ఎటు చూసినా మాస్కులు తొడుక్కున్న ముఖాలే. ఏ నలుగురి సంభాషణ విన్నా సారాంశం అదే. దీనంతటికీ కారణం.. ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రశాంతంగా బయట తిరగనివ్వడం లేదు. రాకపోకలు తగ్గిపోయాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. కరోనా ప్రభావం అన్ని పరిశ్రమల మీదా పడింది. చిత్రపరిశ్రమ మీద కూడా పడింది. షూటింగులు, రిలీజ్‌లు, ప్రమోషన్లను కరోనా చిత్రవిచిత్రంగా ఇబ్బంది పెడుతోంది.
రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యేలా చేస్తోంది. రెవెన్యూ దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకుల భద్రత, సినిమా భద్రతను (కలెక్షన్లు) ఆలోచించి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ తలకిందులయ్యాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇది. ‘క్యా కరోనా?’ అనుకోవడం మినహా ఏమీ చేయలేం. ఇక తారుమారైన సినిమాల పరిస్థితి తెలుసుకుందాం.
పోలీస్ నహీ ఆ రహా హై
సూపర్ పోలీస్‌ల పాత్రలతో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగన్‌తో ‘సింగం’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సింబా’ సినిమాలు తీశాక అక్షయ్ కుమార్‌ను ‘సూర్యవన్షీ’గా మార్చారు రోహిత్. ‘పోలీస్ ఆ రహా హై’ అన్నది క్యాప్షన్ (పోలీస్ వస్తున్నాడని అర్థం). కానీ టైమ్‌కి రావడంలేదు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణ్‌వీర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 24న ఈ సినిమా విడుదలవ్వాలి. ‘‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘సూర్యవన్షీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. సరైన టైమ్ వచ్చినప్పుడు ‘సూర్యవన్షీ’ వస్తాడు’’ అని చిత్రబృందం పేర్కొంది.
సింహం వాయిదా?
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటె సింహం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 26న ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ నెలకు వాయిదా పడుతుందని టాక్.
హాలీవుడ్‌లో...
అటు హాలీవుడ్‌కి వెళితే నాలుగైదు సినిమాల విడుదల ప్రస్తుతానికి ఆగింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో 9వ సినిమా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ని ఈ ఏడాది మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మా కొత్త చిత్రం కోసం మీ అందరూ (ఫ్యాన్స్) ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
అలాగే డిస్నీ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించిన ‘ములాన్’ చిత్రం మార్చి 27న థియేటర్స్‌లోకి రావాలి. 2018లో సూపర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘ఎ క్వయిట్ ప్లేస్’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎ క్వయిట్ ప్లేస్ 2’ చిత్రం మార్చి 18న విడుదల కావాలి. అయితే ఈ రెండు చిత్రాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. పోయిన వారమే జేమ్స్ బాండ్ కొత్త చిత్రం ‘నో టైమ్ టు డై’ విడుదల తేదీని నవంబర్‌కి మార్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
కరోనా ప్రభావం ఇంకా చాలా సినిమాల రిలీజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న టైమ్‌కి సినిమాని రిలీజ్ చేయకపోతే సినిమా నిర్మాణానికి తీసుకున్న డబ్బుకి ఇంట్రస్ట్ పెరుగుతుంది.. ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడితే.. ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్రాల రిలీజ్‌కు క్లాష్ ఏర్పడు తుంది. మొత్తం మీద కరోనా ఇండస్ట్రీని బాగానే కలవరపెడుతోంది.
కోబ్రాకు బ్రేక్
7 విభిన్న పాత్రల్లో విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను రష్యాలో ప్లాన్ చేసి, కొన్ని రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. అయితే విదేశీ రాకపోకలను తగ్గించేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాకముందే ‘కోబ్రా’ టీమ్ ఇండియా వచ్చేయాల్సి వస్తోందని దర్శకుడు ట్వీట్ చేశారు.
థియేటర్లు క్లోజ్
కరోనా తీవ్రత పెరుగుతున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో థియేటర్స్‌ను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆల్రెడీ కేరళలో కొన్ని రోజులుగా థియేటర్స్‌లో ప్రదర్శనను ఆపేశారు. తాజాగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, ఒడిస్సాలో థియేటర్స్‌ను ఈ నెల 31 వరకూ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.
టాలీవుడ్ పై ప్రభావం?
పలు తెలుగు చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై కరోనా ప్రభావం పడినప్పటికీ ప్రస్తుతానికి రిలీజ్ తేదీల్లో ఇప్ప టివరకూ ఏ సినిమా వాయిదా పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేస్తున్నట్టు ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.
– గౌతమ్ మల్లాది
Comments
Please login to add a commentAdd a comment