హాలీవుడ్ హిట్ వాక్ | Hollywood hit Walk | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హిట్ వాక్

Published Fri, Oct 16 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

హాలీవుడ్ హిట్ వాక్

హాలీవుడ్ హిట్ వాక్

ఫిలిప్ పెటిట్ అనే హై వైర్ ఆర్టిస్ట్ చేసిన సాహసం ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించి ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేసింది ఆ సాహసమే ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లేటెస్ట్ హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘ద వాక్’కి ఫిలిప్ పెటిట్ జీవితమే కథావస్తువు...
 
2015 సెప్టెంబరు 30
న్యూయార్క్‌లోని ‘ద వాక్’ ప్రీమియర్ షో  హీరో రెండు భారీ బహుళ అంతస్తుల భవనాల మధ్య కేబుల్ మీద నడిచే సీన్. ఆ టవర్లు సుమారు 1300 అడుగుల పైగా హైట్. పై నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరిగి గుండె ఆగిపోతుంది. అసలే  త్రీడీ ఫార్మట్. దాంతో ప్రేక్షకులు కూడా అంత హైట్‌లో ఉన్నట్టు ఫీలయ్యారు. ఒకటి కాదు... రెండు కాదు... ముప్పావు గంటలో అటూ ఇటూ ఎనిమిది సార్లు నడిచాడు. అలా నడుస్తూ కూడా మధ్యలో ఒంటి కాలి మీద నిలబడ్డాడు. దాని మీద అలా నడుం వాల్చాడు. ఆ ఎపిసోడ్ చూసి కొంతమంది ప్రేక్షకులు భయపడి వాంతులు కూడా చేసుకున్నారు. ఇదంతా ‘ద వాక్’ సినిమా క్లయిమాక్స్ మహాత్మ్యం.
 
రియల్ ఇన్‌స్పిరేషన్
‘ఫారెస్ట్ గంప్’, ‘కాస్ట్ ఎవే’ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు రాబర్ట్ జెమికిస్ ఓ పుస్తకం చదువుతున్నాడు. చివరి పేజీలు మాత్రం అతణ్ణి ఊపిరి తీసుకోనివ్వకుండా చేశాయి. ఆ పుస్తకం - ఫ్రెంచ్ హైవైర్ ఆర్టిస్ట్ ఫిలిప్ పెటిట్ రాసిన ‘టు రీచ్ ద క్లౌడ్స్’. 1974లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన ట్విన్ టవర్స్ మధ్య నడిచి సంచలనం సృష్టించిన ఫిలిప్ పెటిట్ తన జీవితానుభ వాలతో ఆ పుస్తకం రాశాడు.  2006 నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు రాబర్ట్.  2008లో జేమ్స్ మార్ష్ ఇతని జీవితం ఆధారంగా ‘మ్యాన్ ఆన్ ద వైర్’  డాక్యుమెంటరీ తీసి ఆస్కార్  సాధించాడు.
 
కథ ఏమిటంటే...
చిన్నతనంలో ఫిలిప్ పెటిట్‌ను  సర్కస్‌లో ఓ వ్యక్తి  తాడు మీద నడవడం ఆకర్షిస్తుంది. ఎప్పటికైనా అంత ఎత్తులో ఓ తాడు మీద  నడవాలనేది లక్ష్యంగా మారుతుంది. ఎవరూ చేయలేనిది చేయాలనే కసి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చే స్తూ ఉంటాడు. ఓ రోజు ఏదో పని మీద హాస్పిటల్‌కు వెళ్లిన ఫిలిప్  అక్కడ ఓ మ్యాగజైన్‌లో ఫొటో చూస్తాడు. అదే న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్. ఆ సమయంలో నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంటుంది. దొరికేసింది...తనకు సెట్ అయ్యే హైట్ దొరికింది అని ఎగిరి గంతేస్తాడు. వాటి మధ్య నడవాలని డిసైడైపోతాడు. మరి అతను ఆ ఫీట్ చేశాడా అన్నది మిగతా కథ.
 
ఫిలిప్‌తోనే హీరోకి శిక్షణ
‘ఇన్‌సెప్షన్’, ‘లూపర్’, ‘డార్క్ నైట్ రైజస్’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జోసఫ్ గోర్డన్ లెవిట్‌ను ఇందులో హీరోగా తీసుకున్నారు రాబర్ట్. మరి ఎంత గ్రాఫిక్స్‌లో చేసినా, హీరోకి తాడు మీద నడవడం వస్తే, సన్నివేశాలు నేచురల్‌గా వస్తాయని రాబర్ట్ ఆలోచన. ఏకంగా ఫిలిప్ పెటిట్‌ను రంగంలోకి దించి జోసఫ్‌కు ట్రైనింగ్ ఇప్పించారు. 8 రోజుల వర్క్ షాప్‌తో జోసఫ్ పర్ఫెక్ట్ అయ్యారు. గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్‌స్లే ఈ చిత్రంలో ఫిలిప్‌కు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నటించారు.
 
ప్రాక్టీస్ కోసం రియల్‌గానే...
సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. షాట్ గ్యాప్‌లో కూడా జోసఫ్ కఠిన సాధన చేస్తున్నారు. సెప్టెంబరు 11 దాడుల్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా నిర్మించిన  రెండు స్మారక స్తూపాల మధ్యలో నడవాలని అనుకున్నారు. అవి ఏకంగా 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. ప్రాక్టీస్‌గా ఉంటుందని జోసఫ్ వాటి మధ్య నిజంగానే  ఫీట్ చేశారు.
 
పురుడు పోసుకున్న 1974 నాటి న్యూయార్క్
సెప్టెంబరు 11 దాడుల్లో కూలిన ట్విన్ టవర్స్ స్థానంలో ఇప్పుడు పెద్ద ఆకాశ హర్మ్యం ఉంది.  పైగా 1974 నాటి న్యూయార్క్‌ను, ఆ ట్విన్ టవర్స్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం రాబర్ట్‌కు పెద్ద చాలెంజ్‌గా మారింది. ఫిలిప్ పాత్రతో ప్రేక్షకులు కూడా అంత హైట్‌లో ఆ కేబుల్ మీద ఉన్నామన్న ఫీలింగ్  కలిగించడానికి  గ్రాఫిక్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఫొటోల ఆధారంగా గ్రాఫిక్స్‌లో  1974 నాటి న్యూయార్క్‌కు పురుడు పోశారు. పైగా త్రీడీలో అయితే ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో త్రీడీలో ఈ చిత్రాన్ని తీశారు.
 
నాలుగు నెలల్లో ప్యాకప్
2014 మే 26న ఈ సినిమా  షూటింగ్ ప్రారంభించి, నాలుగు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రానికి  మొత్తం 227 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మంచి వసూళ్ళు రాబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement