హిందీ మీడియం సినిమాలోని దృశ్యం
సాక్షి, ముంబై : సరిహద్దు గొడవలైనా.. ఇరుదేశాల మధ్య సఖ్యత లేదని నాయకులు వాదిస్తున్నా.. ఎల్లలు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపి ఉంచే మాధ్యమం సినిమా అని మరోసారి నిరూపించారు చైనా ప్రేక్షకులు. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో భారతీయ సినిమాలపై మొదలైన చైనీయుల ప్రేమ బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురుపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జంటగా తెరకెక్కిన హిందీ మీడియం సినిమా చైనాలో విడుదలైన ఆరు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తర్వాత చైనాలో విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష అవసరమని చెబుతూనే.. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై విమర్శనాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తమ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో చైనా ప్రజలు ఆదరించారని స్థానిక మీడియా పేర్కొంది. ఈనెల 4న కిపోజియాన్(స్టార్టింగ్ లైన్) పేరుతో చైనాలో విడుదలైంది హిందీ మీడియం. పిల్లల విద్య కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా చైనీయులను అమితంగా ఆకర్షించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సామాజిక సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తెరకెక్కిన ఇలాంటి భారతీయ సినిమాలను చైనీయుల తప్పక ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment