
శ్రీమంతులు
వారసుల కోసం బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంచాలని, స్థిర, చరాస్థులు కొనాలని, సమాజంతో మనకేంటి? అనే ఆలోచనలో ఉంటారు
వారసుల కోసం బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంచాలని, స్థిర, చరాస్థులు కొనాలని, సమాజంతో మనకేంటి? అనే ఆలోచనలో ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు. తమకు పేరు, డబ్బు ఇచ్చిన సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే మంచి ఆలోచనతో మరికొంతమంది ఉంటారు. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ ఈ రెండో కోవకే చెందుతారు. ఆయన కుమారులు, హీరోలు సూర్య, కార్తీ కూడా అంతే. ఈ తండ్రీ కొడుకులు ‘అగరమ్ ఫౌండేషన్’ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమందిని చదివిస్తున్నారు. ఇప్పుడీ సంస్థ కార్యకలాపాల కోసం సొంత ఇంటిని కేటాయించేశారు. ఆ ఇంటితో శివకుమార్ అనుబంధం దాదాపు 40 ఏళ్లకు పైనే. సూర్య, కార్తీ, వారి సోదరి పుట్టి, పెరిగింది అక్కడే.
వాళ్ల పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కుటుంబం పెద్దది కావడంతో వేరే ఇంటికి మారాలనుకున్నారు. కొత్తగా కట్టించిన ఇంటికి ఈ కుటుంబం మారింది. ఆ ఇంటి పేరు ‘లక్ష్మీ ఇల్లమ్’. కాగా, చెన్నై టి. నగర్‌లో ఇప్పటివరకూ ఉంటూ వచ్చిన ఇంటిని అమ్మాలని శివకుమార్‌కి అనిపించలేదట. పిల్లలందరూ అక్కడే పెరిగి, పెద్దవాళ్లు కావడంతో ఆ ఇంటిని సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే కోట్లు పలికే ఇల్లు అయినప్పటికీ అమ్మకుండా అగరమ్ ఫౌండేషన్ కార్యకలాపాల కోసం ఆ ఇంటిని వినియోగించాలనుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆమోదించారట. కోట్లు సంపాదిస్తున్న ఈ శ్రీమంతులు.. ఇప్పుడీ మంచి పని చేసి, గుణం పరంగా కూడా శ్రీమంతులు అనిపించుకున్నారు.