
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, మరో మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు కేసులు నమోదైన నేపథ్యంలో.. బుధవారం మన్‌హటన్ క్రిమినల్ కోర్టుకు వీన్‌స్టీన్ హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది బ్రెఫ్‌మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తన క్లైంట్ వద్ద లేదని.. తమకు సాక్ష్యాధారాలు సేకరించుకునేందుకు సమయం సరిపోనందున తమకు గడువు ఇవ్వాలని కోరామన్నారు.
తన క్లైంట్‌పై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని బ్రెఫ్‌మాన్ తెలిపారు. త్వరలోనే వీన్‌స్టీన్ ఈ నేరారోపణల నుంచి బయటికి వస్తారని.. నిరాధారమైన ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలవవని ఆయన వ్యాఖ్యానించారు. వీన్‌స్టీన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన తర్వాత కూడా ఆ మహిళ ఆయనతో 10 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆ బంధం కొనసాగుతోందంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.
అయితే ‘తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి.. తనపై మోపబడిన అభియోగాలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని’ మన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సైరస్ వాన్స్ వ్యాఖ్యానించారు. కాగా, వీన్‌స్టీన్ దోషిగా తేలితే 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.