
'యాక్షన్ కాదు.. కామెడీ చేయాలని ఉంది'
ముంబయి: హృతిక్ రోషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది డ్యాన్స్లు.. అదిరిపోయే స్టెప్పులు.. ఆ తర్వాత యాక్షన్, రోమాన్స్. కానీ, ఆయనలో ఇప్పటి వరక కామెడీ యాంగిల్ చూడనే లేదు. అయితే త్వరలోనే తన అభిమానులకు ఆ కోరిక తీరబోతుండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్షన్, రోమాన్స్ చిత్రాలతో మాత్రమే తన అభిమానులను కనువిందుచేసి భారీ హిట్లు కొట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్ హీరో కుదిరితే కామెడీ చిత్రం చేస్తానంటున్నాడు.
ఇటీవల విడుదలైన హౌజ్ ఫుల్ 3 చిత్ర ట్రైలర్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అయిన ఆయన తనకు ఈ చిత్ర ట్రైలర్ ఎంతో నచ్చిందని, ట్రైలర్ అదుర్స్ అని పొగిడాడు. అందులోని కామెడీ అదిరిపోయిందని, ట్రైలర్ పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఆ సినిమా రాగానే చూస్తానని, ఎప్పుడెప్పుడు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, నర్గీస్ ఫక్రీ, అభిషేక్ బచ్చన్ల కామెడీని చూస్తానా అని ఎదురుచూస్తున్నాని చెప్పాడు. వారు చేసే కామెడీ నుంచి స్ఫూర్తిపొంది తన అభిమానులకోసం ఓ కామెడీ సినిమా చేయాలని భావిస్తున్నాని చెప్పాడు. జూన్ 3న హౌజ్ ఫుల్ 3 చిత్రం విడుదలకానుంది.