'హైపర్' మూవీ రివ్యూ
టైటిల్ : హైపర్
జానర్ : యాక్షన్ కామెడీ
తారాగణం : రామ్, రాశీఖన్నా, సత్యరాజ్
సంగీతం : గిబ్రాన్
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్
ఎనర్జిటిక్ స్టార్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నా.. భారీ కలెక్షన్లు సాధించే స్థాయి కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రామ్, హైపర్ సినిమాతో మరోసారి తనలోని ఎనర్జి లెవల్స్ను చూపించేందుకు రెడీ అయ్యాడు. నేను శైలజ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న రామ్, తిరిగి తన పాత మాస్ జానర్లో చేసిన ఈ సినిమా.. రామ్ సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసిందా..? రభస ఫెయిల్యూర్తో కష్టాల్లో పడ్డ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రామ్తో కలిసి హిట్ ఇచ్చాడా..?
కథ :
అంతా సూరి అనే పిలిచే సూర్య (రామ్) హైపర్ కుర్రాడు. ఎంతో నిజాయితీగా పనిచేసే ప్రభుత్వోద్యోగి నారాయణ మూర్తి(సత్యరాజ్) కొడుకు సూరి. సూరికి తండ్రి అంటే ఎంతో ప్రేమ.. అప్పుడప్పుడు ఆ ప్రేమ నారాయణ మూర్తిని ఇబ్బంది పెట్టే స్థాయిలో కూడా ఉంటుంది. ఉద్యోగి నారాయణమూర్తి పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న సమయంలో మినిస్టర్ రాజప్ప( రావూ రమేష్) తన కాంప్లెక్స్కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఇబ్బంది పెడతాడు. అయితే నిబందనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో నారాయణ మూర్తి పర్మిషన్ ఇచ్చేందుకు అంగీకరించడు. అప్పుడు మినిస్టర్ రాజప్ప ఏం చేశాడు..? నారాయణ మూర్తి సమస్య తెలుసుకున్న కొడుకు సూరి రాజప్పను ఎలా ఎదుర్కొన్నాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
తన హై ఎనర్జీ పర్ఫామెన్స్ తో రామ్ సినిమాలో స్పీడు మరింత పెంచాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ను బాగా పండించిన ఎనర్జిటిక్ స్టార్, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. రాశీఖన్నాకు నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. ఇక మధ్యతరగతి తండ్రిగా నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. రామ్, సత్యరాజ్ల నటన సినిమాకు మేజర్ హైలెట్గా చెప్పుకోవచ్చు. విలన్గా రావూ రమేష్ నటన సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. కామెడీ పండిస్తూనే విలనిజాన్ని చూపించాడు.
సాంకేతిక నిపుణులు :
ఈ సారి ఎలాగైన సక్సెస్ కొట్టాలన్న కసితో సినిమా చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాను తెరకెక్కించాడు. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రీన్ప్లే ఫస్ట్ హాఫ్ను ఎంటర్టైనింగ్గా నడిపించాడు. కానీ సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు లవ్ ట్రాక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. అదే సమయంలో అనవసరమైన సిచ్యువేషన్స్లో పాటలు రావటం కూడా ఇబ్బందిగా మారింది. గిబ్రాన్ సంగీతం, మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 14 రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రదారుల నటన
ఫస్ట్ హాఫ్ కామెడీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ లైన్
సెకండ్ హాఫ్ పాటలు
ఓవరాల్గా హైపర్ కాస్త రొటీన్ అనిపించినా.. అలరించే కామెడీ ఎంటర్టైనర్