డ్రీమ్గర్ల్కి (చెమట) చుక్కలు చూపిస్తున్న మథుర
అందాల నటీమణులు రాజకీయాల రఫ్పాటలో దిగనైతే దిగుతున్నారు కానీ దిగాక మాత్రం అన్నీ సమస్యలే. ఇన్నాళ్లూ రాజ్యసభ రూటులో పార్లమెంటు సభ్యురాలైన హేమామాలిని ఈ సారి ఉత్తరప్రదేశ్ లోని మథుర నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు.
అసలే మథుర... ఆపై మండుటెండ...దాంతో అలనాటి డ్రీమ్ గర్ల్ కి పగలే చుక్కలు ... అవే ... చెమట చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఆమె ఎయిర్ కండిషన్ కారు లో నుంచి బయటకు రావడం లేదు. కారు లోనుంచే చేతులు ఊపి, నమస్కారాలు పెడుతున్నారు. ఆమె ప్రత్యర్థి, రాష్ట్రీయ లోకదళ్ సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధురీ ఒక వైపు నియోజకవర్గమంతా చెలరేగి దున్నేస్తున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలు ఏసీ వదిలి బయటకు రమ్మని ప్రాధేయపడుతున్నారు. చివరికి పత్రికలు కూడా రాజకీయమంటే కెంట్ ప్యూరిఫయర్ యాడ్ కాదని వ్యాఖ్యానించడంతో తప్పనిసరై ఆమె ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
శ్రీకృష్ణుడి లీలా భూమి మథుర లో ప్రచారం మాత్రం హేమామాలిని ప్రాణాలమీదకి వచ్చింది. నిత్యం చేసే యోగ, ప్రాణాయామాల షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయి. ఒక్కో చోట మంచినీటి చుక్క కూడా దొరకడం లేదు. దాంతో ఆరు దశాబ్దాలుగా కాపాడుకున్న గ్లామర్ ఆవిరైపోతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. మరో వైపు బిజెపి నేతల వెన్నుపోట్లు, అలకలను మేనేజ్ చేయడం కూడా కష్టమైపోతోంది.
దక్షిణాది భరతనాట్యం నుంచి బొంబాయి బాలీవుడ్ దాకా, అయ్యంగార్ కుటుంబం నుంచి జాట్ వాలా భార్యగా, సప్నోంకా సౌదాగర్ నుంచి షోలే దాకా ఎన్నెన్నో పాత్రల్ని అవలీలగా పోషించిన హేమామాలినికి ఈ ఎన్నికలు మాత్రం ఒక పరీక్షలా నిలుస్తున్నాయి. బిజెపి క్యాడర్ల క్రమశిక్షణ వల్లో మరే కారణం వల్లో మొత్తం మీద ఆమెకు నగ్మాకు ఎదురవుతున్న సమస్యలు ఆమెకు ఎదురు కావడం లేదు. కానీ ఎండ కష్టాలు మాత్రం ఎండిపోయేలా చేస్తున్నాయి.
నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్నారు. వీటిలో 3.5 లక్షల మంది జాట్లు. ఈ జాట్లందరూ రాష్ట్రీయ లోకదళ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. దాదాపు 80 వేల మంది ముస్లింలున్నారు. 1.25 లక్షల మంది దళితులున్నారు. వారంతా బిఎస్ పీకి ఓటేసే అవకాశాలున్నాయి. ఈ మిగిలిన ఓట్లపైనే హేమామాలిని గురిపెడుతున్నారు.