నేమ్‌లోనే ఫేమ్ ఉందట
నమ్మకం మనిషిలో చాలా మార్పులకు కారణం అవుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఫేమ్ వస్తుందంటే నేమ్‌ను మార్చడానికీ వెనుకాడరు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా మంది అసలు పేర్ల కంటే కొసరు (మధ్యలో వచ్చిన) పేర్లతో పాపులర్ అయ్యారన్నది నిజం. ఇక్కడ సెంటిమెంట్‌కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పేర్లు మార్చేస్తుంది. నటి నయనతార అసలు పేరు డయానా. ఈ విషయం చాలా మంది కి తెలియదు. నటి లక్ష్మీరాయ్ ఇటీవల తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్నారు.
ఇక ఆస్ట్రాలజీ కూడా బాగా పని చేస్తుంది. పేరులో ఒక అక్షరం చేర్చితే దశ తిరుగుతుందని ఒక అక్షరం, తీసేస్తే భవిష్యత్ బాగుంటుందని సూచించే జ్యోతష్కుల భావాలకనుగుణంగా పేరు మార్చుకునేవారు చాలా మంది ఉన్నారు. దీనికి నమ్మకమే మూలకారణం. తాజాగా నటి జననీ అయ్యర్ తన పేరులోని చివరి సగ భాగాన్ని తొలగించుకుని జనని అయ్యారు. ఈ బహుభాషా నటి, హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసినా రావలసిన నేమ్, ఫేమ్ రాలేదనే చెప్పాలి. బాలా వంటి విశిష్ట దర్శకుడి చిత్రం (అవన్ ఇవన్)లో నటించిన జననికి ఆ తరువాత అంతగా పేరు గానీ, అవకాశాలు గానీ రాలేదు.
పేరు మార్చుకుంటే టైమ్ బాగుంటుందని ఎవరయినా సలహా ఇచ్చారేమో తెలియదు కానీ జననీ అయ్యర్ ఇప్పుడు జననిగా అయ్యారు. దీనిపై ఆమె స్పష్టత ఇస్తూ పేరు మార్చుకోవడానికి ప్రత్యేకమయిన అంశం ఏది లేదన్నారు. తాను నటించిన తెగిడి చిత్రానికి ముందు అన్ని చిత్రాలకు జననీ అయ్యర్ అనే టైటిల్ కార్డులో రాసేవారన్నారు. తెగిడి చిత్రంలో జనని అని వేశారని చెప్పారు.
ఈ విషయాన్ని చిత్ర ప్రివ్యూ ప్రదర్శనప్పుడు గమనించానన్నారు. చిత్రం విజయం సాధించడంతో తన పేరు వర్కౌట్ అయ్యిందనిపించిందన్నారు. దీంతో ఇకపై జననిగానే కొనసాగాలని భావించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. తమిళం నూతన చిత్రం ఏమీ కమిట్ కాలేదని నేమ్ మార్చుకున్న ముద్దుగుమ్మ జనని పేర్కొన్నారు.