డ్రీమ్గర్ల్కు 66 ఏళ్లు!
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి, అక్కడి వెండితెరను ఏలిన డ్రీమ్గర్ల్ హేమమాలిని. ఒక్క ధర్మేంద్ర మాత్రమే కాదు.. చాలామంది హృదయాలను ఆమె కొల్లగొట్టారు. ఈ అందాల సుందరికి అప్పుడే 66 ఏళ్లు నిండాయి. ముంబైలో తన పెద్దకూతురు ఇషా డియోల్, అల్లుడు భరత్లతో తన పుట్టినరోజును చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీగా కూడా ఉన్న హేమమాలిని.. ఈ పుట్టినరోజుకు ఎలాంటి ఆర్భాటాలు మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నారు.
వాస్తవానికి తాను ఇప్పుడు తన నియోజకవర్గమైన మథురలో ఉండాల్సిందని, కానీ ఇప్పుడు అక్కడకు వెళ్లలేక, ముంబైలోనే పుట్టినరోజు చేసుకుంటున్నానని హేమమాలిని చెప్పారు. తన భర్త ధరమ్ జీ (ధర్మేంద్ర) ప్రస్తుతం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు న్యూజిలాండ్ వెళ్లారని, చిన్నకూతురు అహానా ఢిల్లీలో ఉందని, అందువల్ల తాను ఇక్కడ పెద్ద కూతురితోనే పుట్టినరోజు చేసుకుంటున్నానని ఆమె అన్నారు. ఇప్పటికీ తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి తనకు ఎప్పుడూ ప్రేమాభిమానాలు అందుతూనే ఉన్నాయని ఆమె అన్నారు.