శ్రీకృష్ణుడి నేలను ప్రపంచం చూసేందుకు..
మధుర: శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి నడయాడిన నేల ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు మధుర ఎంపీ, నటి హేమమాలిని నడుంకట్టారు. ఈ ప్రాంతంతోపాటు రాధాదేవీ జన్మించిన గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అక్కడ పర్యాటకానికి సంబంధించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే పలు రకాల ప్రాజెక్టులను కేంద్రం నుంచి రాబట్టిన హేమ వాటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రారంభించింది.
ఆ వివరాలను హేమ తెలియజేస్తూ.. మధుర అభివృద్ది విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ఒక్క ప్రాంతం కోసమే రూ.100కోట్లు మంజూరుఅయ్యేలా చేశానని, ప్రధాని మోదీ తన మాటను గౌరవించి నిధులు కేటాయించారని చెప్పారు. ఈ నిధులతో ఇప్పటికే శ్రీకృష్ణ థీమ్ పార్క్, ఫుడ్ కోర్టు, ఫుడ్ ప్రాసేసింగ్ యూనిట్, కంటెయినర్ డిపో పనులు మొదలుపెట్టామని చెప్పారు. కొన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభిస్తున్నట్లు, అలాగే, వృందావనానికి రాధారాణి రైలును కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇక, రాధాదేవీ జన్మించిన రావల్ గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నాని, ఆ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై ఈ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనున్నాయని చెప్పారు.