తండ్రిని గెలిపించే కుమారుడి కథ
‘‘జీవితంలో డబ్బు సంపాదించాలంటే మైండ్‌లో, మనుషులను సంపాదించాలంటే హార్ట్‌లో కరెక్ట్‌గా ఉండాలంటారు. మైండ్‌లో ఎంత కరెక్ట్‌గా ఉన్నానో తెలీదు గానీ.. మిమ్మల్ని (అభిమానులు) చూసినప్పుడు హార్ట్‌లో కరెక్ట్‌గా ఉన్నాననిపిస్తోంది’’ అన్నారు రామ్. ఆయన హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన సినిమా ‘హైపర్’. రాశీఖన్నా హీరోయిన్.
జిబ్రాన్ సంగీతమందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, హీరో నాని థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతలు ముగ్గురిలో అనీల్ దర్శకుడిలా, రామ్ కథకుడిలా, గోపీ నిర్మాతలా ఆలోచిస్తారు. ‘జగడం’ నుంచి ఇప్పటివరకు రామ్‌లో ఏ మార్పూ లేదు. చాలా హైపర్’’ అన్నారు. ‘‘14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘దూకుడు’ విడుదలై ఐదేళ్లయింది. ‘హైపర్’తో ‘దూకుడు’ వంటి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హరీష్ శంకర్. రామ్ మాట్లాడుతూ - ‘‘సంతోష్ శ్రీనివాస్ గురించి తెలియనివాళ్లు.. ‘టైటిల్ బాగా పెట్టారు’ అంటున్నారు.
తెలిసినోళ్లు.. ‘బాగా పెట్టుకున్నావ్’ అంటున్నారు. నాకన్నా దర్శకుడే బాగా హైపర్. డబ్బు కోసం వచ్చేవాళ్లు చేతిలో డబ్బు ఉన్నంతవరకూ ఉంటారు. ప్యాషన్‌తో వచ్చేవాళ్లు గుండెల్లో ప్యాషన్ ఉన్నంతవరకూ ఉంటారు. ప్రతి సినిమాకీ మా నిర్మాతల ప్యాషన్ పెరుగుతోంది. నాకు ఇంకో హోమ్ బ్యానర్ దొరికింది. జిబ్రాన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కమర్షియల్ సినిమాల స్టయిల్‌లో కాకుండా నిజాయితీగా ఏదో కొత్తగా చెప్పాలని రాసుకున్న కథే ఈ ‘హైపర్’. జీవితంలో ప్రతి వ్యక్తికీ తండ్రే హీరో. ఆ తండ్రిని గెలిపించే కుమారుడి కథ ఇది’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్, నిర్మాతలు రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట, హీరోయిన్ రాశీఖన్నా, నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, దామోదర ప్రసాద్, దర్శకులు కిశోర్ తిరుమల, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.