ఈ మూడు మిళితమైన మనిషి చేసే అల్లరి కొందరికి కొంటెతనంగా ఉంటే మరికొందరికి కష్టతరంగా ఉంటుంది. అయితే ఇవి ఇచ్చే అనుభవాలు మాత్రం మనిషిలో చాలా మార్పునకు కారణం అవుతాయి. అవి పాఠాలు కావచ్చు, గుణపాఠాలు కావచ్చు. అలాంటి ప్రేమానుభావాలు నటుడు శింబులో చాలా మార్పును తీసుకొచ్చాయని ఆయన మాటల్లో తేటతెల్లమవుతోంది.
నటుడు శింబు అనగానే ఆయనో ప్లే బాయ్ అనే పేరు ప్రచారంలో ఉంది. అందుకు తగిన కారణాలు లేకపోలేదు. నటి నయనతారతో ఘాటు ప్రేమ, ఆ తరువాత విడిపోవడం, మళ్లీ నటి హన్సికతో ప్రేమ ఆ ప్రేమ కథ కంచికే చేరడం లాంటి సంఘటనలు శింబుని ప్లేబాయ్‌గా చిత్రీకరించాయని చెప్పవచ్చు. అయితే 29 ఏళ్ల శింబులో ప్రస్తుతం మానసికంగా చాలా మార్పు వచ్చింది. దీన్ని పరిణితి అంటారో? లేక పరివర్తన అనవచ్చో అభిప్రాయాన్ని పాఠకులకే వదిలేద్దాం. మారిన శింబు మనోభావాలు తెలుసుకుందాం.
నటుడు ధనుష్, మీ అభిమానుల మధ్య గొడవలు తగ్గాయా? పెరిగాయా?
ఖచ్చితంగా పెరిగాయే గానీ తగ్గలేదు. ఇప్పుడు ఇంటర్‌నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మాధ్యమాలతో అభిమానుల మధ్య పోటీలు, తగాదాలు బహిరంగం అవుతున్నాయి. ఏదేమైనా ఇలాంటివి ఆరోగ్యకరం కాదు. ఏ నటుడైనా నచ్చితే చప్పట్లు కొట్టండి, ఈలలు వేయండి. నచ్చకపోతే వదిలేయండి. మరో విషయం వృత్తిపరంగా నటుడు ధనుష్ నాకు పోటీనే అయినా ఆయన పుట్టిన రోజు, ఇతర కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను. ధనుష్ నాకు సహ నటుడు. కష్టపడి పైకొచ్చారు. అందుకు నేను ఆయనకు గౌరవం ఇవ్వాలి.
నయన, హన్సికల భగ్న ప్రేమ ప్రతిఫలం ఏంటి?
మొదటి సారి కత్తిపోటుకే నొప్పి. ప్రాణం పోతుందేమోనన్న భయం ఉంటుంది. ఆ తరువాత కత్తిపోట్లకు కొత్తగా బాధేముండదు. అందువలన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. మన చేతుల్లో ఏమీ లేదు. దేవుడే దర్శకుడు. నేను కేవలం నటుడిని మాత్రమే. నేను రెండుసార్లు ప్రేమలో విఫలం కావాలన్నది దైవ నిర్ణయం అయి ఉంటుంది. అందులోను ఒక మంచి ఉండవచ్చుగా.
నయన, త్రిష, హన్సిక ఈ ముగ్గురితో నటించారు. మీకు సరైన జోడి ఎవరనుకుంటున్నారు?
విన్నైతాండి వరువాయా చిత్రం విడుదలానంతరం శింబు, త్రిషల జోడీ బాగుందన్నారు. నిజం చెప్పాలంటే త్రిషతో నటించడమే నాకు సౌకర్యంగా ఉంటుంది. ఆమె నాకు మంచి స్నేహితురాలు కూడా.
తాజాగా ఇదు నమ్మ ఆళు చిత్రంలో మళ్లీ నయనతో నటించడం గురించి?
ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రం కూడా వారికి అంతగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఒక కథానాయకుడికి కథానాయికకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం వారు నటించే చిత్రానికి అభిమానుల మధ్య ఆసక్తిని పెంచుతుంది. ఇదునమ్మ ఆళు చిత్రానికి అది భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
మీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారటగా?
నాకు అమ్మాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటా. వివాహం అనేది చూసిన వెంటనే నిర్ణయం తీసుకునే వ్యవహారం కాదు. నాలో ఇప్పుడే కొన్ని ఆధ్యాత్మికమైన మార్పులు కలిగాయి. నన్నొక నటుడిగా గుర్తించి ఒక స్థాయికి చేర్చిన తమిళ ప్రజలకు ఏదైనా చేయాలనే ఆశ కలిగింది. అందరికి 40 నుంచి 45 ఏళ్లలో జరగాల్సినవి నాకు 29 ఏళ్లలోనే జరిగాయి. తదుపరి 30 ఏళ్లు ప్రజల కోసం పాటుపడాలనుకుంటున్నాను. అలాగని రాజకీయాల్లో కొస్తానని భావించకండి. డబ్బు ఉంటే చాలు ప్రజాసేవకు. ఆ సేవలను నేను ప్రారంభిస్తాను.