రామ్‌డు శివమెత్తాడు
యువ హీరో రామ్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ కథానాయకుడు ఈ నెలాఖరులో ‘పండగ చేస్కో’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోపక్క ఇంకో రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలూ ఆయన పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నవే! రెండూ కొత్త దర్శకుల సారథ్యంలో రూపొందుతున్నవే కావడం విశేషం. రచయిత కిశోర్ తిరుమల ఒక చిత్రంతో, శ్రీనివాసరెడ్డి (దర్శకుడు సురేందర్ రెడ్డి సహాయకుడు) మరో చిత్రంతో దర్శకులుగా పరిచయమవుతున్నారు.
శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో పి. కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న సినిమాకు తాజాగా ‘శివం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘శివం’లో హీరో ఫస్ట్ లుక్ స్టిల్‌ను విడుదల చేశారు. రాశీ ఖన్నా హీరో యిన్ అయిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో రామ్ పాత్ర చిత్రణ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. క్లాస్‌నీ, మాస్‌ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఏప్రిల్ 27 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నాం.
వచ్చే నెల 10 వరకు ఇక్కడే షెడ్యూలు జరుపుతాం’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ ‘శివం’లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), రసూల్ (కెమేరా), పీటర్ హేన్ (ఫైట్స్) లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండడం విశేషం. ఈ సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ అంటున్న రామ్ ఈ ఏడాదే ‘శివమ్’తోనూ, మూడో సినిమాతోనూ జనం ముందుకు రావాలని కృషి చేస్తున్నారు. ఒక హీరోకు ఒకే ఏడాది మూడు రిలీజ్‌లంటే... ఈ రోజుల్లో గ్రేటే! కీపిటప్ రామ్!