చార్మి పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ చార్మికి స్వల్ప ఊరట లభించింది. సిట్ అధికారులు ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే విచారించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. మహిళా అధికారులు మాత్రమే ఆమెను విచారించాలని స్పష్టం చేసింది.
చార్మి వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించింది. అనుమతి లేకుండా రక్త నమూనా తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. చార్మికి ఇష్టమైన స్థలంలోనే విచారణ జరపాలని సూచించింది. వ్యక్తిగత లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.
తాము లేవనెత్తిన అంశాలపై గౌరవ న్యాయస్థానం మూడు కీలక ఆదేశాలిచ్చిందని చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. విచారణకు వెళ్లాలా, వద్దా అనేది ఆమె ఇష్టమని కోర్టు పేర్కొన్నట్టు చెప్పారు. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా శాంపిల్స్ తీసుకోవద్దని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. రేపు సిట్ విచారణకు చార్మీ హజరవుతారని తెలిపారు. అయితే ఎక్కడ హాజరవుతారనే దానిపై ఈ సాయంత్రం ఆమె నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, సాక్షి అని తెలిపారు. ఈ విషయాన్ని సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారని విచారణ కోసం అబ్కారీ కార్యాలయానికి వెళ్లాలని చార్మిని తాను సూచిస్తానని చెప్పారు. ప్రైవేటు స్థలాల్లో అయితే భద్రతాపరమై సమస్యలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.