
సినిమా సమాజానికి అద్దమైతే... ఒక్కోసారి ఆ అద్దం మీద పడ్డ కాంతి కళ్లను జిగేలుమనిపిస్తుంది.ఆ జిగేలే జీవితం అనుకుని చాలామంది మనసు పాడు చేసుకుంటారు.హీరోయిన్ సన్నగా ఉంటే.. అలా చిక్కిపోవాలని... బొద్దుగా ఉంటే అలానే తయారవ్వాలనే ఫీలింగ్‌తో ఓ చట్రంలో చిక్కుకుపోతున్నారు. బొద్దుగా ఉంటే ముద్దు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో హీరోయిన్లు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉండరని చిక్కిపోతేనే చాన్సులు చిక్కుతాయని సన్నబడే చట్రంలో చిక్కుకుంటున్నారు.వాళ్ళను చూసి మనమూ చిక్కుకుపోకుండా ఉంటేనే బెటర్.
బొద్దుగా, సన్నగా, నాజూకుగా, జీరో సైజ్... ఎలా ఉండాలన్నది పర్సనల్ చాయిస్. ప్రస్తుతం హీరోయిన్ల చాయిస్ స్లిమ్ వైపుకు మళ్లింది. దాంతో వాళ్ల దారి జిమ్‌కు మళ్లింది. బరువును తేలికగా తీసుకోవడం మానేశారు. వెయిట్ లాసే క్యారెక్టర్ గెయిన్ అంటున్నారు. పాత్ర బరువైనది అయితే ఆ బరువును మోయడానికి సన్నగా మారిపోవడానికి సిద్ధమయ్యారు. స్క్రిప్ట్ బావుంటే స్ట్రిక్ట్ డైట్‌కి కట్టుబడి ఉంటున్నారు. సినిమాలో కొత్త లుక్ కోసం మారిన వాళ్లు కొందరైతే, లుక్‌నే మార్చేయాలనే ఉద్దేశంతో తగ్గిన వాళ్లు ఇంకొందరు. అలా ఈ మధ్య కాలంలో సన్నగా మారిన కథానాయికలపై స్పెషల్ స్టోరీ.
సైలెన్స్ కోసం సైలెంట్‌గా
‘భాగమతి’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు అనుష్క. ఈ గ్యాప్‌లో సైలెంట్‌గా లుక్ మార్చేసే పనిలో పడ్డారు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన వెయిట్‌నంతా తగ్గించేయాలనుకున్నారు. అలాగే ‘బాహుబలి’లో కనిపించనదానికన్నా స్లిమ్‌గా అయిపోవాలనుకున్నారు. అందుకే చాలా రోజులు బయటకు కూడా కనిపించకుండా సైలెంట్‌గా చిక్కిపోయారు. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సైలెంట్ థ్రిల్లర్‌లో నటించారామె. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘నిశ్శబ్దం’లో సరికొత్త అనుష్కను చూస్తారని చిత్రబృందం ప్రామిస్ కూడా చేసింది. ఈ ఏడాది చివర్లో అనుష్కను కొత్త లుక్‌లో చూడొచ్చు. ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో పూర్తయింది.
హిట్ చేయడానికి ఫిట్‌గా...
పోలీస్ ఆఫీసర్ అంటే ఫిట్‌గా.. ఎవరైనా తప్పు చేస్తే హిట్ చేసేంత టఫ్‌గా ఉండాలి. అందుకోసమే మరింత స్లిమ్‌గా మారిపోయారు అంజలి. ఇంతకుముందు బొద్దుగా ఉండే అంజలి ఈ మధ్య ఎక్స్‌ట్రా వెయిట్‌ని కట్‌చేసి స్లిమ్‌గా మారిపోయారు. తెలుగులో సినిమాలు చేయడం కొంచెం తగ్గించినా తమిళంలో స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారామె. ‘నిశ్శబ్దం’ మూవీలో ఓ కీలక పాత్ర చేశారు. అది కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. యూనిఫామ్ వేసుకోవడం కోసం ఎనిమిది కిలోలను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారు. వెయిట్ తగ్గిన తర్వాత ఫిట్‌గా అనిపిస్తుందని తెలిపారు.
బికినీ బేబ్
ఇంతకుముందు లక్ష్మీ రాయ్. ఇప్పుడు రాయ్ లక్ష్మీ. పేరు మారింది. ఫిజిక్ కూడా మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న లక్ష్మీరాయ్ ఆ తర్వాత తగ్గారు. ఇప్పుడు ఏకంగా బికినీకి సెట్ అయ్యేట్లు తన ఫిజిక్‌ని సెట్ చేసుకున్నారు ‘ఫిట్‌నెస్ అంటే కేవలం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటమే కాదు. మెంటల్‌గానూ ఫిట్‌గా ఉంటాం. నాలో ఈ కొత్తమార్పుని ప్రేమిస్తున్నాను. ఇంతగా బరువు తగ్గడంకోసం చాలా కష్టపడ్డాను. ఫిట్‌గా మారాక కొత్తవ్యక్తిలా మారిపోయిన ఫీలింగ్ వస్తోంది. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే’ అని మోటివేషన్ కూడా ఇస్తున్నారు రాయ్‌లక్ష్మి. మామూలుగా బికినీలో హాట్ కనిపించే భామలను ‘బికినీ బేబ్’ అని యూత్ పిలుచుకుంటారు. రాయ్‌లక్ష్మి విడుదల చేసిన బికినీ ఫొటోలను చూసి, అలానే అంటున్నారు.
బెస్ట్ వెర్షన్ ఖన్నా
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బబ్లీగా ఉన్నారు రాశీ ఖన్నా. కొంత కాలంగా స్లిమ్ అయ్యే పనిలో పడ్డారు. ‘స్లిమ్ లుక్ ఓవర్ నైట్‌లో రాదు. వర్కౌట్స్ చేస్తూనే ఉండాలి’ అంటారు తన స్లిమ్ సీక్రెట్ అడిగితే. ఈ సరికొత్త లుక్‌లోకి రావడానికి రాశీ ఖన్నా సుమారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారట. కొత్త లుక్‌లోకి మారిపోయిన తర్వాత ‘నాకు నేను నా బెస్ట్ వెర్షన్‌లా అనిపిస్తున్నాను’ అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారామె. ‘క్రాష్ కోర్స్ డైట్స్‌ని పెద్దగా నమ్మను. రెండేళ్లు శ్రమించా. హెల్తీగా, హ్యాపీగా తగ్గా’ అన్నారు రాశీ. ఈ మధ్యనే తన స్లిమ్ ఫిజిక్‌ను బికినీలో దింపేశారు కూడా.
కీర్తి పెరిగింది.. తగ్గింది
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర కోసం కొంచెం బొద్దుగా అయ్యారు కీర్తీ సురేశ్. సావిత్రి పాత్ర తాలూకు బరువు బాధ్యతలను అద్భుతంగా మోశారు కీర్తీ. నటిగా గొప్ప పేరును సంపాదించారు. ‘మహానటి’ కోసం పెరిగిన బరువును తగ్గించేసి మరింత స్లిమ్‌గా మారిపోయారామె. ప్రస్తుతం చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా కోసమే ఈ లుక్ అని తెలిసింది.
పంచ్‌లైన్‌కి తగ్గట్టుగా...
‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగుకు పరిచయమైన పంజాబీ కుడి మెహరీన్. కొత్తలో మెహరీన్ కూడా కొంచెం బొద్దుగానే ఉండేవారు. ఇప్పుడు ‘హనీ ఈజ్ ది బెస్ట్’ (‘ఎఫ్ 2’లో మెహరీన్ పంచ్‌లైన్) మంత్రం జపించి స్లిమ్‌గా తయారయ్యారు. సినిమాలో పంచ్ లైనే ఇప్పుడు మెహరీన్ రియల్ లైఫ్‌కి వచ్చేసింది. కొత్త లుక్‌లోకి మారిపోయిన ఈ బ్యూటీని చూసి, ‘మెహరీన్ ఈజ్ ది బెస్ట్’ అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
25 రోజులు 10 కిలోలు
యంగ్ హీరోయిన్స్‌లో ఫిట్‌నెస్ మీద అమితంగా ఆసక్తి చూపించేవాళ్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటారని బాక్సింగ్ బ్యాగ్ గుద్ది మరీ చెప్పొచ్చు. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కోసం ఏకంగా పదికిలోలు తగ్గిపోయారామె. అది కూడా 25 రోజుల్లో. ఆ స్లిమ్ లుక్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. అయితే సన్నబడటంకోసం రకుల్ మరీ అంతలా పస్తులుండటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘పేషెంట్‌లా ఉన్నావు’ అని ప్రేమగా కామెంట్ కూడా చేశారు. ‘ఫిట్‌నెస్ అందరికీ ముఖ్యమే. ఎలా ఉండాలన్నది పర్సనల్ చాయిస్’ అని రకుల్ బదులిచ్చారు కూడా.
వెయిట్ ఈజ్ ఓవర్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ వాణీ కపూర్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న సినిమా ‘వార్’లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ఈ యాక్షన్ సినిమాలో బికినీలో అలరించనున్నారు వాణీ. బికినీ ఫిజిక్‌లోకి రావడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. ‘‘యోగా, గంటల తరబడి జిమ్, వెయిట్‌లిఫ్టింగ్ చేశాను. డైటింగ్ చాలా కఠినంగా అనిపించింది. చీట్ డేస్ కూడా లేకుండా శ్రమించాను’’ అని రహస్యం తెలిపారు. అన్నట్లు వాణీ కపూర్ తెరపై కనిపించి కొన్నాళ్లయింది. ఇప్పుడు వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ.. వెయిట్ తగ్గి మరీ కనువిందు చేయబోతున్నారు.
వెయిట్ గేమ్స్
వెయిట్ గేమ్స్ ఆడుతున్నారు జాన్వీ కపూర్. సినిమాలో పాత్రను బట్టి బరువు తగ్గుతూ పెరుగుతూ ఉండాలి. కానీ ఒకేసారి ఓ సినిమాలో బొద్దుగా, మరో సినిమాలో స్లిమ్‌గా కనిపించాల్సి వచ్చింది. దీంతో వెయిట్ గేమ్స్ ఆడుతున్నారామె. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్, రూహీ అఫ్జా’ సినిమాలు చేస్తున్నారామె. ‘కార్గిల్ గాళ్’ కోసం మొదట 6 కిలోలు పెరిగారు. ‘రూహీ అఫ్జా’ కోసం పది కిలోలు తగ్గారు. మళ్లీ కార్గిల్ గాళ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. మళ్లీ బరువు పెరిగే పనిలో ఉన్నారు జాన్వీ.- గౌతమ్ మల్లాది