దసరా హౌస్‌ఫుల్! | Dussehra Housefull | Sakshi
Sakshi News home page

దసరా హౌస్‌ఫుల్!

Published Mon, Sep 12 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

దసరా హౌస్‌ఫుల్!

దసరా హౌస్‌ఫుల్!

 సినిమాలు రిలీజయ్యాక థియేటర్స్ ఫుల్ అవడం కామన్. కానీ, ఈసారి దసరా... చాలా స్పెషల్.  రిలీజ్ కన్నా ముందే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఒకటీ రెండు కాదు... ఏకంగా డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అప్పుడే కర్చీఫ్ వేసేశాయి. పెద్ద స్టార్స్ లేరన్న మాటే కానీ, యువ హీరోల సినిమాలు సై... అంటే సై... అంటున్నాయి. ఇన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం మాటేమో కానీ, ఈసారి ఆడియన్స్‌కి వినోదం దొరకడం మాత్రం ఖాయమనే అనిపిస్తోంది. బాక్సాఫీస్ దసరాకి... ఇది ‘సాక్షి ఫ్యామిలీ’ టీజర్...
 
 హైపరున్నోడు.. తండ్రిపై ప్రేమున్నోడు!
 చిత్రం: హైపర్, నటీనటులు: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, నరేశ్...
 దర్శకుడు: సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు: అనిల్ సుంకర,
 రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, విడుదల తేదీ: సెప్టెంబర్ 30.

 ‘బాబోయ్.. నా కుమారుడి ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు’ అని ఓ తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమనుకున్న ఆ తండ్రి కుమారుడి అతి ప్రేమను తట్టుకోలేకపోతాడు. కొడకు అంత హైపర్. ఈ హైపర్ యాక్టివ్ కుర్రాడి కథ ఏంటి? అన్నదే ‘హైపర్’ చిత్రం. ‘కందిరీగ’ తర్వాత హీరో రామ్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ తండ్రీకొడుకుల కథకు రామ్ ఎనర్జీకి తగ్గట్టు ఫైట్స్, కామెడీ, హీరోయిన్‌తో ప్రేమాయణం జోడించి పసందైన విందు భోజనం లాంటి కమర్షియల్ సినిమా సిద్ధం చేశామని దర్శకుడు చెబుతున్నారు. విజయదశమికి బోణీ కొడుతున్న చిత్రమిదే. అక్టోబర్ 1న అమ్మవారి నవరాత్రులు మొదలు. అంతకు ఒక రోజు ముందే సెప్టెంబర్ 30న ‘హైపర్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.
 
 లవ్.. లైఫ్.. ఫీల్..
 చిత్రం: ప్రేమమ్, నటీనటులు: నాగచైతన్య, శ్రుతీహాసన్,
 అనుపమా పరమేశ్వరన్, మడోన్నా, దర్శకుడు: చందు మొండేటి,
 నిర్మాత: ఎస్.నాగవంశీ, విడుదల తేదీ: అక్టోబర్ 7

 రియల్ లైఫ్‌లోనైనా.. రీల్ లైఫ్‌లోనైనా.. ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ ప్రేమకు లేదు! ఆ ఫీలింగ్ ఎప్పుడూ మనల్ని పలకరిస్తుంది. ఓ యువకుడి జీవితంలో ఇదే జరిగింది. మూడుసార్లు ప్రేమలో పడ్డాడు. ఓ ప్రేమకథకు ఫుల్‌స్టాప్ పడిన తర్వాత మరో కథ మొదలైంది. లైఫ్‌లో లవ్ అనే ఫీలింగ్ ఏం మ్యాజిక్ చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘ప్రేమమ్’. ముగ్గురు హీరోయిన్లతో నాగచైతన్య నటించిన తొలి చిత్రమిది. దర్శక, నిర్మాతలతోనూ చైతూకి ఇది ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రిలీజైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్ లవ్. ఏ భాషలోనైనా తిరుగుండదు. మలయాళంలో ‘ప్రేమమ్’ సూపర్ డూపర్ హిట్. ఈ తెలుగు రీమేక్‌పై మంచి అంచనాలే ఉన్నాయి.
 
 బీడీ ఫ్రెండ్స్.. యాక్షన్ గురూ!
 చిత్రం: ఇజం, నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, జగపతిబాబు, అదితీ ఆర్య, దర్శకుడు: పూరి జగన్నాథ్,
 నిర్మాతలు: నందమూరి కల్యాణ్‌రామ్, విడుదల తేదీ: అక్టోబర్ 7

 వ్యవస్థను గౌరవించే హీరోలు ఎవరైనా మాఫియా డాన్‌లతో ఫ్రెండ్‌షిప్ చేస్తారా? పూరి జగన్నాథ్ హీరోలు చేస్తారండీ! ‘పోకిరి’ చూడలేదా! పూరి తాజా సినిమా ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్ జర్నలిస్ట్‌గానూ, జగపతిబాబు జావేద్ భాయ్‌గానూ కనిపించనున్నారు. జర్నలిస్ట్‌కి, జావేద్ భాయ్‌కి బీడీల దగ్గర ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఈ బీడీ ఫ్రెండ్స్ కహానీ ఏంటి? జర్నలిస్ట్ ఏం చేశాడనేది ‘ఇజం’లో చూడమంటున్నారు. ఆల్రెడీ రిలీజైన పూరి మార్క్ టీజర్, కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాయి. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయడంలో పూరి స్పెషలిస్ట్ కావడంతో ఈ ఫిల్మ్‌తో కల్యాణ్‌రామ్‌కి యాక్షన్ ఇమేజ్ వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
 
 వన్.. టు.. త్రీ... హారర్ ప్లస్ కామెడీ!
 చిత్రం: అభినేత్రి, నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్,
 దర్శకుడు: ఏ.ఎల్.విజయ్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ,
 విడుదల తేదీ: అక్టోబర్ 7.

 ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఏ సినిమా సక్సెస్ అయితే ఆ ఫార్ములాను ఫాలో అవడం కామన్. హారర్ ప్లస్ కామెడీ.. ప్రస్తుతం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఫార్ములా. దీన్ని ఫాలో అవుతూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్ విజయ్ తీసిన సినిమా ‘అభినేత్రి’. హీరోయిన్ కావాలని ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి మరణిస్తుంది. అదే ఇంట్లో కొత్తగా పెళ్లైన జంట (ప్రభుదేవా, తమన్నా) అద్దెకు దిగుతారు. మరణించిన అమ్మాయి ఆత్మ తమన్నాలో ప్రవేశించి ఏం చేసిందనేది చిత్రకథ. హారర్, కామెడీలతో పాటు ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ముగ్గురూ మూడు భాషల్లోనూ మంచి పేరున్న నటీనటులు కావడం ఈ మూడు భాషల సినిమాకు ప్లస్ పాయింట్.    
 
 కనులారా వినుకోండి..
 చిత్రం: మన ఊరి రామాయణం, నటీనటులు: ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, సత్య, దర్శకుడు: ప్రకాశ్‌రాజ్,
 నిర్మాతలు: రాంజీ, ప్రకాశ్‌రాజ్ విడుదల తేదీ: అక్టోబర్ 7.

 ‘‘మనలో లోపాలు వదిలేసి ఏవేవో చూస్తుంటాం. పనికొచ్చే విషయం తప్ప, ఏవేవో మాట్లాడతాం. మనసారా చెబుతాన్నా. చెవులారా వినుకోండి. కనులారా చూడండి. ఇది ‘మన ఊరి రామాయణం’. మనలోని రామాయణం. ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటారు. అలాంటి వ్యక్తి కథ ఇది’’ అంటూ ప్రకాశ్‌రాజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. టీజర్, ట్రైలర్‌లను బట్టి ఇది ఫ్యామిలీ సినిమా. అందులోనూ సస్పెన్స్ డ్రామా అని అర్థమవుతోంది. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించిన గత చిత్రాలు ఆయన దర్శకత్వ అభిరుచికి అద్దం పట్టాయి. దాంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించనున్నారు.
 
 దస్ కా దమ్!
 ఒకట్రెండు కాదు.. దసరాకి ఏకంగా ‘దస్’ (పది) సినిమాలకు పైనే విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలా? మరి థియేటర్ల సంగతేంటి? ప్రతి సినిమాకీ సరిపడా థియేటర్లు దొరుకుతాయా? థియేటర్లను పక్కన పెడితే.. ప్రేక్షకుల సంగతేంటి? అన్ని సినిమాలనూ చూస్తారా? ఈ ప్రశ్నలకు సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఒక్కటే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలను వారు గుర్తు చేస్తున్నారు. ఈ నాలుగూ సంక్రాంతికి విడుదలై మంచి విజయాలు, వసూళ్లు సాధించాయి. మంచి సినిమాలు ఒకే వారంలో విడుదలైనా, ప్రేక్షకాదరణ లభిస్తుందనడానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఏముంటుందంటున్నారు! అయినప్పటికీ.. సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లలో కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే.. ఈనెల 23న అంటే దసరాకు రెండు వారాల ముందు నాని ‘మజ్ను’ విడుదలవుతోంది. విజయదశమికి తప్పకుండా ఎన్నో కొన్ని థియేటర్లలో ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘నిర్మలా కాన్వెంట్’, ‘సిద్ధార్థ’ సహా ఈ శుక్రవారం దాదాపు పది సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి పేరొస్తే పాతిక రోజులు థియేటర్లలో ఉండడం ఖాయం. మరి.. తదుపరి విడుదలయ్యే సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయో? అని కొందరు ఆలోచిస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.. పెద్దలందరూ కలిసి అన్ని సినిమాలకూ థియేటర్లు అందేలా చేస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మరి.. దసరాకు ‘దస్’కు పైనే విడుదలయ్యే సినిమాల్లో ‘దమ్ము’న్నవి ఎన్ని? అనేది వేచి చూడాలి.
 
 బరిలో... చాలానే!
 ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’, సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’, ‘లక్ష్మీదేవి సమర్పించు.. నేడే చూడండి’తో పాటు మరి కొన్ని సినిమాలు సైతం ఈ దసరాకు బాక్సాఫీస్ బరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ సినిమాల తర్వాత దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం..’తో హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. అల్లరోడు నటించిన ఫస్ట్ హారర్ మూవీ ఇది. ‘ఈడు గోల్డ్ ఎహే’ విషయానికి వస్తే - ఇందులో సునీల్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. వీరు పోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక మరో సంచలనం - రూ. 75 కోట్ల ‘జాగ్వార్’. ఒక కొత్త హీరోతో ఇంత బడ్జెట్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. తనయుడు నిఖిల్‌కుమార్ కోసం కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి ఈ భారీ చిత్రం ‘జాగ్వార్’ను నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించగా, శిష్యుడు మహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు.
 
 - సత్య పులగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement