వైద్యులు ఉచిత సేవలందించాలి: నటుడు గోపీచంద్
అబిడ్స్ (హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు పేద, బడుగు వర్గాల కోసం ఉచితంగా వైద్య సేవలందించాలని సినీ హీరో గోపీచంద్ పేర్కొన్నారు. గత 18 ఏళ్లుగా వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించి మందులు కూడా పంపిణీ చేస్తున్న ఉమేష్ చంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆదివారం అబిడ్స్ బొగ్గులకుంటలో ఉమా హార్ట్ కేర్ సెంటర్‌లో డాక్టర్ ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో కొనసాగిన 186వ ఉచిత హృద్రోగ వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
డాక్టర్ ఉమేష్‌చంద్ర మాట్లాడుతూ.. ప్రతినెలా ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహించి ఎంతో ఖరీదైన వైద్యసేవలు, మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈసీజీ, రక్త పరీక్షలు, బ్లడ్ షుగర్, ఇతర చెకప్‌లు కూడా ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ప్రతినెలా 2వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 200 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.